Sunday, December 22, 2024

కర్నాటకలో వారసత్వ కమలం

- Advertisement -
- Advertisement -

దేశంలో ఎక్కడైనా ప్రధాని నరేంద్ర మోడీ హవా నడుస్తుందేమో గానీ కన్నడ సీమలో చెల్లదని అధికార రాజకీయాల్లో తలపండిన కర్నాటక మాజీ సిఎం బిఎస్ యెడ్యూరప్ప తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు తప్ప మా కుటుంబానికి వర్తించవు, రాష్ర్ట బిజెపి అధ్యక్షుడిగా తన కుమారుడి నియామకంలో నరేంద్ర మోడీయే అంతిమ నిర్ణయం తీసుకున్నారని కుండబద్దలు కొట్టారు. బిజెపి విలువల వలువలను నడిబజారులో విప్పేశారు. వారసత్వ రాజకీయం అని ఎవరైనా అంటే అనుకోనివ్వండి లెక్కచేయను అన్నారు. కుటుంబ, వారసత్వ రాజకీయాలు, ఒకే కుటుంబానికి పలు పదవులకు వ్యతిరేకమని సుభాషితాలు చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ తన మాటలను తానే దిగమింగాల్సిన దుస్థితి ఏర్పడింది.

యెడ్యూరప్ప వేసిన తాళంతో బహుశా ఇంక ఎక్కడా వారసత్వ రాజకీయాల గురించి ఇతర పార్టీల మీద ఎక్కకపోవచ్చు. యెడ్యూరప్ప కుమారుడు, తొలిసారి ఎంఎల్‌ఎగా గెలిచిన బివై విజయేంద్రను కర్నాటక పార్టీ అధ్యక్షుడిగా బిజెపి అధిష్ఠానం నియమించింది. యెడ్యూరప్ప పార్టీ పార్లమెంటరీ బోర్డు పదవిలో వున్నారు. మరో కుమారుడు రాఘవేంద్ర లోక్‌సభ ఎంపిగా వున్నారు.కర్నాటక రాజకీయాల గురించి తెలిసిన వారికి యెడ్యూరప్ప కుటుంబం ఒక రాజకీయ సైనిక పటాలం వంటిది. ముగ్గురు కుమార్తెలు, వారి కుటుంబాలు, ఇద్దరు కుమారులు వారి కుటుంబాలు ఎవరు చక్కపెట్టాల్సిన వాటిని వారు చేస్తారు. ఇప్పటి వరకు వారి మధ్య ఎలాంటి పేచీలు రాలేదు. గతంలో యెడ్యూరప్ప కేబినెట్ మంత్రి కెఎస్ ఈశ్వరప్ప పదవిలో ఉండగానే గవర్నర్‌కు ఐదు పేజీల లేఖ రాసి సిఎం కుటుంబం ఎలా జోక్యం చేసుకుంటున్నదో వివరించారు. అనేక మంది విధి లేక మౌనంగా ఉన్నారు. ఇవన్నీ అధిష్ఠానానికి, ప్రత్యేకించి నరేంద్రమోడికి తెలియదు అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. మనం చేస్తే సంసారం మరొక చేస్తే మరొకటి!

