కనుమ పండగ కానుకగా అధికార పార్టీ వైసిపికి చెందిన ఓ ఎమ్మెల్యే.. పార్టీ కార్యకర్తలను ఖుషీ చేసేందుకు కోళ్లు, మద్యం బాటిళ్లను పంపిణీ చేశాడు. అయితే, దీనిపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో.. ఆ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్టణం సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్..నగరంలోని అశీలుమెట్టలో రామబాణం పేరుతో జూనియర్ కళాశాలను నడుపుతున్నారు. మంగళవారం కనుమ పండగ సందర్భంగా తన కార్యకర్తలందరికీ మంచి గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ చేశాడు.
ఇందులో భాగంగా కళాశాలలో కార్యకర్తలందరితో సమావేశమయ్యారు. అనంతరం వచ్చినవారందరికీ ఒక హాఫ్ బాటిల్ మద్యంతోపాటు రెండు కిలోల కోడిని పంపిణి చేసినట్లు సమాచారం. అ సమయంలో వాసుపల్లి కారు అక్కడే ఉండడంతో.. ఎమ్మెల్యే స్వయంగా మద్యం, కోళ్లను పంపిణి చేస్తున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలేజీలో ఇలాంటి కార్యక్రమాలకు తెరలేపిన ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యే తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు