బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సోమవారం బలహీనపడింది. ఆగ్నేయ అరేబియా సముద్రం నుండి కేరళ ,దక్షిణ కర్నాటక మీదుగా రాయలసీమ వరకూ సముద్ర మట్టానికి 0.9కి.మి ఎత్తులో కొనసాగిన ద్రోణి బలహీన పడింది. తూర్పు ఆగ్నేయ దిశల నుంచి కింది స్థాయిలో గాలులు తెలంగాణ రాష్ట్రంవైపునకు వీస్తున్నాయి.వీటి ప్రభావంతో రాగల 24గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు ,మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మంగళవారం 23జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ , నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ , పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ , హన్మకొండ, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చెల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ ,కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.