బెంగళూరు: 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, జేడీ(ఎస్) మధ్య పొత్తుపై ఇంకా తుది నిర్ణయం కాలేదని మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప ఆదివారం విలేఖరులకు వెల్లడించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఇతర బాధ్యతల కారణంగా బిజీగా ఉన్నారని, రెండు రోజులు పోయిన తరువాత దీనిపై చర్చించే అవకాశం ఉందని అప్పటివరకు నిరీక్షించక తప్పదని ఆయన పేర్కొన్నారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేసే విషయమై జనతాదళ్ (సెక్యులర్) అంగీకరించినట్టు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప శుక్రవారం వెల్లడించారు. లోక్‌సభ సీట్ల విషయం లోనూ అవగాహన కుదిరిందన్నారు. మొత్తం 28 స్థానాలకు సంబంధించి నాలుగు స్థానాల్లో జేడీ(ఎస్) పోటీ చేస్తుందని కూడా ప్రకటించారు. అయితే శనివారం జేడీ(ఎస్) నేత కుమారస్వామి బీజేపీతో తమ పార్టీ చర్చలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయని ప్రకటించారు.