Wednesday, November 13, 2024

సవాళ్ల సుడిగుండంలో యోగి

- Advertisement -
- Advertisement -

Yogi ruling in Uttar Pradesh

మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో, రాజకీయంగా దేశ రాజకీయాలను నిర్దేశింపగల ఉత్తరప్రదేశ్‌లో ఒక విధమైన రాజకీయ అనిశ్చిత కనిపిస్తున్నది. పాలనా వైఫల్యాల గురించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజాదరణతో చెక్కుచెదరని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సవాళ్ల సుడిగుండంలో చిక్కుకున్నారు. రాజకీయ ప్రత్యర్థుల నుండి కాకుండా సొంత పార్టీ నుండే ఆయనకు ఎక్కువగా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఏదిఏమైనా ఆయన తిరిగి ముఖ్యమంత్రి కాకూడదని సొంత పార్టీలో బలమైన వర్గాలు పట్టుదలగా ఉన్నాయి. ఆయన తిరిగి ఎన్నికైతే తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకరం కాగలదని ఆందోళన వారిని యోగి పాలనపై విమర్శలు వ్యాపించేందుకు పురికొల్పుతున్నాయి.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, యోగి సారథ్యంలో యుపిలో బిజెపి 50 సీట్లను మించి గెల్చుకోలేదని కేంద్ర ప్రభుత్వం నిఘా ఏజెన్సీ భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక కథనం వైరల్ అవుతున్నది. దీనిని బట్టే ఆయన పట్ల ఎవరు అభద్రతా భావంలో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. వాస్తవానికి కరోనా రెండో వేవ్ గురించి వైద్య నిపుణులు గత ఏడాది మధ్య నుండి స్పష్టమైన హెచ్చరికలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు సర్వత్రా చెలరేగాయి. ప్రజలు, ప్రభుత్వం పాలనా యంత్రాంగం మొదటి వేవ్ తర్వాత ఉదాసీనంగా వ్యవహరించిన కారణంగానే రెండో వేవ్ ఉద్ధృతంగా వ్యాపించిందని స్వయంగా ఆర్‌ఎస్‌ఎస్ అధినేత డా. మోహన్ భగవత్ పేర్కొనడం గమనార్హం.
ఈ విమర్శలతో ఒక విధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రజాదరణపై నీలినీడలు వ్యాపించాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో బిజెపి ఓటమికి ప్రధానంగా చివరి రెండు దశలే కారణమని, ఆ సమయంలో కరోనా రెండో వేవ్ దుష్ఫలితం చూపినదని పలువురు పరిశీలకులు స్పష్టం చేశారు. ఈ అపవాదు నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఒక విధంగా వ్యూహాత్మకంగా రెండో వేవ్ కట్టడిలో ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విఫలమైన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆయనను ముఖ్యమంత్రి పదవి నుండి దింపితే గాని వచ్చే ఏడాది మొదట్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను బిజెపి ఎదుర్కోలేదనే అభిప్రాయం కలిగించే ప్రయత్నం జరిగింది.
కేంద్రంలో మరోసారి బిజెపి ప్రభుత్వం ఏర్పడాలి అంటే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కీలకం. ఇక్కడ ఓటమి ఎదురైతే దాని ప్రభావం వచ్చే రెండేళ్లలో జరిగే గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, తెలంగాణ వంటి రాష్ట్రాలపై కూడా పడే అవకాశం ఉంది. అప్పుడు బిజెపి తిరిగి లోక్‌సభలో ఆధిక్యత పొందడం అసాధ్యం కాగల ప్రమాదం లేకపోలేదు. అందుకనే ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ఎట్టి పరిస్థితులలో ఓటమిని భరింపలేదు. అందుకనే ముందుగా అక్కడ యోగి పాలనలో ఠాకూర్ల పెత్తనమే నెలకొన్నదని, బ్రాహ్మణులు పార్టీకి, ప్రభుత్వానికి దూరమయ్యారని ప్రచారం ప్రారంభించారు. అందుకు వివేక్ దూబే ఎన్‌కౌంటర్‌ను ఉదాహరణగా చూపారు. అయితే పలువురు బ్రాహ్మణ నాయకులు అప్పుడే బైటకు వచ్చే ఈ ఎన్‌కౌంటర్‌తో ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి సంబంధం లేదని అంటూ వివరణ ఇచ్చారు. ఆకట్టుకోవడం కోసం ప్రధానికి నమ్మకస్థుడైన గుజరాత్ క్యాడర్ కు చెందిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఎకె శర్మను ఐదు నెలల క్రితం యుపిలో ఎంఎల్‌సిగా చేశారు.
