Monday, December 23, 2024

యోగాభ్యాసం బౌద్ధుల సంప్రదాయం

- Advertisement -
- Advertisement -

బుద్ధుడు వేద కాలానికి ముందు జీవించిన వాడు. ఆయన ధ్యాన ముద్ర ప్రపంచానికి ఎప్పటి నుండో తెలుసు. ఆయనని ‘యోగుల చక్రవర్తి’ అని కూడా పిలుచుకున్నారు. వేదాలు రాయబడ్డ కాలానికి ముందే యోగ, ధ్యానం వంటివి వున్నాయి. శ్రమణులు, సాధువులు, రుషులు ఈ పద్ధతుల్ని ఆచరిస్తూ వుండేవారు. ధ్యాన ముద్రలో వజ్రాసనంలో వున్న బుద్ధుని విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన విషయం మనకు తెలుసు. పాళీ భాషలో యోగ/ ధ్యాన సాధనపై ‘విశుద్ది మగ్గ’ అనే బృహద్గ్రంధం వుంది. యోగా భ్యాసం బుద్ధ సంప్రదాయానికి గర్వకారణం. నిజానికి ‘యోగ ధ్యానం’ అంటే మనిషి తనతో తనకు గల సంబంధాన్ని అన్వేషించుకోడం. బయట తిరిగే బదులు, ఎవరి లోపల వారు తిరగడం. మనసుని అదుపులో పెట్టుకొని ఏకాగ్రతతో సాధన చేయడం. క్రోధం, ద్వేషం, దురాశ వంటి దుర్గుణాలను వదులుకొని, మనసుని శుద్ధి చేసుకోవడం. దాని వల్ల జీవితంలో దుఃఖాలు దూరమవుతాయి. సుఖ శాంతుల వెలుగులు ప్రసరిస్తాయి. ఇది సాధించిన వారే శ్రమణులు, యోగులు, సాధకులు అవుతారు. యోగ ధ్యానానికి తధాగతుడు చాలా ప్రాముఖ్యమిచ్చాడు. ఆయన ధమ్మపదలో ఇలా చెప్పాడు.

యోగవే జయతి భూరి అయోగ భూరి సద్ఖో
ఏతం ద్వేధ పథం జ్ఞాత్వా భవయ్ విభావయ్ చ!
(తత్ అత్తనం నివేశేయ భావి పద్ధతి) అర్థం ఏమిటంటే, యోగా భ్యాసం వల్ల జ్ఞానం పెరుగుతుంది. ఆచరించక పోతే వున్న వివేకం నశిస్తుంది. మనిషి పురోగతి, పతనం రెండూ అతని ఆధానంలోనే వున్నాయి. నిరంతర జ్ఞాన సముపార్జనకు యోగ ధ్యాన సమాధిలో తమను తాము నిమగ్నం చేసుకోవాలి. ప్రజ్ఞ అంటే అంతర్దృష్టి. విచక్షణ దీని వల్ల కోరిక నశిస్తుంది. వస్తువుల మీద, బంధాల మీద అనురక్తి నశిస్తుంది. అప్పుడు గాని, బుద్ధుని మార్గం అర్థం కాదు. వినయం, సమాధి, జ్ఞానం ఈ మూడింట సమాహారమే బుద్ధుని మార్గం ! బుద్ధుని తర్వాత బోధి ధర్మ కుమార జీవ వంటి బౌద్ధ భిక్షువులు ఈ “భారతీయ సంస్కృతి”ని మొత్తం ఆసియా దేశాలకు వ్యాప్తి చేశారు. రవాణా సౌకర్యాలు లేని ఆ రోజుల్లో ప్రాణాలకు తెగించి, నెలలూ, సంవత్సరాలూ ప్రయాణించి, ప్రపంచ పౌరులెందరో నలందా, తక్షశిల విశ్వవిద్యాలయాలకు వచ్చేవారు. విభిన్న విశ్వాసాలు ఉన్న ప్రజలు భారతదేశంలో బుద్ధుడికి ముందూ వున్నారు. బుద్ధుడి తర్వాత కాలంలో కూడా వున్నారు. అయితే, యోగా భ్యాసాన్ని, ధ్యానాన్ని మాత్రం బుద్ధుణ్ణి అనుసరించే నేర్చుకున్నారు. కొందరు మాత్రం తాము నేర్చుకొన్న వాటికి వారి స్వంత పైత్యాన్ని కొంత జోడిస్తూ వచ్చారు. మంత్రం, ప్రార్థన, శక్తి శాఖ వంటి వాటితో యోగను నింపేశారు. ఫలితంగా ఉపనిషత్తులు, యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహార ధారణ వంటివి అందులో చేరాయి.
బుద్ధుణ్ణి దశావతారాల్లో చేర్చుకున్నట్టుగానే బుద్ధుడి యోగా భ్యాసం ధ్యానాలను వైదిక మతస్థులు మొదట స్వీకరించారు. తర్వాత కాలంలో పూర్తిగా మార్చేశారు.

