Wednesday, January 22, 2025

కొడుకుకు పట్టం కోసం కోరలేదు: యడ్యూరప్ప

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : తన కుమారుడు విజయేంద్రకు కర్నాటక బిజెపి అధ్యక్ష పదవి దక్కుతుందని తాను ఊహించలేదని, దీని కోసం తాను అడగనూ లేదని బిజెపి దిగ్గజ నేత బిఎస్ యడ్యూరప్ప తెలిపారు. ఢిల్లీలోని బిజెపి అధినాయకత్వంతో కానీ , పార్టీ పెద్దలతో కానీ ఎప్పుడూ విజయేంద్ర గురించి ప్రస్తావించలేదు. పదవికి సిఫార్సు చేయలేదని కర్నాటక మాజీ సిఎం కూడా అయిన యడ్యూరప్ప తెలిపారు. ఆయన ఇక్కడ శనివారం విలేకరులతో మాట్లాడారు . ఒక్కరోజు క్రితం యడ్యూరప్ప కుమారుడు బివై విజయేంద్రను కర్నాటక బిజెపి అధ్యక్షులుగా పార్టీ నాయకత్వం ప్రకటించింది. ఇప్పుడు విజయేంద్ర ఈ పదవికి ఖరారు అయినందున ఆయన సమర్థవంతంగా దీనిని నిర్వహిస్తారని తాను ఆశిస్తున్నట్లు వివరించారు. పార్టీ రాష్ట్ర శాఖ నేతగా ఆయనపై గురుతర బాధ్యత ఉంటుంది.

రాబోయే లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు గాను బిజెపి 25 స్థానాలను గెల్చుకునేలా పాటుపడుతారని ఆశిస్తున్నట్లు యడ్యూరప్ప తెలిపారు. తన కుమారుడిని ఈ పదవికి ఖరారు చేయడంలో తానేమీ మధ్యవర్తిత్వం వహించలేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం కేవలం ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షులు జెపి నడ్డా తీసుకున్నదే అని స్పష్టం చేశారు. విజయేంద్ర ఇప్పటివరకూ బిజెపి రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. 47 సంవత్సరాల విజయేంద్ర శివమొగ్గ జిల్లాలోని తన తండ్రి ప్రాబల్యపు షికారిపుర నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకూ కర్నాటక బిజెపి అధ్యక్షులుగా ఉన్న నళిన్ కుమార్ కతీల్ స్థానంలో విజయేంద్ర ఈ బాధ్యతలకు ఎంపిక అయ్యారు. విజయేంద్ర నియామకం పట్ల పార్టీ శ్రేణులలో అన్ని స్థాయిల్లో ఉత్సాహం నెలకొందని తెలిపిన యడ్యూరప్ప సరైన సమయంలో బిజెపి పెద్దలు తగు నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News