Monday, December 23, 2024

బ్రోకర్ల ట్రాప్‌లో వైసిపి ఎంఎల్‌ఎలు?

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో మరిన్ని కమల్‌ఫైల్స్ కుట్రలు బట్టబయలౌతున్నట్లు తెలుస్తోంది. సిట్ అధినేత సి వి ఆనంద్ నేతృత్వంలోని సిట్ బృందం దూకుడు పెంచి, దర్యాప్తును వేగవంతం చేసింది. తెలంగాణ ప్రభుత్వా న్ని అస్థిరపర్చే విధంగా కుట్ర పన్ని అడ్డంగా దొరికిపోయిన బిజెపి, మరో మూడు రాష్ట్రాల్లోనూ ఇదే తరహా కుట్రలకు పావులు కదిపినట్లు.. ఈ మేరకు సిట్ దర్యాప్తులో నిందితులు సంచలన విషయాలు వెల్లడి చేసినట్లు సమాచారం. ఎపిలో సిఎం జగన్‌తో స్నేహపూర్వకంగానే మసలుతూనే అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిజెపి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు నిందితులు వెల్లడించినట్లు తెలిసింది.

నిజానికి ఎపిలో బిజెపి ఒక్క సీటు గెలవలేదు కానీ వైసిపికి చెందిన దాదాపు 70 మంది ఎంఎల్‌ఎలను కొనడానికి పన్నాగం పన్నారని, వారిలో ఇప్పటికే 55 మంది బిజెపి బ్రోకర్ల టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందు నిమిత్తం ఒక్కో ఎంఎల్‌ఎకు 50 నుంచి 100 కోట్ల మేర ఇచ్చేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు నిందితులు ఏయే రాష్ట్రాల్లో ఎంతమంది ఎంఎల్‌ఎలను కొనుగోలు చేయడానికి ప్రణాళికలు ఉన్నాయో సిట్ విచారణ సందర్భంలో ముగ్గురు నిందితులు సతీష్ శర్మ అలియాస్ రామచంద్రభారతి, సింహయాజులు స్వామీజీ, నందకుమార్‌లు సమగ్రమైన రీతిలో స్పష్టపర్చినట్లు సమాచారం. తెలంగాణనే కాదు…ఆంధప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్‌లను ఎంపిక చేసుకున్నట్లు.. ఎపిలో 55 మంది, ఢిల్లీలో 43 మంది, రాజస్థాన్‌లో 21 మంది ఎంఎల్‌ఎలతో ఆయా ఎంఎల్‌ఎల స్థాయిని బట్టి రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకూ బేరసారాలు కొనసాగించినట్లు విస్తుపోయే వాస్తవాలను సిట్ దర్యాప్తులో నిందితులు వెల్లడించినట్లు సమాచారం.

రాజగోపాల్‌రెడ్డి ఆటలో పావే…

బిజెపి కుట్రలో రాజగోపాల్‌రెడ్డి చిన్నపావు మాత్రమేనని నిందితులు సతీష్‌శర్మ అలియాస్ రామచంద్రభారతి, సింహయాజులు స్వామీజీ, నందకుమార్ మధ్య జరిగిన సంభాషణలో స్పష్టమైనట్లు దర్యాప్తు వర్గాలు చెప్పకనే చెబుతున్నాయి. రాజగోపాల్‌రెడ్డిని మిమ్మల్ని బిజెపికి రమ్మని ఎవరు ఆహ్వానించారని విలేఖరి అడిగిన తెలివైన ప్రశ్నకు రాజగోపాల్ చిక్కాడని సమాచారం.

తనతో చాలా సార్లు అమిత్ షా మాట్లాడాడని, మరో 10మంది కూడా వాళ్ళతో టచ్ లో ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారని తెలుస్తోంది. ఇదే సందర్భంలో తొలుత కొండా విశ్వేశ్వర్ రెడ్డిని బిజెపిలోకి లాగారని, ఆ తరువాత తనని పార్టీలోకి రమ్మంటు ఆహ్వానాలు పంపారని రాజగోపాల్‌రెడ్డి ఓపెన్ కామెంట్స్ చేశారని అంటున్నారు. కమలం ఫైల్స్ తో మోడీ అమిత్ షాల కుట్రలు ఎలా ఉంటాయో దేశానికి తెలిసిపోతే, స్వయంగా అమ్ముడుపోయిన రాజ్ గోపాల్ కూడా అమిత్ షా, మోడీల కుట్రలు ఎలా ఉంటాయో బయటపెట్టినట్లయిందని చెబుతున్నారు.

బండికి, లాయర్‌కు మధ్య అనుబంధం బహిర్గతం…!

సిట్ దర్యాప్తు అధికారులు నిర్వహిస్తున్న విచారణ, కాల్ డాటా విశ్లేషణలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, లాయర్ శ్రీనివాస్‌కు మధ్య ఉన్న అనుబంధం బయల్పడిందని తెలిసింది. టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు వ్యవహారంలో నిందితుడిగా ఉన్న సింహయాజులు స్వామీజీకి, శ్రీనివాస్‌కు మధ్య లింకుల డొంక కదిలిందని చెబుతున్నారు. అంతకు ముందు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు వ్యవహారం బయటపడిన వెంటనే బండి.. ఈ అంశంతో తమకు ఏ విధంగానూ సంబంధం లేదని నమ్మించడానికి శతవిధాలుగా యత్నించాడు. అత్యుత్సాహంతో ఏకంగా తెలంగాణ ఇలవేలుపు అయిన యాదాద్రి నరసింహస్వామి పైనే ప్రమాణం చేస్తానని అన్నారు. అందులో భాగంగానే యాదాద్రికి వెళ్లి మరీ తడి బట్టలతో స్వామి దగ్గర ఈ అంశంతో తనకు తన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేసి వచ్చారు.

