Thursday, January 23, 2025

పాపాల భైరవులు మీరే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కృష్ణా జలాలపై మరణశాసనం రాసిందే బిఆర్‌ఎస్ పాలకులని సిఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. 811 టిఎంసీల కృష్ణా జలాల్లో 299 సరిపోతాయని సంతకం పెట్టిందే బిఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. ఇదే విషయాన్ని నామా నాగేశ్వర రావు అడిగిన ప్ర శ్నకు కేంద్రమంత్రి పార్లమెంట్‌లో చెప్పారన్నారు. నిజం గా ప్రాజెక్టులపై చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలని రేవంత్‌రెడ్డి సూచించారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిందే బిఆర్‌ఎస్ సర్కార్‌అని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం అవినీతి బయటపడటంతో కెఆర్‌ఎంబికి అప్పగించారంటూ తమ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో భాగంగా సిఎం సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడారు.
80 వేల పుస్తకాలు చదివిన కెసిఆర్….
కాళేశ్వరం ప్రాజెక్టు చర్చకు వచ్చినప్పుడల్లా బిఆర్‌ఎస్ కృష్ణాజలాల అంశాన్ని తెరపైకి తేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రాజెక్టులు తీసుకుంటుంటే బిఆర్‌ఎస్ నల్గొండలో సభ పెట్టడం ఏమిటనీ, దమ్ముంటే ప్రాజెక్టులపై కెసిఆర్, కెటిఆర్, హరీశ్ రావులు ఢిల్లీలో ఆమరణ నిరాహారదీక్ష చేయాలని సిఎం రేవంత్ సవాల్ విసిరారు. తెలంగాణ హక్కుల కోసం తాము కొట్లాడుతుంటే బిఆర్‌ఎస్ కాళ్ల కింద కట్టె పెడుతుందని రేవంత్ ధ్వజమెత్తారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే బిఆర్‌ఎస్ నాయకుల కళ్లముందే చంద్రబాబు ముచ్చుమర్రి కట్టడం, వైఎస్‌ఆర్ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచారని ఆయన ఆరోపించారు. జగన్ ప్రగతి భవన్‌కు వచ్చినప్పుడు కెసిఆర్ డైనింగ్ టేబుల్ మీదే జీఓ నెంబర్ 203 తయారైందన్నారు. రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని వారికి అలుసు ఇవ్వడం ద్వారానే తెలంగాణ నీళ్లను దోచుకుపోతున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. నాగార్జున సాగర్ తెలంగాణ భూభాగంలో ఉందని ఇంటిదొంగ సహకారం లేకుంటే ఇదంతా జరిగేదా? అని రేవంత్ ప్రశ్నించారు. ఎపి మంత్రి రోజా గారింట్లో పులుసు తిని వీరు అలుసు ఇచ్చారని దాంతో ఎపి ప్రభుత్వం నీళ్లు తరలించుకుపోయిందన్నారు. 80 వేల పుస్తకాలు చదివి అన్నీ తానై కెసిఆర్ కట్టిన మేడిగడ్డ మేడిపండు అయ్యిందని రేవంత్ ఎద్దేవా చేశారు.
అమరుల త్యాగాలతో తెలంగాణ ఏర్పాటు
తెలంగాణ అంటే కేవలం భౌగోళిక ప్రాంతమే కాదు ఒక ఎమెజన్ అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంతోమంది అమరుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. పోరాటంలో అడుగడుగునా ఉద్వేగపూరితమైన సంఘటనలే కనిపిస్తాయన్నారు. అనేక మంది ఉద్యమకారులు, విద్యార్థులు సొంత రాష్ట్రం తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేశారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో కన్న కలలు నిజం చేసుకోవాలన్న ఆశతో తమ జీవితంలో వెలుగువస్తుందని ప్రజలు ఆకాంక్షించారన్నారు. అయితే తొమ్మిదిన్నరేళ్లలో అవి నెరవేరలేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏ ఒక్కరో తొడ కొట్టి, ఇంట్లో కూర్చొని డబ్బాలు కొట్టుకుంటే రాష్ట్రం రాలేదని సిఎం రేవంత్ ఎద్దేవా చేశారు. నిజాంలకు, రజాకార్లకు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడి విముక్తి పొందిన రాష్ట్రమని సిఎం రేవంత్ గుర్తుచేశారు. ఇంతటి పోరాట చైతన్యమున్న రాష్ట్రంలో ప్రతిపక్ష నేత సభకు రాకపోవడం, ఓటమిని జీర్ణించుకోలేకపోవడం మంచిదికాదన్నారు.
ప్రధాన ప్రతిపక్ష నేత సభకు రాకుండా ఉండటం సభను అగౌరపరచటమేనని సిఎం రేవంత్ మండిపడ్డారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేత కెసిఆర్ అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇచ్చి ఉంటే బాగుండేదని సిఎం అన్నారు. ప్రతి పక్ష నేతలు ఇప్పటికైనా సరైన పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకానీ, ఇంట్లో కూర్చొని ప్రతిపక్ష నేత అని చెప్పుకోవడం సమంజసంగా లేదని రేవంత్ మండిపడ్డారు. సుదీర్ఘమైన రాజకీయ, పరిపాలన అనుభవంతో పాటు తాను 80 వేల పుస్తకాలు చదివిన మేధావిని అని చెప్పుకునే కెసిఆర్ సభకు రాకపోవడం పై రేవంత్ ఆక్షేపించారు.
