అమరావతి: ప్రభుత్వ పథకాలు అందడం లేదని పంచాయతీ వార్డు మెంబర్ తనయుడు గ్రామ సచివాలయంలో విధ్వంసం సృష్టించడంతో పాటు మహిళ పోలీస్‌తో అనుచితంగా ప్రవర్తించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా ముప్పాళ్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైసిపి నేత, ముప్పాళ్ల గ్రామ వార్డు మెంబర్ తలకోల భారతి కుమారుడు కోటిరెడ్డి తమకు పభుత్వం పథకాలు అందడలేదని గ్రామ సచివాలయానికి వచ్చి ఉద్యోగులతో గొడవ పెట్టుకున్నాడు. అనంతరం కంప్యూటర్, ప్రింటర్లను ధ్వంసం చేశాడు. గ్రామ పంచాయతీ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కోటి రెడ్డి అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తీసుకెళ్లారు. మహిళ కానిస్టేబుల్ అతడి ఫోన్ తీసుకోవడంతో ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. కొద్ది సేపు మహిళ కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.