తన కుమారుడిని పార్టీ రాష్ర్ట అధ్యక్షుడిగా ప్రకటించడం గురించి యెడ్యూరప్ప నాటకాన్ని రక్తికట్టించారు. బెంగళూరులో శనివారం నాడు విలేకర్లతో మాట్లాడుతూ మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ నియామకం గురించి మేమెవరం ఊహించలేదు. ఒక్కసారి కూడా ఢిల్లీలో ఈ విషయమై ఏ నాయకుడినీ అడగలేదు. కావాలంటే మీరు ఎవరినైనా అడగండి అని ఒక విలేకరి ప్రశ్నకు చెప్పారు. ‘అంతిమ నిర్ణయం ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా తీసుకున్నారు, నాకేమీ సంబంధం లేదు’ అన్నారు. వారు తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకున్నారు. విజయేంద్రను అధ్యక్షుడిగా నియమించినందుకు రాష్ర్టమంతటా ఉత్సవాలు జరుపుకుంటున్నారని యెడ్యూరప్ప చెప్పా రు. బిజెపిలో వారసత్వ రాజకీయాలకు ఈ నియామకం రుజువు అని కాంగ్రెస్ చేసిన వ్యాఖ్య గురించి మాట్లాడుతూ వారు అలాంటి ఆరోపణ చేయనివ్వండి పట్టించుకోను అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 28గాను 25 చోట్ల గెలిచేందుకు తాను, విజయేంద్ర విడివిడిగా రాష్ర్టంలో పర్యటిస్తామని చెప్పారు.తన కుమారుడి నియామకం పట్ల పార్టీలో నేతలెవరూ అసంతృప్తిని వెల్లడించలేదని, అందరూ ఐక్యంగా స్వాగతించారని,ఎవరూ పార్టీని వీడకుండా తాము చూస్తామని, గతంలో వెళ్లిన వారిని కూడా వెనక్కు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తామని యెడ్యూరప్ప చెప్పారు.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఎదురుదెబ్బ తిన్న బిజెపి ఆరు నెలలుగా దిక్కుతోచని స్థితిలో పడింది. ఎంతగా మైండ్ బ్లాక్ (మెదడు పని చేయకపోవటం) లేదా బ్లాంక్ (మెదడు ఖాళీ కావటం) అయిందంటే పార్టీ రాష్ర్ట అధ్యక్షుడిని, శాసనసభా పక్ష నేతను కూడా ఎన్నుకోలేకపోయింది. ప్రతిపక్ష నేత లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరో ఆరు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలన్న ఏకైక లక్ష్యం తో బిజెపి వుంది. కుటుంబ పార్టీ అంటూ గతంలో తెలుగుదేశాన్ని, తెలంగాణలో బిఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్న ఆ పార్టీ కర్నాటకలో కుటుంబ పార్టీగా ఉన్న జెడిఎస్‌ను తన మిత్రపక్షంగా చేర్చుకుంది. కాంగ్రెస్‌ను కుటుంబ వారసత్వ పార్టీ అని ధ్వజమెత్తుతున్న అదే పార్టీ ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు అన్నట్లుగా యెడ్యూరప్ప కుమారుడిని పదవికి ఎంపిక చేసింది. కర్నాటక శాఖను ఒక కుటుంబ పార్టీగా మార్చి వేసింది.

యెడ్యూరప్ప గాలి తీసి పక్కన పెట్టాం గనుక లింగాయత్ సామాజిక తరగతి దూరం కావటంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం జరిగిందన్న వాదనను పార్టీ గుర్తించినట్లుంది. తిరిగి వారి మద్దతు పొందాలంటే మరోదారి లేదని భావించి ఆ పెద్ద మనిషి కుటుంబ వారసుడినే అధ్యక్షుడిగా నియమించింది. ఎంతవారలైనా అధికార కాంతదాసులే, నరేంద్ర మోడీ ఆకోవకు చెందిన వ్యక్తే గనుక చేసేదేముంది, సరే అనక తప్పలేదు. దీంతో పార్టీలో ఇప్పుడు యెడ్యూరప్ప వ్యతిరేకులు ఏం చేస్తారన్నది ఆసక్తికరం. కాళ్లబేరానికి వస్తారా? తిరుగుబాటు చేస్తారా? తన కుమారుడి నియామకానికి నరేంద్ర మోడీ అంతిమ నిర్ణయం తీసుకున్నారని యెడ్యూరప్ప చెప్పిన తరువాత దాన్ని ధిక్కరించే సాహసం బిజెపిలో ఎవరికైనా ఉందా అంటే సందేహమే. అవమానాలను దిగమింగి లోలోపల కుములుతూ పార్టీలోనే ఉండాలి లేదా వెళ్లిపోవాలి. పార్టీ పదవి పంచాయతీ తేలింది, ఓట్ల రాజకీయం గనుక వెంటనే శాసనసభా పక్షనేతను కూడా ఎన్నుకుంటారు, లింగాయత్ కాని వారే అవుతారు.

కర్నాటక రాజకీయాల్లో అధికారం కోసం ఎవరితోనైనా చేతులు కలిపే పక్కా అవకాశవాద పార్టీగా జెడిఎస్ పేరు తెచ్చుకుంది. గతంలో దాని మద్దతుదారులుగా వున్న అనేక మంది కాంగ్రెస్‌వైపు మొగ్గటంతో 2023 మే నెలలో జరిగిన ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నది. కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు దారులు మూసుకుపోవడంతో మరోసారి బిజెపి తలుపు తట్టింది.రాష్ర్టంలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే లింగాయత్, ఒక్కళిగ సామాజిక తరగతులు కలిస్తే తిరుగుండదు, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలుస్తామనే బిజెపి అంచనా దీని వెనుక ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్‌ల ప్రభావం ఉందని చెబుతున్న 69 చోట్ల బిజెపి 20, కాంగ్రెస్ 40 గెలుచుకుంది.

ఒక్కళిగలు ప్రభావం చూపే 64 చోట్ల ఆ సామాజిక తరగతి పార్టీగా ఉన్న జెడిఎస్ 14 స్థానాలతో సరిపెట్టుకుంది. జెడిఎస్‌ను సంతుష్టీకరించేందుకు మాండ్య లోక్‌సభ నియోజకవర్గంలో బిజెపి మద్దతుతో స్వతంత్రురాలిగా గెలిచిన సినీ నటి సుమలతను అక్కడి నుంచి తప్పుకోవాలని, కావాలంటే ప్రస్తుత సభ్యుడు డివి సదానంద గౌడ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. గనుక బెంగళూరు ఉత్తరం నుంచి అవకాశం కల్పిస్తామని బిజెపి చెప్పినట్లు వార్తలు. స్వచ్ఛందంగా లేదా ఇతర కారణాలతో పోటీకి దూరంగా వున్నామని ప్రకటనలు చేయించటం ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో మరో ఎనిమిది నుంచి పదమూడు మంది ఎంపిలను కూడా ఇంటికి పంపాలని నిర్ణయించినట్లు లీకులు వదిలారు. ఇలా చేస్తే బిజెపి గెలుస్తుందా అంటే చెప్పలేము. అసెంబ్లీ ఎన్నికల్లో 75 మంది కొత్తవారికి సీట్లిస్తే 14 మందే గెలిచారు. ఇరవై నాలుగు మంది ఎంఎల్‌ఎలను పక్కన పెడితే పది స్థానాల్లో మాత్రమే పార్టీ గెలిచింది.

పార్టీ శాసన సభా పక్ష నేతను ఎన్నుకోకపోతే బెలగావిలో జరిగే శీతాకాల అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని బిజెపి ఎంఎల్‌ఎలు కేంద్ర నాయకత్వానికి ఈ నెల మొదటి వారంలో అల్టిమేటం జారీ చేశారు. ఏ పార్టీకైనా ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు.అధికార పక్షం కాంగ్రెస్ చేసే విమర్శలతో మొహాలు ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కావడం లేదని వాపోయారు. ఆరు నెలలకు పైగా శాసనసభా పక్ష నేతను ఎన్నుకోలేని స్థితి గతంలో ఎన్నడూ లేదని కాంగ్రెస్ నేత గుండూరావు అన్నారు. మే పదవ తేదీన జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌కు 135, బిజెపికి 66, జెడిఎస్‌కు 19 సీట్లు వచ్చాయి. వచ్చే శుక్రవారం నాడు శాసన సభా పక్ష నేతను నియమిస్తామని బివై విజయేంద్ర విలేకర్లతో చెప్పారు. జెడిఎస్‌తో కూటమి గురించి కేంద్ర నాయకత్వం రాష్ర్ట నేతలతో సంప్రదించలేదని సదానంద గౌడ బహిరంగంగా చెప్పారు. ఆ తరువాత గౌడను ఢిల్లీ రావాల్సిందిగా ఆదేశించారు. ఆ తరువాతే వచ్చే లోక్‌సభ ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని ప్రకటించడం గమనార్హం.

రాష్ర్టంలో కరవు పరిస్థితి గురించి అధ్యయన కమిటీ హసన్ పట్టణానికి వచ్చింది. ఆ సందర్భంగా హడావుడిగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గౌడ అ సందర్భంగా పోటీ లో ఉండనని ప్రకటించారు. అంతకు ముందు అక్టోబరు ఏడవ తేదీన విలేకర్లతో మాట్లాడుతూ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోలేకపోవటం పార్టీలో సంకట స్థితిని సృష్టించిందని, జెడిఎస్‌తో పొత్తు పట్ల తాను సంతోషంగా లేనని, రాష్ర్ట నేతలతో నిమిత్తం లేకుండా చేశారని, తాము దీని గురించి కనీసంగా చర్చించలేదన్నారు.

పార్టీ జాతీయ ప్రయోజనాలను గమనంలో వుంచుకొని, కాంగ్రెస్‌ను వ్యతిరేకించేందుకు చేసి ఉండవచ్చు అన్నారు. ఆ తరువాత అక్టోబరు 25వ తేదీన ఢిల్లీ వచ్చి అలా ఎందుకు మాట్లాడారో సంజాయిషీ ఇవ్వాలని అధిష్ఠానం కోరింది. బిజెపిలో జరిగిన పరిణామాల గురించి మాజీ సిఎం, అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన లింగాయత్ నేత జగదీష్ షెట్టార్ మాట్లాడుతూ పర్యవసానాలను త్వరలోనే చూస్తారు అంటూ వ్యాఖ్యానించారు. ఆరు నెలల పాటు పార్టీ, శాసన సభా పక్ష నేతలను ఎంపిక చేయలేకపోవటంతో ఎప్పుడు చేస్తారని బిజెపి కార్యకర్తలందరూ ప్రశ్నించారు, ఎట్టకేలకు నేతను ఎంపిక చేశారు, ఆగండి పర్యవసానాలను త్వరలోనే చూస్తారు అని షెట్టార్ అన్నారు.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News