ఇప్పుడు హోం వంటి కీలక శాఖతో ఆయనను ఉప ముఖ్యమంత్రిగా చేసి యోగి పాలనలో ఆయనదే కీలకం అయ్యే విధంగా చేయాలని నిర్ణయించారు. అయితే అందుకు యోగి ససేమీరా ఒప్పుకోలేదు. పైగా శర్మ బ్రాహ్మణ కాదని, భూమియార్ అని వెల్లడించారు. ఒక ఐఎఎస్ అధికారిని ఉప ముఖ్యమంత్రి చేయడం ఏమిటని కొట్టి పారవేశారు. తాజాగా వారసత్వ రాజకీయం తప్పా ప్రజాబలంలేని జితిన్ ప్రసాదను బిజెపిలో చేర్చుకొని, అదేదో యుపి రాజకీయానే మార్చివేస్తున్నట్లు ప్రచారం జరిగింది. 2017 అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా అదే విధంగా వారసత్వ రాజకీయాలలో వెలుగులోకి వచ్చిన రీటా బహుగుణను చేర్చుకొని ఆమెను ఎంఎల్‌ఎగా, మంత్రిగా, ఎంపిగా చేశారు. అయినా బ్రాహ్మణులపై ఎటువంటి ప్రభావం ఆమె చూపలేకపోయారు.
దానితో యోగిని గద్దె దింపడం కోసం వరుసగా రాయబారాలు సాగాయి. గత నెల మొదట్లో మొదటగా ఆర్‌ఎస్‌ఎస్‌సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబెల్ మూడు రోజుల పాటు లక్నోలో మకాం వేసి ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, ఎంఎల్‌ఎలు, బిజెపి నాయకులతో సమాలోచనలు జరిపారు. ఆయన తిరిగి వెళ్లిన వెంటనే బిజెపి ప్రధాన కార్యదర్శి (సంఘటన) బిఎల్ సంతోష్, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ రాధామోహన్ సింగ్ రెండు రోజుల మకాం వేసే, అదే కసరత్తు చేశారు. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులు చూసిన తర్వాత వారంతా తమ అభిప్రాయం మార్చుకోవలసి వచ్చింది. రాష్ట్రంలో బిజెపికి ప్రజాదరణ గల మరో నాయకుడు లేరని, యోగి లేకుండా ఎన్నికలకు వెళ్లడం అసాధ్యమని గ్రహించారు. అందుకనే వారంతా యోగి పాలన భేష్ అంటూ పొగడ్తలతో నింపి వెళ్ళవలసి వచ్చింది. సాహజంగానే ఈ పరిణామం ఢిల్లీ పెద్దలకు రుచింపలేదు.
దానితో స్వయంగా యోగి ఢిల్లీ వెళ్లి, పెద్దలను కలసి తనకు ఎటువంటి అహంకారం లేదని, పార్టీ కట్టుబాట్లకు అనువుగా పనిచేస్తానని సంకేతం ఇచ్చివచ్చారు. అయినా మంత్రివర్గంలో మార్పులు పేరుతో ఆయనను కట్టడి చేసే ప్రయత్నాలు ఆగడం లేదు. ఇంతలో అయోధ్యలో స్థలం కొనుగోలు విషయమై పెద్ద దుమారం చెలరేగింది. ఈ వివాదం అంతా శ్రీ రామజన్మభూమి తీర్థ్ ట్రస్ట్ చుట్టూ కేంద్రీకృతం అవుతున్నా దీని ప్రభావం రాబోయే యుపి అసెంబ్లీ ఎన్నికలపై ఉండకతప్పదు. అందుకనే ఎస్పీ, ఆప్, కాంగ్రెస్ నేతలు ఉత్సాహం చూపుతున్నారు. ఈ ట్రస్ట్‌ను నియమించిన కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో మౌనం వహిస్తూ ఉండడం గమనార్హం. ఎందుకు యోగి ఆదిత్యనాథ్ అంటే ఢిల్లీ పెద్దలలో ఖంగారు కనిపిస్తున్నది? గత ఏడేళ్లుగా కాంగ్రెస్ సంస్కృతిని అనుసరిస్తూ రాష్ట్రాలలో బలమైన రాజకీయ నాయకత్వం లేకుండా, ఢిల్లీ చుట్టూ తిరిగే విధంగా చేస్తూ వచ్చారు. రాజస్థాన్‌లో ప్రభుత్వం వ్యతిరేకతను తట్టుకొని గణనీయంగా సీట్లు గెల్చుకున్న వసుంధర రాజేను ప్రతిపక్ష నాయకురాలిగా కాకుండా చేశారు. మధ్యప్రదేశ్‌లో బలమైన శివరాజ్ సింగ్ చౌహన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బిజెపి వెనుకబడుతూ ఉన్నప్పటికీ, తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించినా, ఇంకా ఫలితాలు రాకుండానే కాంగ్రెస్‌కు ప్రధాని అభినందనలు తెలపడం గమనార్హం. ఆ విధంగా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉద్దేశం తమకు లేదనే సంకేతం ఇచ్చారు. అయితే తర్వాత ఢిల్లీ పెద్దల రాజకీయ అవసరాల కోసం అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి వేశారు.
