Thursday, January 23, 2025

సిద్ధ రామయ్యపై యెడియూరప్ప కుమారుడు విజయేంద్ర పోటీ ?

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) ప్రధాన ప్రత్యర్ధులుగా రంగంలో పోటీ పడుతున్నాయి. అయితే బలమైన కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య కోలార్‌తోపాటు వరుణ అసెంబ్లీ నియోజక వర్గం లోనూ పోటీ చేస్తానని సిద్ధరామయ్య తెలిపారు. వరుణ అసెంబ్లీ నియోజక వర్గంలో సిద్ధరామయ్యకు పోటీగా బీజేపీ ఎవరిని నిలబెడుతుందో అని ఊహాగానాలు రేగుతున్నాయి. బీజేపీ సీనియర్ నేత మాజీ సిఎం బిఎస్ యెడియూరప్ప గురువారం తన కుమారుడు బివై విజయేంద్ర వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని సంకేతాలు అందించారు. మైసూరు జిల్లా లోని వరుణ నియోజక వర్గం సిద్దరామయ్యకు కీలకమైన పట్టున్న స్థానం. ప్రస్తుతం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర ఆ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధరామయ్య ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పాత్రికేయులు ఆ నియోజక వర్గం నుంచి విజయేంద్ర పోటీ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు యెడియూరప్ప సమాధానం చెబుతూ దీనిపై చర్చలు జరుగుతున్నాయన్నారు.

“కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకు తన నియోజకవర్గం చేజారి పోతుందని తెలుసు. ఆయనకు ఇది అంత సులువు కాదు. మేం సమర్ధుడైన అభ్యర్థిని అక్కడ రంగం లోకి దింపుతాం. గట్టి పోటీ ఇస్తాం. చూద్దాం ఏం జరుగుతుందో ” అని యెడియూరప్ప వ్యాఖ్యానించారు. విజయేంద్ర ప్రస్తుతం రాష్ట్ర బిజేపి ఉపాధ్యక్షుడుగా పనిచేస్తున్నారు. ఆయనను పోటీకి దింపడంపై బీజేపీ కేంద్ర అధిష్ఠానానికే నిర్ణయం విడిచిపెట్టారు. దీనిపై కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య స్పందిస్తూ తనపై ఎవరు పోటీకీ దిగినా తనకేం ఫరవాలేదని కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల ముందు వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డికె శివకుమార్ కూడా ఉన్నారు. వరుణ నియోజక వర్గం నుంచి తనకు తాను పోటీ చేయడానికి సిద్ధరామయ్య నిర్ణయం తీసుకుంటే పార్టీ స్వాగతిస్తుందని శివకుమార్ పేర్కొన్నారు. తనకు ఇవే చివరి ఎన్నికలని రాజకీయాల నుంచి ఇక తప్పుకుంటానని సిద్ధరామయ్య పదేపదే చెబుతుండడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News