Sunday, December 22, 2024

దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి: సిద్దరామయ్యకు ఎడియూరప్ప సవాలు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు బిజెపి అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి బిఎస్ ఎడియూరప్ప సవాలు విసిరారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బిజెపి 140 నుంచి 150 సీట్లు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

గురువారం బిజెపి రాష్ట్ర ప్రత్యేక కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ కర్నాటక ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నిరుపయోగ హామీలు, ధన బలం, కండబలాన్ని వ్యతిరేకించారని, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని గెలిపించారని చెప్పారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, అప్పుడే మీ పరిస్థితి ఏమిటో మీకు తెలుస్తుందని ఎడియూరప్ప అన్నారు. కర్నాటక అసెంబ్లీ సంఖ్యబలం 224 కాగా లోక్‌సభ స్థానాల సంఖ్య 28. లోక్‌సభ ఎన్నికలలో బిజెపి-జెడిఎస్ కూటమి 19 సీట్లు గెలుచుకుందని, 142 అసెంబ్లీ సెగ్మెంట్లలో బిజెపి మెజారిటీ సాధించిందని ఎడియూరప్ప తెఇపారు.

కేవలం ఏడాది క్రితం 134 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్, పలువురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో కాంగ్రెస్ వెనుకబడి పోయిందని ఆయన తెలిపారు. ఏడాదిలోనే కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రజాదరణ కోల్పోయిందనడానికి ఇదే నిదర్శనమని ఆయన చెప్పారు. అవినీతికి పాల్పడుతూ, ప్రజాశ్రేయస్సును విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని ఆయన చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ధన, భుజబలాన్ని పట్టించుకోకుండా ప్రధాని నరేంద్ర మోడీపై విశ్వాసాన్ని చూపారని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News