పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తాను రాజకీయాల నుంచి డిటైర్ అవ్వాలంటూ కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేసిన సూచనపై మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు బిఎస్ ఎడియూరప్ప శుక్రవారం స్పందించారు. ఈ కేసుపై కోర్టు నిర్ణయం తీసుకుంటుందని, సిద్దరామయ్యకు తగిన జవాబు కోర్టు నుంచే వస్తుందని ఎడియూరప్ప వ్యాఖ్యానించారు. మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ(ముడా) భూముల కేటాయింపు కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కూడా రాజకీయాల నుంచి రిటైరై ఇంటికి వెళ్లే సమయం దగ్గర పడుతోందని ఎడియూరప్ప తిప్పికొట్టారు.
ఎవరు రిటైర్ అవుతారో..ఎవరు కారో రానున్న రోజులలో తేలుతుందని ఆయన అన్నారు. ఇతరుల గురించి అలా మాట్లాడడం సిద్దరామయ్యకు అలవాటేనని విలేకరుల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవాలు ఏమిటో కొర్టు తేలుస్తుందని, అప్పటి వరకు ఆ కేసు గురించి తాను ఏమీ మాట్లాడబోనని ఎడియూరప్ప చెప్పారు. కోర్టు ఉత్తర్వులతో సిద్దరామయ్యకు గట్టి సమాధానమే లభిస్తుందని ఆయన అన్నారు. ఇప్పుడు సిద్దరామయ్య కాలం నడుస్తోందని, ఆయననే మాట్లాడనివ్వండని ఎడియూరప్ప చెప్పారు. ప్రజలే ఆయనకు తగిన జవాబు చెబుతారని ఆయన అన్నారు.