మన తెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబి) మాజీ డిఎస్‌పి ప్రణీత్ రావు విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను అలా చేశానని, ఆ డేటాను కూడా ధ్వం సం చేశానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనను మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించాలని ప్రత్యేక టీం (సిట్) భావిస్తోంది. ‘అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతిపక్ష నేతలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా, రియల్ ఎస్టేట్ పెద్దలకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేశా. ఈ సమాచారాన్ని అప్పటి ఎస్‌పి స్థాయి అధికారుల నుంచి ఎస్‌ఐబీ చీఫ్ వరకూ అందరికీ అందజేశాను. కొందరు నేతలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశాను. చాలామంది అధికారులు, ప్రజా ప్రతినిధుల వాట్సాప్ ఛాటింగ్స్‌పై నిఘా పెట్టాను. ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని అధికారులకు ఇచ్చా. అప్పటి ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ఆదేశాలతో మొత్తం డేటాను ధ్వంసం చేశాను. సెల్ ఫోన్స్, హార్డ్ డిస్కులతో పాటు వేలాదిగా పత్రాలు ధ్వంసం చేశా’ అని ప్రణీత్ రావు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రస్తుతం చంచల్ గూడ జైలులో 14 రోజుల రిమాండ్‌లో ఉన్న ప్రణీత్‌రావును మరోసారి విచారించేందుకు ప్రత్యేక అధికారుల బృందం నాంపల్లి కోర్టులో పిటిషన్ దా ఖలు చేసింది. ప్రణీత్ రావును వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో కోరినట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు విచారణలో వెల్లడించిన అధికారులను విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎస్‌ఐబిలోని ఎస్వోటీ ఆపరేషన్ హెడ్‌గా ఉన్న సమయంలో డిఎస్‌పి ప్రణీత్‌రావు రాజకీయ నాయకులు, ఎన్జీవోలు, పౌరహక్కుల నేతలతో పాటు మా వోయిస్టులు, ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షించారు. ఈ క్రమంలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఫలితాల రోజు రాత్రి 9 గటల సమయంలో ఆయన లాగర్ రూమ్‌కు వెళ్లి హార్డ్ డిస్క్‌లతోపాటు డాక్యుమెంట్లను ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఎస్వోటీ లాగర్ రూమ్ సిసి కెమెరాలను ఆఫ్ చేయించారు. దాంతో ఆయన రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఫోన్ల ట్యాప్ చేశారని ఆరోపణలకు పట్టు చిక్కినట్లయింది. లాగర్‌రూమ్‌లో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేసి వెళ్లిపోయారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలైన కాంగ్రెస్, బిజెపి నేతల ఫోన్లను ప్రణీత్‌రావు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీస్ శాఖ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టింది. కేసు దర్యాప్తు తీవ్రతరం చేసిన పోలీసులు మార్చి 12న రాత్రి సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలోనే ప్రణీత్‌రావును అరెస్ట్ చేశారు.
అక్కడి నుంచి రాత్రికి రాత్రే ఆయన్ని హైదరాబాద్‌కు తరలించా రు. ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి ప్రభుత్వం కీలక ఆధారాలను సేకరించిన అనంతరం చర్యలకు సిద్ధమైంది. ఎస్‌ఐబి మాజీ డిఎస్‌పి ప్రణీత్‌రావు పాత్రపై ఆధారాలు సేకరించిన తరువాతే అరెస్ట్ చేశామని పోలీసులు స్పష్టం చేశారు. ఎస్‌ఐబి లాగర్ రూమ్‌లో హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసి, ఆ తర్వాత నుంచి ప్రణీత్‌రావు పక్కా ప్లాన్‌తో వ్యవహరించినట్టు పోలీసులు వెల్లడిస్తున్నారు. గడిచిన నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిసిఆర్‌బిలో రిపోర్ట్ చేసిన ఆయన అక్కడ జాయిన్ అయిన రెండు రోజులకే సిక్ లీవ్ పెట్టారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కీలక ఆధారాలు లభ్యం కావడంతో ప్రణీత్ రావును డిఐజి రవి గుప్త సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌కు వారం రోజులు ముందు నుంచే డిసిఆర్‌బికి ప్రణీత్ రావు వెళ్లలేదని సమాచారం.