Monday, January 20, 2025

ఎరుకలకు జీవనోపాధి కల్పిస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గిరిజన తెగల్లో ఒకటైన ఎరుక కులస్తులు రాష్ట్రంలో లక్ష మందికి పైగా ఉన్నారని వారి సమస్యలు పరిష్కరించి జీవనోపాధి కల్పిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌లో ఎరుకల సంఘం నాయకులతో మంత్రి బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎరుకలు మొదటి నుంచి పందుల పెంపకం, బుట్టలు, తట్టలు అల్లుతూ జీవనోపాధి పొందేవారని తెలిపారు. ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం పెరగడంతో వీరి జీవనోపాధి కష్టంగా మారిందన్నారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా సమాజానికి అవసరమైన వ్యాపారం చేసుకొని జీవనోపాధి పొందుతామని వారు కోరారని, దేశ వ్యాప్తంగా పంది మాంసానికి డిమాండ్ ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పెంపకం దారులకు గొర్రెలు ఇచ్చినట్టే, తమకు పందులు ఇవ్వాలని ఫామ్‌లు ఏర్పాటుచేసుకొని జీవనోపాధి పొందుతామని అందుకు ప్రభుత్వం సహకరించాలని ఎరుకలు కోరినట్లు మంత్రి తెలిపారు.

ఈ బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించాలని ఎరుకల సంఘం కోరిందని వీరి సమస్యలను ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా పరిష్కార దిశగా కృషి చేస్తానని హామినిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులన్నీ గిరిజనుల్లో ఉండే అన్ని తెగలకు సమానంగా అందే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా 12 వేల కోట్ల గిరిజనులు ఉంటే బిజెపి ప్రభుత్వం వారికి కేటాయించింది కేవలం రూ.8 వేల కోట్లు మాత్రమేనని, రాష్ట్రంలో గిరిజన తెగలన్నీ కలిపి 40 లక్షల మంది ఉంటే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 12,500 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. గిరిజనులపై ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రత్యేక శ్రద్ద ఉందనే విషయం దీనిద్వారా స్పష్టమవుతుందన్నారు.

న్యాయమైన ఎరుకల సంఘ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి చిత్తశుద్దితో కృషి చేయనున్నట్లు హామినిచ్చారు. ఈ సమావేశంలో సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షులు రాములు, ప్రధాన కార్యదర్శి రాజు, రవికుమార్, గోపాల్, శ్రీరామ్, ఆనంద్, రాజశేఖర్ నాగులు, శ్రీశైలం, మల్లేశం, సత్యనారాయణ, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News