ఆనక ప్రస్తుతం సిట్ విచారణలో ఒక్కో వ్యవహారం వెలుగులోకి వస్తూ ఉండటం, ఆయనకు అత్యంత సన్నిహితుడని చెప్పబడుతున్న శ్రీనివాస్ పాత్రే ఈ వ్యవహారంలో బయటకు పొక్కడం బండికి మింగుడుపడని పరిణామమేనని చెప్పవచ్చని అంటున్నారు. అక్టోబర్ 14-,15 తేదీలలో నందు, సింహయాజులు స్వామీజీ, శ్రీనివాస్ ఈ ముగ్గురూ ఢిల్లీలో కలిసే ఉన్నారని, చర్చలు జరిపారని తెలిసింది. వీళ్ల మధ్యన జరిగిన ఫోన్ సంభాషణలు, టెక్ట్ సందేశాలు సిట్ చేతిలో ఉన్నాయని సమాచారం. బండికి తెలియకుండా, ఆయన ప్రమేయం లేకుండా శ్రీనివాస్ ఈ వ్యవహారంలో చొరవ తీసుకొంటాడని భావించే అవకాశం లేదని మరోవైపు దర్యాప్తు అధికారులు చెబుతుండటం గమనార్హం. మరోవైపు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కేసు వెలుగుచూసినప్పటినుంచి శ్రీనివాస్ పరారీలో ఉన్నాడని, కోర్టుకు కూడా హాజరు కావడం లేదని సమాచారం. అయితే ఈ మొత్తం వ్యవహారంలో శ్రీనివాస్ పాత్ర స్పష్టమని, త్వరలోనే అరెస్టు కాక తప్పదని దర్యాప్తు అధికారులు అంటున్నారు.

ఇంకోవైపు, శ్రీనివాస్ నివాసంలో త్వరలో సోదాలు కూడా నిర్వహించేందుకు సిట్ అధికారులు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
రామచంద్రభారతితో సంబంధాలున్న డాక్టర్ కోసం సిట్ బృందం ఆరా..

సిట్ అదుపులో కేరళకు చెందిన ఇద్దరు…

టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేరళ రాష్ట్రంలో నిర్వహించిన సోదాల్లో సిట్ బృందం ఇద్దరిని అదుపులోకి తీసుకుందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, హర్యానా,కేరళ రాష్ట్రాల్లో సిట్ బృందం సోదాలు చేస్తుంది. కేరళ రాష్ట్రంలో రామచంద్రభారతితో సంబంధాలున్న డాక్టర్ కోసం సిట్ బృందం ఆరా తీసింది. అయితే సిట్ బృందం వస్తుందనే సమాచారం తెలుసుకున్న డాక్టర్ పారిపోయాడు. కేరళలో డాక్టర్‌తో రామచంద్రభారతి సంబంధాలపై సిట్ దర్యాప్తు చేస్తుంది. తుషార్‌కి రామచంద్రభారతికి ఈ డాక్టర్ మధ్యవర్తిగా ఉన్నాడని సిట్ దర్యాప్తులో తేలింది. రామచంద్రభారతితో ఆర్ధిక వ్యవహరాలు జరిపిన ఇద్దరిని సిట్ గుర్తించింది.

ప్రశాంత్, శరత్ లు ఆర్ధిక సంబంధాలు జరిపినట్టుగా సిట్ గుర్తించిందని సమాచారం.వీరిని సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. గత నెల 26వ తేదీన మొయినాబాద్ ఫాంహౌస్‌లో సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి, సింహయాజులు స్వామీజీ, నందకుమార్‌లు ఎంఎల్‌ఎలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. తాండూరు ఎంఎల్‌ఎ పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అచ్చంపేట ఎంఎల్‌ఎ గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎంఎల్‌ఎ బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎంఎల్‌ఎ రేగా కాంతారావు, తాండూరు ఎంఎల్‌ఎ పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభపెట్టారని ఈ ముగ్గురిపై కేసు నమోదైంది. ఎంఎల్‌ఎల ప్రలోభాల వెనుక బిజెపి ఉందని టిఆర్‌ఎస్ ఆరోపించింది.

ఈ ఆరోపణలను బిజెపి ఖండించింది. ఈ ముగ్గురికి తమకు సంబంధం లేదని బిజెపి తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే ఈ కేసు విచారణపై హైకోర్టు స్టేను ఎత్తేసింది. మరోవైపు కేసు విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. విచారణతో పాటు సిట్ దర్యాప్తును నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టులో బిజెపి పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించిన ఆడియోలు, వీడియోలను టిఆర్‌ఎస్ మీడియాకు విడుదల చేసింది. ఈ ఆధారాలను పోలీసులు కోర్టుకు కూడా అందించారు. నిందితుల వాయిస్‌ను పోలీసులు రికార్డు చేశారు.

ఆడియో, వీడియోలలోని ఆడియోను వాయిస్ రికార్డింగ్ తో పోల్చనున్నారు. గత వారంలో నాంపల్లిలోని ఎఫ్‌ఎస్‌ఎల్ లో నిందితుల వాయిస్‌ను రికార్డు చేసిన విషయం తెలిసిందే. మరో వైపు నలుగురు ఎమ్మెల్యేలు తమకు బెదిరింపులు వస్తున్నాయని పోలీసులకు పిర్యాదు చేశారు.గుజరాత్, యూపీకి చెందిన నెంబర్ల నుండి ఫోన్లు వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

నందకుమార్‌పై మరో రెండు కేసులు

టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌పై హైదరాబాద్‌లో మరో రెండు కేసులు నమోదయ్యాయి. స్థలం కొనుగోలు విషయంలో తమను మోసం చేశాడని నందకుమార్‌పై ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News