కెటిఆర్ ఓ జూనియర్ ఆర్టిస్ట్
బిఆర్‌ఎస్‌లో ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారంటూ పరోక్షంగా కెటిఆర్‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ఆ ఆర్టిస్ట్ ఆటోలో కెమెరాలు పెట్టుకుని ఆటోరాముడు డ్రామాలు చేశాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కిరాయి ఎల్తలేదని, సంసారం నడుస్తలేదని ఆటో తగులబెట్టుకుం టారా ఇది వారికి మరింత ఆర్థిక నష్టమే కదా అని సిఎం రేవంత్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తే బిఆర్‌ఎస్ విమర్శిస్తోందన్నారు. సిఎం స్థానంలో ఓ రైతు బిడ్డ కూర్చోవడం బిఆర్‌ఎస్ జీర్ణించుకోలేకపోతుందన్నారు. ఇక్కడి వారెవరూ ఆషామాషీగా ఇక్కడకు రాలేదని ఎవరి మాదిరిగానో మేనేజ్ మెంట్ కోటాలో ఉద్యమం ముసుగులోనో రాలేదని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ తల్లి అంటే కిరీటం పెట్టుకొని గడీలా ఉండలేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి అనగానే ప్రతి ఒక్కరికి మన తల్లి, చెల్లి గుర్తుకు రావాలని, శ్రమజీవికి ప్రతీకగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయి. ప్రజాస్వామ్య పాలనలో రాజరికం ఉండకూడదని భావిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. కవి అందెశ్రీ తెలంగాణకు గొప్ప గీతాన్ని అందించారని, జయజయహే గీతం తెలంగాణ ఉద్యమంలో అందరికీ స్ఫూర్తినిచ్చిందని సిఎం రేవంత్ వెల్లడించారు. రాష్ట్రం వచ్చాక జయజయహే తెలంగాణ పాట రాష్ట్ర గీతం అవుతుందని ఆశించారన్నారు. కానీ, తెలంగాణ వచ్చాక ఆ పాటను నిషేధించినంత పని చేశారని ఆయన ఆరోపించారు. ఈ పాటను రాష్ట్ర గీతంగా ఆమోదించే నిర్ణయాన్ని విపక్ష నేత అభినందిస్తారని అనుకున్నానని, కానీ, ఆయన కనీసం సభకు కూడా రాలేదని రేవంత్ వ్యాఖ్యానించారు. స్వరాష్ట్రంలో తమకు రక్షణ ఉంటుందని, కలలు నెరవేరతాయని ప్రజలు భావించారని, కానీ, ప్రజాకాంక్షలు తొమ్మిదిన్నరేళ్లలో నెరవేరలేదని ఆయన పేర్కొన్నారు. నిరంకుశ ప్రభుత్వం వద్దని ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని ఆయన చెప్పారు. ఏ పాపం చూసినా హరీష్ కనపడుతున్నారని సిఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పాపాల బైరవుడు హరీష్ అని సిఎం విమర్శించారు. ఆర్థిక శాఖ చూసినా, ఇరిగేషన్ శాఖ చూసినా పాపాలు అన్ని బయట పడుతున్నాయని ఆయన ఆరోపించారు. 13 తేదీన కాళేశ్వరం పోదాం, మేడిపండులాగా మేడిగడ్డ చూపిద్దాం అని సిఎం రేవంత్ అన్నారు. 13వ తేదీన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు బస్సులు పెడతామని ఆయన తెలిపారు. అందరం వెళ్లి చూద్దామన్నారు. కెసిఆర్ కూడా 12వ తేదీన చర్చలో పాల్గొనాలని సిఎం రేవంత్ సూచించారు. 13వ తేదీన మాజీ సిఎం కెసిఆర్ కాళేశ్వరం రావాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు.
