Monday, January 20, 2025

యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు.. మరణించే వరకూ జైలులోనే
ఉగ్ర నిధుల చేరవేత కేసు
ప్రత్యేక న్యాయస్థానం శిక్షల ఖరారు
హైకోర్టు అప్పీలుకు వీలు, శ్రీనగర్‌లో ఉద్రిక్తతలు

న్యూఢిల్లీ: కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఇక్కడి పటియాలా ప్రత్యేక న్యాయస్థానం బుధవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఉగ్రవాద నిధుల చేరవేత కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (నియా) మాలిక్‌పై దర్యాప్తు జరిపింది. ఈ వ్యక్తి తీవ్రస్థాయి నేరానికి పాల్పడినందున అత్యంత గరిష్ట శిక్ష అంటే మరణశిక్ష విధించాలని నియా కోరింది. డిఫెన్స్ వర్గాలు జీవిత ఖైదుకోసం డిమాండ్ చేసింది. ‘ఈ కేసులో మాలిక్‌పై కోర్టు రెండు యావజ్జీవ శిక్షలు, ఐదు పది సంవత్సరాల కఠిన జైలు శిక్షలు ఖరారు చేసింది. ఇవన్నీ కూడా ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది. దీనితో పాటు రూ 10 లక్షల నగదురూపేణా చెల్లించాల్సిన జరిమానాను కూడా విధించింది’ అని లాయర్ ఉమేష్ శర్మ తెలిపారు. వివిధ కేసులకు సంబంధించి ఆయనపై వేర్వేరు జైలు శిక్షలు జరిమానాలు ఖరారు చేశారని తెలిపారు. నియా ప్రత్యేక న్యాయస్థానం తీర్పుపై మాలిక్ ఇప్పుడు హైకోర్టులో అప్పీలుకు వెళ్లేందుకు వీలుంది. ప్రస్తుతం కేసు ప్రత్యేక న్యాయస్థానం విచారణ పరిధిలో ఉన్నందున తాను తనపై అత్యంత కటువైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం పరిధిలో జరిగే టెర్రర్ ఫండింగ్ కేసులో అభియోగాలన్నింటినీ అంగీకరిస్తున్నట్లు ఓ దశలో మాలిక తెలిపారు. ఈ క్రమంలో నియా కోర్టు శిక్ష స్థాయిని పేర్కొంటూ తీర్పు వెలువరించింది. ఆయనను ఇప్పుడు విధిస్తున్న పలు శిక్షల క్రమంలో తుది శ్వాస వరకూ జైలులోనే ఉంచాల్సి ఉంటుందని ఆదేశించింది.
సరెండర్ నాటి నుంచి గాంధీ మార్గమే: మాలిక్
ఇక విచారణల దశలలోనే మాలిక్ తాను మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఆచరించిన వ్యక్తిని అని, అప్పట్లో వాజ్‌పేయి ప్రభుత్వం తనకు పాస్‌పోర్టు మంజూరు చేసిందని, ప్రపంచవ్యాప్తంగా తిరిగేందుకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిందని, మరి తాను క్రిమినల్‌ను అయితే ఆ సౌకర్యం ఎందుకు కల్పిస్తారని మాలిక్ ప్రశ్నించారు. 1994లో ఆయుధాలు వీడి లొంగిపోయిన నాటి నుంచి కూడా గాంధీ ఆశయాలనే పాటిస్తూ వచ్చానని, కశ్మీర్‌లో అప్పటినుంచి అహింసాయుత రాజకీయాలకు దిగానని వివరించారు. గత 28 ఏండ్లలో తనకు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు భారతీయ నిఘా సంస్థలు నిర్థారించగలవా? అని సవాలు విసిరారు. నిరూపిస్తే తాను రాజకీయాలు వీడి, తనకు తాను ఉరిపెట్టుకుని చనిపోతానని తెలిపాడు. మాలిక్‌కు బుధవారం నాటి కోర్టు తీర్పులు మరణశిక్ష పడుతుందని వార్తలు వెలువడటంతో శ్రీనగర్ ఇతర ప్రాంతాలలో ఉద్రిక్తత నెలకొంది. దుకాణాలు మూసివేశారు. కొన్ని చోట్ల రాళ్లు రువ్విన ఘటనలు జరిగాయి. భద్రతా బలగాలు భాష్పవాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టారు.
మాలిక్‌కు విస్తృత ఉగ్రనిధుల లింక్: కోర్టు
యాసిన్ మాలిక్‌కు ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలతో లింక్‌లు ఉన్నాయని, జమ్మూ కశ్మీర్‌లో స్వాతంత్ర పోరు పేరిట ఉగ్రవాదులను సమకూర్చడం, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దిగడం వంటి పనులకు సరైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడని అంతకు ముందు కోర్టు తెలిపింది. ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ ఈ నెల 19వ తేదీనే యాసిన్ మాలిక్ దోషి అని నిర్థారించారు. ఇప్పుడు శిక్ష తీవ్రతను వెలువరించారు. ఈ నెల 10వ తేదీన కోర్టు ముందు మాలిక్ తాను అభియోగాలను వ్యతిరేకించడం లేదన్నారు.

Yasin Malik Sentenced to life in jail

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News