యుపి సిఎం యోగి మతలబు మాట
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో తన హయాం కంటే ముందు రేషన్ ‘ అబ్బా జాన్’ అని స్మరించుకునే వారికే దక్కేది ఒంటబట్టేది అని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ వ్యాఖ్యానించారు. సమాజ్‌వాది పార్టీ నేతలు ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్‌లను వారి పార్టీ పాలనను దుయ్యబడుతూ ముఖ్యమంత్రి కుషీనగర్‌లో జరిగిన రేషన్ పంపిణీ కార్యక్రమంలో ముస్లింలు తమ ఇళ్లలో వాడుకునే పదజాలాన్ని ప్రయోగించారు. సాధారణంగా తండ్రికి గౌరవమర్యాద సూచకంగా అబ్బాజాన్ అని పేర్కొనడం జరుగుతుంది. గత ప్రభుత్వాలు తరచూ కేవలం ఓ వర్గాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వ ప్రయోజనాలను కల్పించాయని, ఈ దశలో రేషన్ సరుకులు కేవలం అబ్బాజాన్ పలుకుల వారికే దక్కేవి. పైగా అబ్బాజాన్ అంటేనే వారికి తిండి దక్కేదేమో, తిన్నదరిగేదేమో అని యోగి గత పాలకులపై విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం తమ పర భేదాలు చూసే రకం కాదని ప్రజలకు తిండిగింజలు అయినా, మరుగుదొడ్ల వంటి సౌకర్యాలు అయినా అందరికీ అందించడం జరుపుతోందని, ఇంతకు ముందటి సర్కారు పంచిన సరుకులు ఇక్కడ కాకుండా నేపాల్, బంగ్లాదేశ్‌లలో కన్పించేదని తెలిపారు.
పేద ప్రజలకు దక్కే సరుకును ఎవరైనా దుర్వినియోగం చేస్తే అటువంటి వారు ఏకంగా కటకటాల పాలు కావల్సిందే అన్నారు. ఇక ఇంతకు ముందటి ఇక్కడి అబ్బాజాన్‌లు అప్పట్లో బాబ్రీ మసీదుపై వేరే పిట్ట కూడా వాలకుండా చేస్తామన్నారని, అయితే తాము అక్కడ రామ మందిర నిర్మాణం చేపట్టామని తెలిపారు. సిఎం వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు తలెత్తాయి. ఈ విధంగా ఆయన మతపరమైన పదజాలపు ప్రస్తావనను పరుషరీతిలో వాడటం ఎంతవరకు సబబని సామాజిక మాధ్యమాలలో ప్రశ్నించారు. వర్గవైషమ్యాలను రేకెత్తించే రీతిలో ఈ విధంగా మాట్లాడటం ఏ ప్రయోజనాలకు? కేవలం ఎన్నికలలో విభజన రేఖలతో ఓట్ల కోసమా? అని దుయ్యబట్టారు. గతంలో కూడా ఆయన అబ్బాజాన్ పదం వాడారని గుర్తు చేశారు.