అమరావతి: స్కిల్ స్కామ్‌లో కీలక మలుపు తిరిగింది. ఈ స్కామ్‌లో ఎ13 గా నిందితుడు ఎసిఐ చంద్రకాంత్‌షాను చేర్చారు. తాను అప్రూవల్‌గా మారేందుకు అనుమతి ఇవ్వాలంటూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్రూవల్‌గా మారేందుకు అనుమతించి తనను సాక్షిగా పరిగణించాలని పిటిషన్‌లో చంద్రకాంత్ షా పేర్కొన్నారు. స్కిల్ స్కామ్‌లో యోగేష్ గుప్తా ఎ22గా ఉన్నారని, నిధుల అక్రమ తరలింపులో చంద్రబాబు సన్నిహితుడు యోగేష్ గుప్తా కీలక పాత్ర పోషించారన్నారు. అమరావతి తాత్కాలిక సచివాలయం, టిడ్కో ప్రాజెక్టుల కాంట్రాక్టుల కేటాయింపుల్లో నిర్మాణ సంస్థల నుంచి ముడుపులు తీసుకొని యేగేష్ గుప్తా మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు చేరవేశారని, అందుకే యోగేష్ గుప్తాకు ఐటి శాఖ నోటీసులు ఇచ్చిందని చంద్రకాంత్ పేర్కొన్నారు.
స్కిల్ స్కామ్‌లో మరొక నిందితుడు సావన్‌కుమార్ జాజుతో కలిసి యోగేష్ గుప్తా తనను సంప్రదించారని చంద్రకాంత్ పేర్కొన్నారు. డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీలకు సాఫ్ట్‌వేర్ సమకూర్చి ఐటి సేవలు అందిస్తున్నట్లుగా బోగస్ ఇన్‌వాయిస్‌లు కావాలని అడిగారన్నారు. ఎసిఐ కంపెనీ పేరిట స్కిల్లర్ కంపెనీకి 18 బోగస్ ఇన్‌వాయిస్‌లు ఉన్నాయని, డిజైన్ టెక్ కంపెనీకి రెండు బోగస్ ఇన్‌వాయిస్‌లు ఇచ్చారని పిటిషన్‌లో చంద్రకాంత్ షా వెల్లడించారు. బోగస్ ఇన్‌వాయిస్‌ల విలువ దాదాపుగా రూ.67 కోట్లకు పైగా ఉంటుందని, ఎసిఐ కంపెనీ బ్యాంకుకు జమ చేశారని చెప్పారు. సావన్ కుమార్ చెప్పిన పలు షెల్ కంపెనీలకు నిధులు మళ్లించినట్టు పిటిషన్‌లో పేర్కొన్నారు. డిసెంబర్ 5న ఎసిబి కోర్టు ముందు స్వయంగా హాజరుకావాలని చంద్రకాంత్ షాకు జడ్జి ఆదేశించారు. చంద్రకాంత్ షా పిటిషన్‌పై ఎసిబి కోర్టులో విచారణ వచ్చే నెల 5కు వాయిదా పడింది.