దుబాయ్ : సౌదీ అరేబియా లోని కీలకమైన సౌకర్యాలను లక్షంగా చేసుకుని యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు నేచరల్ గ్యాస్, డిశాలినేషన్ ప్లాంట్లపై శనివారం తెల్లవారు జామున డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేశారు. ఈ దాడుల వల్ల ఒక ప్రాంతంలో తాత్కాలికంగా చమురు ఉత్పత్తికి కోతపడిందని సౌదీ అరేబియా ప్రభుత్వ మద్దతు మీడియా వెల్లడించింది. యెమెన్‌లో గత ఎనిమిదేళ్లుగా యుద్ధం సాగుతుండగా మరోవైపు శాంతిచర్చలకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ప్రస్తుతం శాంతి చర్చలు ఆగిపోవడంతో ఈ దాడులు తాజాగా జరిగినట్టు చెబుతున్నారు. ఈ దాడుల వల్ల ఎలాంటి ప్రాణనష్టం కలగలేదని, సమీపాన పౌరుల వాహనాలు, ఇళ్లు దెబ్బతిన్నాయని యెమెన్‌లో పోరాటం చేస్తున్న సౌదీ నాయకత్వ మిలిటరీ సంకీర్ణ పోరాటదళం పేర్కొంది. దాడులు జరిగిన కొన్ని గంటలకు చమురు సంస్థల దిగ్గజం ఆరామ్‌కో సిఇఒ రిపోర్టర్లతో మాట్లాడారు. చమురు సరఫరాపై ఈ దాడుల ప్రభావం ఏదీ లేదని చెప్పారు. యాంబూ ఆరామ్‌కో సైనోపెక్ రిఫైనింగ్ కంపెనీని లక్షంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగిందని ఇంధనం మంత్రిత్వశాఖ ధ్రువీకరించింది. రిఫైనరీ ఉత్పత్తిలో తాత్కాలికంగా తగ్గింపు ఏర్పడిందని పేర్కొంది.