హైదరాబాద్: టిడిపి అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీపై ఎపిలోని అధికార వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్యాకేజీ కోసమే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ అయ్యారని దుయ్యబట్టారు. టిడిపితో పవన్ అనాధికార పొత్తులో ఉన్నారనే విషయాన్ని తాము మొదట్నుంచీ చెబుతున్నామని, అదే విషయం ఈరోజు నిజమైందని వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్‌కు విశాఖపట్నంలో ఏదో జరిగితే చంద్రబాబు కలవడం ఏమిటి?, అలాగే కుప్పంలో చంద్రబాబు పర్యటనను ప్రభుత్వం అడ్డుకుంటే హైదరాబాద్‌లో పవన్ పరామర్శించడం ఏంటని వ్యంగ్యంగా వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు.
సంక్రాంతికి అందరి ఇంటికి గంగిరెద్దులు వెళ్ళినట్లు చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్ళి డూ.. డూ.. బసవన్నలా తలూపారని ఎపి మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. మరోమంత్రి గుడివాడ అమరనాథ్ సైతం తీవ్ర విమర్శలు చేశారు. సంక్రాంతి పండుగ మామూళ్ళ కోసం చంద్రబాబు వద్దకు దత్తపుత్రుడు పవన్ వెళ్ళారంటూ విమర్శించారు. ఒంటిరిగా గెలవలేనని దత్తపుత్రుడితో చంద్రబాబు కలుస్తున్నారని పవన్‌కు ఒక అజెండా అంటూ లేదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ విమర్శించారు. మరోమంత్రి రోజా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌కు ప్రజల ప్రాణాల కంటే ప్యాకేజీనే గొప్పదా అని ప్రశ్నించారు.
స్వాగతించిన ఎంపి రఘురామ కృష్ణ రాజు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల భేటీని వైసీపీ అసమ్మతి ఎంపి రఘురామ కృష్ణం రాజు స్వాగతించారు. చంద్రబాబుకు పవన్ సంఘీభావం తెలపడం శుభపరిణామం అని కొనియాడారు. ప్రజాస్వామ్యాన్ని అనిచివేసే ఫాసిస్టు జీవోలపై సమిష్టి పోరాటం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే విజయదశిమి లోగా ప్రజలు సరైన తీర్పు ఇస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.