(జనవరి 19 యోగి వేమన జయంతి
సందర్భంగా ప్రత్యేక వ్యాసం)
సాహితీ లోకంలో ‘వేమన’ అనే పేరు వినని వా రు ఉండరు. సామాజిక చైతన్యం వేమన పద్యాల ముఖ్య లక్షణం. వేమన తన పద్యాలలో సృశించని అంశం లేదు. సమాజంలోని అన్ని సమస్యలపై భిన్న కోణాలలో నుంచి దర్శించి ఆదర్శన వైశిష్ట్యాన్ని ప్రదర్శించాడు. తన పద్యాలలో ఆనాటి కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధన నిరసించడం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక సమస్యల పైన తన కలం ఝుళిపించాడు. వేమన జీవితంపై ఎంతోమంది పరిశోధకులు కృషి చేసినా ఇప్పటికీ ఆయన చరిత్ర అస్పష్టంగానే ఉంది.
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు మొదటగా వెలుగులోకి వచ్చాయి. పండితులకు మాత్ర మే కాదు పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించిన కవి యోగివేమన.
అలతి అలతి పదాలతో ఆయన రాసిన ఆట వెలది పద్యాలు ప్రజల నాలుకలపై నేటికీ నిలిచిపోయినవి. నీతి, విలువలు, సలహాలు, సూచనలతో కూడిన ఆభరణాలే వేమన పద్యాలు. 1367-1478 మధ్యకాలంలో వేమన జీవించినట్లుగా తెలుస్తుంది. ఈయన జీవిత కాలం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వేమన కొండవీటి రెడ్డి రాజ వంశానికి చెందినవాడు. కడప జిల్లాలోని ఒక చిన్న పల్లెలోని మధ్యతరగతి కాపు కులంలో నందన నామసంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున జన్మించాడని అంటారు. వేమన అసలు పేరు చిన కోమటి వేమారెడ్డి. సిపి బ్రౌన్ కృషి ద్వారా వేమన పద్యాలు 1839లో పుస్తక రూపంలో తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. హైదరాబాదులోని ట్యాంక్ బండ్ మీద ఉన్న వేమన విగ్రహం
శిలాఫలకంపై ఈ విధంగా రాసి ఉంది.
‘ఆట వెలదిని ఈటెగా విసిరిన దిట్ట
చాంధస భావాలకు తొలి అడ్డుకట్ట’.
ఈ ఒక్క వాక్యం చాలు ప్రజా కవి యోగి వేమన గురించి తెలుసుకోవడానికి.
వేమన తన పద్యాలన్నీ ఆట వెలది చందంలోనే చెప్పాడు. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు. వేమన సాధారణంగా మొదటి రెండు పాదాలలో నీతిని ప్రతిపాదించి, మూడో పాదంలో దానికి తగిన సామ్యం చూపిస్తాడు. ఉదాహరణకు .
అల్పుడెప్పుడు బలుకు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ!
కొన్ని పద్యాలలో ముందే సామ్యం చెప్పి తర్వాత నీతిని చెప్పాడు.
అనగననగా రాగ
మతిశయించు నుండు
తినగ తినగ వేముతియ్య నుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ!
వేమన పద్యాలలో మానవతావాదం వుంది
వేమన మానవుని హీన స్థితికి కారణమైన వ్యవస్థలపై తన పద్యాలతో తిరుగుబాటు బావుట ఎగురవేశాడు.
చంపదగిన యట్టి శత్రువు తన చేత
చిక్కెనేని కీడు సేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటే మేలు
విశ్వదాభిరామ వినురవేమ!
పై పద్యంలో మానవతా ధర్మం గురించి చక్కగా చెప్పాడు. శత్రువు సైతం తన చేతికి చిక్కినప్పుడు ఇలాంటి కీడు చేయకుండా విడిచిపెట్టాలని సూచించాడు. గొప్ప యుద్ధనీతిని ఇందులో ప్రదర్శించాడు.
అలాగే..
ఉర్వి వారి కెల్లా నొక్క కంచం బెట్టి
పొత్తు గుడిపి పొలము కలయజేసి
తలను చెయ్యి బెట్టి తగనమ్మ జెప్పరా
విశ్వదాభిరామ వినురవేమ!
అనే పద్యంలో సర్వ మానవ సమానత్వం గురించి ప్రపంచానికి చాటాడు.
మాల వాని నుండి మరి నీట మునిగితే
కాటికేగునప్పుడు కాల్చు మాల
అప్పుడంటినంటు ఇప్పుడెందేగినో
విశ్వదాభిరామ వినురవేమ!
