అమరావతి: టిడిపిలో చేరాడని వైసిపి కార్యకర్త, దళితయువకుడిపై వైఎస్‌ఆర్‌సిపి నేత, సినీ రచయిత కోన వెంకట్ తన అనుచరులతో కలిసి దాడి చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా కర్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సినీ రచయిత కోన వెంకట్ బంధువు కోన రఘుపతి వైఎస్‌ఆర్‌సిపి తరపున బాపట్ల నియోజకవర్గం నుంచి ఎంఎల్ఎ గా పోటీ చేస్తున్నారు. గణపరానికి చెందిన వైసిపి ఎస్‌సి నాయకుడు కత్తి రాజేశ్ తన అనుచరులతో కలిసి టిడిపి అసెంబ్లీ అభ్యర్థి వేగేశ్న నరేంద్ర వర్మ సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరారు.
రాజేశ్ తమ దగ్గర ఎనిమిది లక్షల రూపాయలు డబ్బు తీసుకొని ఇప్పుడు టిడిపిలో చేరారని వైసిపి నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాజేశ్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకొని మాట్లాడుతుండగా ఎస్‌ఐ జనార్థన్ సమక్షంలో కోన వెంకట్ తన అనుచరులతో కలిసి అతడిపై దాడి చేశారు. వెంటనే రాజేశ్ టిడిపి నాయకుల సమాచారం ఇవ్వడంతో వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఎస్‌ఐ జనార్థన్ సస్పెండ్ చేసి అనంతరం కోన వెంకట్‌తో అతడి అనుచరులపై ఎస్‌సి, ఎస్‌టి యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.