ఇప్పుడు మనం నిత్య జీవితంలో వాడుతున్న ‘యోగక్షేమాలు’ అనే పదం బుద్ధుడు చెప్పిన యోగా భ్యాసం నుండే వచ్చి వుంటుంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న, వింటున్న యోగ సూత్రాలన్నీ బౌద్ధానంతర రచనలు, బౌద్ధాన్ని నాశనం చేసే క్రమంలో ఎన్నో మార్పులు, చేర్పులు చేసుకొన్నట్టుగానే, యోగా భ్యాసాన్ని కూడా మార్చేశారు. వాడుకలో ఉన్న ఇప్పటి యోగకు, ఒకప్పుడు బుద్ధుడు చెప్పిన యోగభ్యాసానికి పోలికలు లేవు. బుద్ధ విగ్రహాల రూపు రేఖలు మార్చి, వైదికులు తమ దేవీ దేవతల్ని తయారు చేసుకొన్నట్టు యోగ సహజ స్వభావాన్ని, ఉద్దేశాన్ని వారు ధ్వంసం చేశారు. వ్యాపార ధోరణిలో నడుస్తున్న నేటి యోగ మనసు శుద్ధికి ఏ మాత్రం ఉపయోగపడదు. శరీరాన్ని మెలితిప్పడం, ఉతికినట్లు శ్వాస పీల్చి వదలడం ఇప్పుడు యోగగా చలామణి అవుతూ వుంది.

బుద్ధుడి ఊసు ఎత్తకుండా ‘అంతర్జాతీయ యోగ డే’ ప్రకటించిన వాడు అసలు యోగా మూలాలు తెలుసుకున్నాడా? గుజరాత్ మారణ హోమానికి కారణమై వేల వేల మంది ప్రాణాలు బలి తీసుకున్నవాడు సంవత్సరానికి ఒక రోజు కళ్ళూ, ముక్కూ మూసుకొని అరగంట కూర్చుంటే యోగ ఫలితం దక్కుతుందా? స్వంత ఆలోచనలతో స్వంత నిర్ణయాలు తీసుకోలేని వారు కాపీ పేస్ట్ చేస్తూ బతకాల్సిందే! వారికి మరో మార్గం వుండదు. ఎప్పుడైనా ఎక్కడైనా స్వంత మెదడుతో పని చేసే వారికి మాత్రమే మార్గాలు దొరుకుతాయి. కాపీ కొట్టే వాడు ఎక్కడో ఓ చోట, ఎన్నడో ఓ నాటికి దొరికిపోవాల్సిందే! భారత దేశంలో ఉన్న హిందూ దేవాలయాలన్నీ మార్చబడిన జైన/ బౌద్ధారామాలని తెలిసి పోలేదా? అలాగే యోగ కూడా బౌద్ధుల నుండి కాపీ కొట్టిందే అని స్పష్టమైపోయింది.

సరే, ఇక పతంజలి యోగ గురించి ఏమన్నాడో, అతను ప్రతిపాదించిన యోగ సూత్రాల సారాంశం ఏమిటో కూడా పరిశీలిద్దాం చిత్త వృత్తి నిరోధం ద్వారా ఆత్మను పరమాత్మలో కలిపేందుకు 194 యోగ సూత్రాలు ప్రతిపాదించాడు పతంజలి! విభూది పాదంలోని 17వ సూత్రం నుండి40వ సూత్రం దాకా పరిశీలించినట్లయితే మనకు ఎన్నో అభూత కల్పనలు కనిపిస్తాయి. యోగ చేసిన వారికి 1. సకల జీవుల భాషలు తెలుస్తాయని అన్నాడు. 2. శరీరం కనబడకుండా సంచరించవచ్చని చెప్పాడు. 3. మరణించిన పూర్వీకులతో మాట్లాడ వచ్చని అన్నాడు. 4. భూత, భవిష్యత్ జ్ఞానం కలుగుతుందని అన్నాడు. 5. ఆకలి దప్పులు వుండవని అన్నాడు. 6. ఏనుగంత బలం వస్తుందనీ, దివ్య శక్తులు లభిస్తాయనీ చెప్పాడు. 7. ఇతరుల శరీరంలోకి జొరబడొచ్చనీ అంటే పరకాయ ప్రవేశం చేయొచ్చనీ అన్నాడు మరి ఇన్ని శతాబ్దాలలో వీటిలో ఏ ఒక్కటైనా, ఏ ఒక్కరి విషయంలోనైనా నిజమయ్యిందా? కొంచెం ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే ఇవన్నీ భ్రమలని, కల్పితాలనీ అర్థం అవుతూ వుంది కదా? దైవం, ఆత్మ, పరమాత్ర అని ప్రబోధించే వైదిక మతంలోనే ఇవన్నీ ఇమిడిపోతున్నాయి అసలు దైవం అంటూ ఎవరూ లేరు. ప్రతిదీ కార్యకారణ సంబంధంతో జరుగుతూ వుంది. నిన్ను నీవు, నీ మనసును నువ్వు ఆధీనంలో వుంచుకోవడానికి స్థిరచిత్తుడైవై వుండడానికి యోగా భ్యాసం మంచిదన్న బుద్ధుడి బోధనలకు వైదిక మత ప్రచారాలకూ తేడా స్పష్టంగా కనిపిస్తోంది కదా?

తాము యోగ చేస్తున్నామని, దాని వల్ల మనసూ, శరీరం ప్రశాంతంగా వుంటున్నాయని ఈ రోజుల్లో ఎవరు చెపుతున్నారూ? సినీ నటులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, కార్పొరేట్లు! అవి సామాన్య జనాన్ని ప్రభావితం చేయడానికి చెప్పే కబుర్లే తప్ప వీరిలో ఎవరైనా మనసుని నిశ్చలంగా వుంచుకోగలుగుతున్నారా? కోరికలు లేని స్థాయికి చేరుకోగలుగుతున్నారా? వారి వారి వ్యాపారాలు పెంచుకోవడానికో, పబ్లిసిటీ పెంచుకోవడానికో, ప్రజల దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికో చేసే గిమిక్కులు తప్ప బుద్ధుడు చెప్పిన యోగా భ్యాస సారాంశం ఏ కొంచెమైనా వీరి మెదడుకు ఎక్కిందా? ‘యోగ’ అనే మాట వాడుకొని, లాభం పొందడం తప్ప ఇప్పుడు వీరు చేస్తున్న ప్రచారాలకు అర్థమే లేదు. యోగ గురువుల పక్కన చేరి సినిమా నటీమణులు ఒళ్ళు విరుచుకుంటూ ప్రదర్శనలు ఇవ్వడం తప్ప దాని వల్ల సామాన్య జనానికి ఏమిటీ లాభం? ఒక శుంఠ పక్కన మరో శుంఠ చేరి, ప్రజల మెదళ్ళను ఆకర్షించి, ఆధీనంలో వుంచుకోవడానికి చేసే అతి తక్కువ స్థాయి ప్రయత్నం అది! దేశం బాధ్యత, ప్రజల బాధ్యత తీసుకొన్న వాడు తను తప్పనసరిగా చేయాల్సింది చేయకుండా సంవత్సరానికి ఓ రోజు వంద మందిని వెనకేసుకొని, ముక్కు మూసుకొని కెమెరాలకు పోజులిస్తే అది “యోగ డే” అయిపోతుందా? దాని వల్ల జనం బాధలు ఏమైనా తగ్గుతాయా? సముద్రపు ఒడ్డునో లేక ఫుట్ పాత్ మీదో ప్లాస్టిక్ బ్యాగ్‌లు ఏరుతూ జనానికి వీడియోలు పంపితే.. అది సుపరిపాలన అయిపోతుందా? ఈ యోగ విషయం కూడా అంతే! పది మంది కెమెరా వాళ్ళను తీసుకొని వెళ్ళి తల్లి దగ్గర కూర్చునే వాడు, అటు తల్లి విలువను, ఇటు తన విలువనూ తగ్గించుకున్నవాడే అవుతాడు. అవసరమైంది తప్పపబ్లిసిటీ కోసం అనవసరమైనవి చేస్తే, వాటికి వున్న విలువ కూడా వుండదు. యోగా భ్యాసమంటే ఏమిటో తెలుసుకోకుండా ఓ “అంతర్జాతీయ యోగా డే” ప్రకటించిన వాడు అంతర్జాతీయ అజ్ఞాన శిరోమణిగా చరిత్రలో నమోదు చేయబడతాడు.

యోగను విమర్శించకండి! దాన్ని ఒక వ్యాయామంగా స్వీకరించవచ్చు కదా? అని సమకాలీనంలో కొందరు అంటూ వుంటారు. నిజమే! వ్యాయామం మంచిదే!! అది శరీరానికి కొన్ని ప్రయోజనాల్ని సమకూరుస్తుంది. కానీ, మనసు నిర్మలం కాదు. అంతః కరణ శుద్ధి జరగదు. అలా జరగనప్పుడు మానవ ప్రవృత్తిలో దురాశ, ద్వేషం, కోరిక వంటివి తప్పనిసరిగా వుంటూనే వుంటాయి. వ్యాయమం వల్ల దృఢమైన శరీరం లభిస్తుందే ఏం లాభం? సమాజ శ్రేయస్సుకు నిర్మల మనస్కులు కావాలి. ప్రపంచం ఆనందమయం, శాంతిమయం కావాలంటే, బుద్ధ మార్గంలో దుఃఖ విముక్తి కావాలి. అది సాధించడానికి బౌద్ధులు ఎంచుకొన్న ఒక మార్గం ధాన్యం! ఈ అత్యాధునిక సమాజంలో ఇప్పుడు మార్పు కేవలం ధాన్యం చేస్తే కూడా రాదు నిజమే ! కానీ సమాజ దుఃఖాన్ని కొంతలో కొంత తగ్గించడానికి కావాల్సిన శ్రద్ధ, చిత్తశుద్ధి, సమర్పణ భావం అవడుతాయి. మొత్తానికి మొత్తం కాకపోయినా, అత్యధికులు ఆ స్థాయిని అందుకో గలిగితే, కొంతయినా మేలు జరుగుతుంది. భ్రమల్ని, అంధ విశ్వాసాల్ని వదిలేసి, వైజ్ఞానిక మా‘నవ’వాద దిశగా ఏకాగ్రతతో అడుగులు వేయాలి. ఒక లక్షంతో పని చేయాలి! ఆ ఏకాగ్రత, ఆ లక్ష సాధనే ఇప్పుడు మనమంతా ఆచరణలో పెట్టాల్సిన యోగ!

తాజా కలం : 13 జులై 2022 న గురుపూర్ణిమ వచ్చింది. సార్‌నాథ్‌లో గౌతమ బుద్ధుడు తన శిష్యులకు, అనుచరులకు మొదటిసారి జ్ఞానబోధ చేసిన రోజు అది! కానీ దాన్ని కూడా మనువాదులు దుర్మార్గంగా మార్చుకొన్నారని చాలా మందికి తెలియదు. బౌద్ధా రామాల్ని ఆలయాలుగా మార్చుకొన్న మనువాదులు గురు పూర్ణిమను కూడా మార్చుకొన్నారు. ‘గురు బ్రహ్మ, గురు విష్ణు వంటి శ్లోకాలతో గురువునే దైవం చేసేశారు. దేవుడు లేడని బుద్ధుడు చెపితే, ఆ ఆలోచనని ధ్వంసం చేశారు. జరిగిన తప్పదాన్ని గ్రహించి, ఇప్పటి నుండైనా గురుపూర్ణిమను బుద్ధుడి ధమ్మచక్క పవత్తనగా జరుపుకుందా!

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News