Saturday, November 23, 2024

చరిత్ర సృష్టించిన ‘యోగి’

- Advertisement -
- Advertisement -
Yogi Adityanath wins Gorakhpur
వరసగా రెండో సారి ఉత్తరప్రదేశ్ పీఠంపై కూర్చోనున్న తొలి సిఎం
మరెన్నో రికార్డులు తిరగరాయనున్న ఆదిత్యనాథ్

లక్నో: ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఘన విజయం సాధించి పెట్టిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సారి సిఎంగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఆయన ఎన్నో సరికొత్త రికార్డ్డులు సృష్టించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అయిదేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత మరోసారి అధికారం చేపట్టే మొదటి ముఖ్యమంత్రిగా యోగి రికార్డు సృష్టిస్తారు.ఆ రాష్ట్రంలో 1985 తర్వాత అధికారాన్ని తిరిగి నిలబెట్టుకున్న తొలి పార్టీ గా బిజెపి రికార్డు సృష్టిస్తుంది. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు తిరిగి ఆ పదవిని చేపట్టినప్పటికీ వారు అయిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేదు. యోగి మాత్రం అయిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసిన తర్వాత మళ్లీ ఆ పదవిని చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంఎల్‌ఎగా పోటీ చేసి గెలిచి యుపి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం 15 ఏళ్లలో తొలిసారి అవుతుంది. అదే విధంగా నోయిడాలో పర్యటించి పదవిని నిలబెట్టుకునే నేతగా కూడా ఆయన నిలవనున్నారు. నోయిడాలో పర్యటించిన ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారనే నమ్మకం గతంలో బలంగా ఉండేది.

49 ఏళ్ల యోగి ఆదిత్యనాథ్ మొదట్లో గోరఖ్‌పూర్ మఠానికి పరిమితమై ఉండేవారు. ఆయన ‘ హిందూ హృదయ సామ్రాట్’ అని ఆయన మద్దతుదారులు అంటారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ ప్రాంతానికి చెందిన పంచుర్‌లో 1972 జూన్ 5న జన్మించిన ఆదిత్యనాథ్ 1990లో అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొనేందుకు ఇల్లు వదిలిపెట్టారు. గర్వాల్ యూనివర్శిటీనుంచి సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన అప్పటి బిజెపి నేత మహంత్ అవైద్యనాథ్ శిష్యరికంలో రాజకీయాల్లో ఎదిగారు. తన తర్వాత యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ మందిరానికి ప్రధాన అర్చకుడవుతారని అవైద్యనాథ్ ప్రకటించారు. అప్పటికి ఆదిత్యనాథ్ వయస్సు22 ఏళ్లు. యూనివర్శిటీలో ఎబివిపిలోచురుగ్గా పని చేశారు.1998లో అవైద్యనాథ్ ఆశీస్సులతో ఆయన ఎంపిగా ప్రాతినిధ్యం వహిస్తున్న గోరఖ్‌పూర్‌నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పటికి ఆదిత్యనాథ్ వయసు 28 ఏళ్ల మాత్రమే. అప్పటినుంచి 2017 మార్చిలో యుపి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు అయిదు సార్లు ఆ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2017లో భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత ఎవరూ ఊహించని విధంగా ముఖ్యమంత్రి పదవికి ఆదిత్యనాథ్‌ను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది.

అప్పటివరకు కరుడుగట్టిన హిందుత్వ వాదిగా ముద్ర పడిన ఆదిత్యనాథ్ నేతృత్వంలో ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకొంది. వీటిలో కొన్ని వివాదాస్పదం కాగా, మరికొన్ని ప్రజాదరణను తెచ్చిపెట్టాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రి పదవినుంచి తప్పిస్తారనే ప్రచారం బలంగా సాగింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో సహా బిజెపి అగ్రనాయకత్వం ఆయనకు అండగా నిలవడమే కాకుండా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించడంతో ఆ పుకార్లకు ఫుల్‌స్టాప్ పడింది. ఆయన నేతృత్వంలోనే బిజెపి ఎన్నికల ప్రచారం సాగింది. ప్రధాని మోడీతో పాటుగా అగ్రనేతలంతా ఆయనకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఉత్తరప్రదేశ్‌కు వెలుపల కూడా ఆదిత్యనాథ్ ప్రత్యేక ఆకర్షణ సంపాదించారు. ఇప్పుడు బిజెపి అగ్రనేతల్లో ఒకరుగా నిలిచారు. ఇప్పడు మరోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ పగ్గాలు చేపడితే వరసగా రెండో సారి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అధికారం చేపట్టిన అయిదో నేత అవుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News