నక్సలైట్లను చర్చకు పిలవాలని చెబుతున్న కెసిఆర్ మరి పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎందుకు చర్చలకు పిలవలేదని ప్రశ్నించారు. పదేళ్లలో అనేక ఎన్ కౌంటర్లు చేసి, అధికారం కోల్పోయిన తర్వాత మావోయిస్టులు గుర్తొచ్చారా? అని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నిలదీశారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజావ్యతిరేక విధానాలు, ఆర్థిక నేరాలు ప్రజలు మరచిపోలేదని, ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ మోడల్ అంటే విధ్వంసం, దోపిడీ, అవినీతి, అప్రజాస్వామికం, అరాచకం, నియంతృత్వం, కుటుంబ పాలన మాత్రమేనని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.70 వేల కోట్లు ఉంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత రూ.8 లక్షల కోట్లకు రాష్ట్ర అప్పు పెరిగిందని తెలిపారు. లక్షకోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా అదనపు
నీరు ఇవ్వలేకపోయారన్న మహేశ్వర్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రాజెక్టు కాదు, తిప్పిపోతల ప్రాజెక్టు అని విమర్శించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి, గుత్తేదారుల జేబులు నింపింది కెసిఆర్ అని అన్నారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. అందుకే కాంగ్రెస్, -బీఆర్‌ఎస్ కలిసి బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నైలో జరిగిన కాంగ్రెస్, -బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందం ప్రజలకు బహిర్గతమైందని అన్నారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ కలిసి బీజేపీని అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నాయని తెలిపారు. కేసీఆర్ హయాంలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.