కలెక్షన్లు, ఎలక్షన్లు, సెలక్షన్లు బిఆర్‌ఎస్ తీరు…
కాంగ్రెస్ పార్టీని పదేపదే వారసత్వ పార్టీ అని బిఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారని, కానీ, గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిందని రేవంత్ అన్నారు. కెసిఆర్ కుటుంబం తెలంగాణ కోసం చేసిన త్యాగం ఏమిటో చెప్పాలన్నారు. సోనియా గాంధీ ప్రధాని పదవిని వదులుకున్నా రన్నారు. ఉద్యమం సమయంలో రాజీనామా చేసి మళ్లీ మూడు నెలలకు పదవులు స్వీకరించడమే వారు చేసిన పని అన్నారు. వీటిని త్యాగాలుగా చెప్పుకోవద్దని సిఎం రేవంత్ హితవు పలికారు. కలెక్షన్లు, ఎలక్షన్లు, సెలక్షన్లు బిఆర్‌ఎస్ తీరు అని రేవంత్ ఆరోపించారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టిజి
డిసెంబర్ 9వ తేదీన కొన్ని కీలక హామీలను మంత్రివర్గంలో ఆమోదించామని, తెలంగాణ ఉద్యమ సమయంలో అందరం టిజి అని రాసుకునేవాళ్లం, కొందరు యువకులు తమ గుండెలపై టిజి అని పచ్చబొట్టు వేయించుకున్నారని సిఎం రేవంత్ తెలిపారు. ఉద్యమ సమయంలో వాహనాలపై, బోర్డులపై అందరం టిజి అని రాసుకున్నాం. కేంద్రం కూడా తమ నోటిఫికేషన్‌లో టిజి అని పేర్కొంది. అందరి ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తమ పార్టీ పేరు స్ఫురించేలా టిఎస్ అని పెట్టిందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేం రాష్ట్ర అక్షరాలను టిజిగా మార్చాలని నిర్ణయించుకున్నామన్నారు.
త్వరలోనే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని సిఎం రేవంత్ ప్రకటించారు. గ్రూప్-1 పరీక్షల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించి కసరత్తు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. కొన్ని నిబంధనల వల్ల టిఎస్పీఎస్సీ ప్రక్షాళన ఆలస్యం అయ్యిందని ఆయన స్పష్టం చేశారు. పోలీసు ఉద్యోగాల కోసం యువత ఎంతోకాలం నిరీక్షించారని రేవంత్ అన్నారు. 15 రోజుల్లోనే పోలీసు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
సిఎంఓలో మైనార్టీ ఐఏఎస్‌కు కీలక బాధ్యతలు
ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకొని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్లం కాదని, సిఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటే నిర్ధిష్ట విధానం ఉంటుందన్నారు. ప్రభుత్వ పరిపాలనలో మైనార్టీలకు సముచిత స్థానం ఇస్తున్నామన్నారు. సీఎంఓలో మైనార్టీ ఐఏఎస్‌లకు కీలక బాధ్యతలు అప్పగించామని ఆయన తెలిపారు. మైనార్టీకి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే అడ్డుకున్నారన్నారు.
ఉచిత బస్సు ప్రయాణంతో ఆదాయం
మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల క్రమంగా ఆదాయం పెరుగుతోందని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ప్రముఖంగా దేవాదాయ శాఖ ఆదాయం పెరుగుతోందన్నారు.ప్రజా ప్రభుత్వం ఏర్పడక ముందు నవంబర్ నెలలో ఎండోమెంట్ ఆదాయం రూ. 49.27 కోట్లు ఉండేదని, ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ నెలలో రూ. 93.27 కోట్లు, జనవరి నెలలో రూ.69 కోట్ల ఆదాయం వచ్చిందని సిఎం రేవంత్ చెప్పారు. మహిళలకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తే విమర్శలు చేస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి విపక్ష నేతలపై మండిపడ్డారు. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని బిఆర్‌ఎస్ నాయకులు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం మహిళలను ఎన్నో రకాలుగా అవమానించిందన్నారు. మొదటిసారి ఏర్పడిన నాటి టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. కానీ, ఈ ప్రభుత్వం తొలిసారే ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు ఇచ్చిందని సిఎం రేవంత్ అన్నారు. కొందరు నేతలు ఆటోలో కెమెరాలు పెట్టుకొని నటన ప్రదర్శిస్తున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం 201819లో యాసంగి రైతుబంధును పూర్తి చేయడానికి ఐదు నెలలు తీసుకుందని మండిపడ్డారు. 2019-20లో రైతుబంధు పూర్తి చేసేందుకు 9 నెలలు పట్టిందన్నారు. 202021లో రైతుబంధు పూర్తి చేసేందుకు 4 నెలలు పట్టిందని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాకుండానే రైతుబంధు ఇవ్వలేదని రైతులను బిఆర్‌ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చాం
ప్రజలు ఇబ్బందులు పడితే బాగుండని విపక్షం కోరుకుంటోందని సిఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదని ఆయన అన్నారు. ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని గత ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. పరిస్థితిని చక్కదిద్దుతూ ఈ ప్రభుత్వం ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్‌లకు ఈ నెల 1వ తేదీన జీతాలు ఇచ్చామని సిఎం రేవంత్ తెలిపారు. ప్రజా సమస్యలను శాసనసభ్యులు తీసుకువస్తే పార్టీలకు అతీతంగా పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి అన్నారు. సచివాలయంలో తనతో పాటు తన అధికారులు అందుబాటులో ఉంటామన్నారు. ఎవరిని కలవకుండా వివక్ష చూపబోమన్నారు. మీరు వచ్చి నన్ను కలవడం ద్వారా అనవసరపు ప్రచారం కల్పించే దురుద్దేశం తమకు లేదని, బిఆర్‌ఎస్‌లోని 39 మందిలో ఎప్పుడైనా వచ్చిన తనను కలవొచ్చు అన్నారు. 9 ఏళ్లుగా జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్మించుకునేందుకు అందరి సాయం అవసరం అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News