ఇప్పుడు కేవలం కర్ణాటకలో బిఎస్ యడ్డియూరప్పా, ఉత్తర ప్రదేశ్‌లో ఆదిత్యనాథ్ మాత్రమే ఢిల్లీ పెద్దల అభీష్టానికి భిన్నంగా అధికారంలో కొనసాగ గలుగుతున్నారు. వారికి గల అపారమైన ప్రజాభిమానమే అందుకు కారణం. వాస్తవానికి 2017లో ఉత్తర ప్రదేశ్ లో బిజెపి 300కు పైగా సీట్లు గెల్చిన సమయంలో ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్ పేరు లేదు. ప్రధాన మంత్రి స్వయంగా నాటి రైల్వే సహాయమంత్రి, ప్రస్తుత జమ్మూ, కశ్మీర్ లెఫ్టనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను ఎంపిక చేశారు.
ఆయన లక్నోలో జరుగుతున్న పార్టీ ఎంఎల్‌ఎల సమావేశంకు వెడుతూ, ముందుగా కాశి వెళ్లి విశ్వేశ్వరుడి దర్శనం చేసుకొని, ‘అంతా భగవానుగ్రహం’ అంటూ చెప్పారు. ఆయన పేరు బైటకు రాగానే బిజెపి ఎంఎల్‌ఎలలో తిరుగుబాటు ధోరణులు వ్యక్తం కావడంను నాటి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా గ్రహించారు. యుపి వంటి పెద్ద రాష్ట్రానికి ప్రజాదరణలేని వారిని ముఖ్యమంత్రిగా చేస్తే ప్రభుత్వం కొనసాగడం కష్టమని ప్రధానికి స్పష్టం చేశారు. అప్పుడు గోరఖ్‌పూర్‌లో ప్రశాంతంగా ఉన్న ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి, ఒక ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పిలిపించి, ఆ తర్వాత లక్నోకు పంపారు. అప్పటికే ఐదుసార్లు ఎంపిగా ఎన్నికైన ఆయనను కనీసం కేంద్ర మంత్రివర్గంలో కూడా తీసుకోక పోవడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ తర్వాత ఆయనే విస్తృతంగా ప్రచారం చేశారు.
ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయినా అక్కడ చివరకు సిఎంఒ లో పని చేసే అధికారులను సహితం ప్రధాని కార్యాలయంలో నిర్ణయిస్తూ వచ్చారు. పార్టీ వ్యవహారాలను ఉప ముఖ్యమంత్రి కేశవ్ వర్మ నిర్దేశిస్తున్నారు. పార్టీపై, ప్రభుత్వంపై యోగికి అదుపు లేదనే చెప్పాలి. అయినా కేవలం తనకున్న ప్రజాదరణ, వ్యక్తిగతంగా నిజాయితీపరుడు కావడంతో రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా కొనసాగుతున్నారు. గత నాలుగేళ్లలో బిజెపికి దేశ వ్యాప్తంగా స్టార్ క్యాంపైనర్‌గా యోగి మారారు. ప్రధాని తర్వాత ఆయననే దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రచారం కోసం అడుగుతున్నారు. నేర చరిత్ర గలవారిని, అవినీతిపరులను దగ్గరకు రానీయడం లేదనే పేరుంది. పైగా, చాలా సాధారణమైన, సదా సీదా జీవనాన్ని ఒక సాధువు వలే గడుపుతున్నారు. అందరికీ అందుబాటులో ఉంటున్నారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరిచారు. దానితో అనేక మంది బిజెపి కార్యకర్తలు ఆయనను కాబోయే ప్రధానమంత్రిగా చూస్తున్నారు. పార్టీలో ఇప్పుడు 75 ఏళ్ళు నిండిన వారు ఎటువంటి పదవులకు అనర్హులని ఒక అనధికార నిబంధనను పాటిస్తూ ఉండడంతో, సెప్టెంబర్, 2025కు 75 ఏళ్ళ వయస్సు పూర్తి చేసుకొంటున్న ప్రధాని మోడీని మార్చాలి అనుకొంటే సహజంగానే యోగి పేరు వస్తుంది. అప్పటికే మోడీ పట్ల ప్రజాదరణ తగ్గిన పక్షంలో 2024 ఎన్నికలలో యోగిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం లేకపోలేదని కథనాలు వెలువడుతున్నాయి. పైగా హిందూ సంస్థలకు ఎక్కువ అందుబాటులో ఉండే నేతగా పేరొందారు. అందుకనే ఆయన పాలన చేయలేరనే ప్రచారం చేయడం ద్వారా రాజకీయంగా ఆయనను కట్టడి చేసే ప్రయత్నాలు వ్యూహాత్మకంగా జరుగుతున్నట్లు స్పష్టం అవుతున్నది. ఇప్పటికే అనేక సవాళ్ళను మనోధైర్యంతో ఎదుర్కొంటు వస్తున్న యోగి ఆదిత్యనాథ్‌కు ప్రస్తుతం చుట్టుముట్టిన సవాళ్లు ఒక విధంగా విషమ పరీక్ష అని చెప్పవచ్చు.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News