అమరావతి: వైసిపికి వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని బిజెపి నేత సుజనా చౌదరి పిలుపునిచ్చారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద బిజెపి ఆధ్వర్యంలో మహానిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడారు. పంచాయతీల నిధులు దారిమళ్లించిన ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పంచాయతీ వ్యవస్థను నీరుగార్చేందుకు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారని దుయ్యబట్టారు. వాలంటీరు వ్యవస్థ వైసిపికి ప్రైవేటు ఆర్మీగా పని చేస్తోందని, ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని రాష్ట్రంగా సిఎం జగన్ మోహన్ రెడ్డి తయారు చేశారని మండిపడ్డారు. ఎపి అభివృద్ధికి అమరావతి గ్రోత్ ఇంజిన్ వంటిదని, అభివృద్ధి ఆపేయడంతో సుమారు లక్ష కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి, జనసేన నేతలు, కార్యకర్తలతో సహా సర్పంచులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ కూడా సంఘీభావం ప్రకటించింది.
Also Read: ముగ్గురు సూపర్‌స్టార్లను బికారులుగా మార్చిన బంగళా