ఎల్‌బి స్టేడియంలో జరిగే ఉత్సవాలకు సిఎం కెసిఆర్
రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సిహెచ్ మల్లారెడ్డి
ఈ నెల 17లోగా రాష్ట్రవ్యాప్తంగా క్రిస్టియన్లకు దుస్తుల పంపిణీ
నేడు నగరంలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశం
మనతెలంగాణ/ హైదరాబాద్ : అన్ని కులాలు,మతాలను సిఎం కెసిఆర్ సమ దృష్టితో చూస్తున్నారని, గొప్ప లౌకిక రాష్ట్రంగా తెలంగాణ ముందుకు సాగుతున్నదని రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. మాసబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమభవన్‌లో మంగళవారం క్రిస్మస్ సెలెబ్రేషన్స్ కమిటీతో మంత్రుల సమీక్షా సమావేశం నిర్వహించారు. క్రిస్మస్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులతో రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సిహెచ్ మల్లారెడ్డిలు సమీక్షించారు. ఈ సందర్భంగా మైనార్టీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ గతేడాది కరోనా దృష్టా క్రిస్మస్ వేడుకలను అధికారికంగా నిర్వహించలేకపోయాం. ఈ సారి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని క్రైస్తవ సమాజంలోని దాదాపు రెండున్నర లక్షల మంది పేదలకు రూ. 11కోట్ల 50లక్షలు ఖర్చు దుస్తులు సిద్ధం చేశామని తెలిపారు. వీటిలో చాలా వరకు జిల్లాలకు పంపడం జరిగిందని, ఈ నెల 17వ తేదీ వరకు 95 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు పంపిణీ పూర్తి చేస్తారని వివరించారు.
ఎల్.బి.స్టేడియంలో ఈ నెల 21 లేదా 22వ తేదీలో జరిగే ప్రధానమైన వేడుకలకు ముఖ్యమంత్రి కెసిఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ వేడుకలకు క్రిస్టియన్ బిషప్‌లు,ఫాదర్స్, ఫాస్టర్స్, బ్రదర్స్,సిస్టర్స్ పెద్దసంఖ్యలో హాజరవుతారని కొప్పుల పేర్కొన్నారు. దుస్తుల పంపిణీ, ఆహ్వానాలు,స్టేజీ అలంకరణ, స్వాగతం, సత్కారాలు, భోజనాలు,తాగునీరు,భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని మంత్రి కొప్పుల అధికారులకు పలు సూచనలు చేశారు. సలహాలిచ్చారు.ఈ సందర్భంగా ప్రభుత్వం పంపిణీకి సిద్ధం చేసిన దుస్తులను మంత్రులు విడుదల చేశారు. ఈ వేడుకలను దిగ్విజయంగా నిర్వహించేందుకు వీలుగా జిహెచ్‌ఎంసి పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సవివరంగా చర్చించేందుకు ఈ నెల 15వ తేదీ బుధవారం మధ్యాహ్నం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో మైనారిటి వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎకె ఖాన్, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్ సన్, కమిటీ సభ్యులు రాయడిన్ రోచ్, రాజీవ్‌సాగర్, శంకర్‌లూక్, శాఖ ఉన్నతాధికారులు క్రిస్టినా చోంగ్తు, స్టీఫెన్ రవీంద్ర, షానవాజ్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.