అను పై పద్యంలో కుల విచక్షణలోని డొల్లతనం గురించి చాలా చక్కగా చెప్పాడు.
అట్లాగే వేమన మూఢనమ్మకాలను కూడా చీల్చి చెండాడాడు. ఈ క్రింది పద్యంలో.
పిండములను చేసి పితరుల తలబోసి
కాకులకును పెట్టు గాడిదెల్లారా
పియ్యి దినేడు కాకి పితరుడెట్లయ్యరా
విశ్వదాభిరామ వినురవేమ!
సంఘసంస్కరణను ప్రబోధించే సర్వ మానవ సమానత్వం, అస్పృశ్యత ఖండన, నైతిక ప్రబోధం, మూఢనమ్మకాల ఖండన, ఆర్థిక భావాలను సూచించేపై పద్యాలను బట్టి వేమనను గొప్ప మానవతావాదిగా చెప్పవచ్చును.
అయితే స్త్రీల గురించి చెప్పవలసి వచ్చినప్పుడు వేమన సంప్రదాయ వాదిగానే ముద్రించబడ్డాడు. ఇది ఒక మచ్చగానే మిగిలింది. అందుకు ఉదాహరణలుగా ఈ క్రింది పద్యాలు చూద్దాం.
ఆలి తొలుత వంచ కధముడైతా వెనుక
వెనుక వంతు ననుట వెర్రి తనము
చెట్టు ముదరనిచ్చి చిదిమితే బోవునా
విశ్వదాభిరామ వినురవేమ!
అంటే… ‘భార్యను తొలిగానే అదుపులో పెట్టుకోవాలి. తర్వాత అదుపులో పెట్టుకోవచ్చులే అనుకొనుట వెర్రి తనం. చెట్టు పెద్దదైన తర్వాత సులభముగా పీకలేము ‘అని దీని తాత్పర్యం.
పతిని విడవరాదు పదివేలకైనను
బెట్టి జెప్ప రాదు పేద కైన
పతిని తిట్టరాదు సతిరూపవతి యైన
విశ్వదాభిరామ వినురవేమ.
ఈ పద్యంలో ‘భర్తను ఎప్పుడూ విడువకూడదు. పేదవాడికి దానం చేసి ఎవరికి చెప్పకూడదు. అందమైన రూపం గల భార్య భర్తని తిట్టకూడదు ‘అని దీని భావన.
సమకాలీన వ్యవస్థలపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన సంఘసంస్కర్త. సమ సమాజ స్థాపన కొరకు కృషి చేసిన గొప్ప విప్లవకారుడు. సమాజానికి హిత బోధతో వేలాది పద్యాలు రాసి వాడవాడలో తిరుగుకుంటూ ప్రచారం చేస్తూ చివరకు కడప దగ్గర పామూరు కొండ గుహలో శార్వరి నామ సంవత్సరం శ్రీరామనవమి నాడు కదిరి తాలూకా లోని కటారు పల్లెలో వేమన సమాధి పొందాడు. అనేకమంది ఆయన పద్యాల పై పరిశోధన చేశారు. ప్రముఖ పాత్రికేయులు నార్ల వెంకటేశ్వరరావు కేంద్ర సాహిత్య అకాడమీ వారి సహకారంతో వేమన జీవిత చరిత్రను 14 భాషల్లోకి అనువదించడానికి విశేష కృషి చేశారు. ఆంగ్ల,ఐరోపా భాషల్లోకి, అన్ని ద్రావిడ భాషలలోకి వేమన పద్యాలు అనువాదమయ్యాయి.
సి. ఇ.గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమన సాహిత్యానికి ముగ్దులై ఆయనను లోకకవిగా కీర్తించారు. వేమనకు లభించిన గౌరవం మరే తెలుగు కవికి లభించలేదు. ఐక్యరాజ్యసమితి యునిస్కో విభాగం ప్రపంచ భాషా కవులలో గొప్ప వారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకొని ఆయన రచనలను పలు భాషల్లోకి అనువదింప జేశారు. వేమన జీవితంపై కూడా అనేక సినిమాలు తీశారు. యోగివేమన సీరియల్ టీవీ ఛానల్‌లో ప్రసారమైంది. యోగి వేమన జయంతిని ప్రతియేట జనవరి 19న ప్రజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సాహిత్య అభిమానులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వేమన జీవితం, ఆయన రాసిన పద్యాలు స్ఫూర్తిదాయకం.
కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి