Thursday, January 16, 2025

మీరు ఒక పుస్తకాన్ని తెరవండి ఒక నూతన ప్రపంచానికి ద్వారాలు మీ కోసం తెరుచుకుంటాయి

- Advertisement -
- Advertisement -

పుస్తకాలు జ్ఞానాన్ని, సంతోషాన్ని, జీవిత పాఠాల్ని, ప్రేమని, భయాన్ని, మన లోపలి తాత్విక చింతలను, నూతన ఆలోచనలను ఇలా ఎన్నింటినో మనకి ఇవ్వడం కోసం ప్రదర్శనలలో వరుసగా ఒక దాని వెనుక ఒకటి వొద్దికగా నిలబడి మన కోసం ఎదురు చూస్తాయి. విజ్ఞాన, సాంకేతిక, ఖగోళ, మనస్తత్వ శాస్త్రాల నుండి మొదలుకుని, చిత్రకళ, శిల్పకళ, సంగీతం, సినిమాలు, సంస్కృతి, ఆధ్యాత్మిక, యాత్రా సాహిత్యం, దేశవిదేశాల వంటకాలు, అందం, ఫ్యాషన్ రంగాలు, పిల్లల పుస్తకాలు ఇట్లా ఈ పుస్తకాల జ్ఞాన భాండాగారానికి హద్దులే లేవు. మనల్ని ప్రభావితం చేసిన, ప్రాచీన, ఆధునిక, అత్యాధునిక, బహుళ అస్తిత్వాల, విప్లవ, ధిక్కార సాహిత్యం, రకరకాల సిద్ధాంతాలు, వాటి మధ్య నడిచిన రాద్ధాంతాల సాహిత్యం కూడా అందుబాటులో వుంటుంది.

ఆ ప్రదర్శనలో దుకాణాల మధ్య తిరుగుతూ, పుస్తకాల సుగంధాన్ని ఆస్వాదిస్తూ, ఒక్కొక్క పుస్తకం అట్ట వెనుక ఏం రాసారో, లోపల ఏముందో కళ్ళతో తడిమి చూసుకుంటూ, ఆనందిస్తూ చదువుకుంటూ.. ఆకలిని, కాలాన్ని మర్చిపోయి ఆనందంగా ఆ ప్రదర్శనలో జరిగే ఇతరేతర విషయాలను వేటినీ పట్టించుకోకుండా తిరిగే పుస్తక ప్రియులని అనేక మందిని మనం అక్కడ చూస్తాం.

ప్రచురణకర్తలకు, రచయితలకు, సాహిత్య సమావేశాలకి, పుస్తక ఆవిష్కరణలకు, కొత్త పరిచయాలకి, అవి కేంద్రాలు. కొత్త యువ రచయితల కోలాహలాలకు, పాత పెద్ద వయసు రచయితల అవలోకనాలకు, ఎన్నడో తప్పిపోయిన మిత్రులను, దొరకని పుస్తకాలని మళ్ళీ పొందడానికి, కాసిన్ని సరదా కబుర్లకు, సాయంత్రాలకు పుస్తక ప్రదర్శనశాలలు కూడలి. పాఠకుల జ్ఞానదాహం తీర్చే పుస్తక ప్రదర్శనల కోలాహలం, ప్రపంచమంతటా ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ డిజటల్ యుగంలో పుస్తకాలకి ఇంకా కాలం చెల్లలేదని, అవి మళ్ళీమళ్ళీ మనకి చెబుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ డిసెంబర్ 19నుండి మొదలై 29 వరకు జరుగుతోంది. ఆ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా జరిగే కొన్ని ప్రముఖ పుస్తక ప్రదర్శనల గురించి మాట్లాడుకుందాం.

అబుదాబి ఇంటర్నేషనల్ బుక్ ఫైర్

అబుదాబి అథారిటీ ఫర్ కల్చర్ అండ్ హెరిటేజ్, ఫ్రాంక్ ఫర్డ్ బుక్ ఫెయిర్ కలిసి నిర్వహించే ఈ పుస్తక ప్రదర్శన మధ్య ప్రాచ్యదేశాలలో జరిగే అతిపెద్ద ప్రదర్శన. ఇక్కడ ఎక్కువగా పుస్తకాల ప్రచురణకర్తలు, పుస్తకాలపై హక్కుల విక్రయాలు, ప్రచురణకు సంబంధించిన లైసెన్సులు పొందడం ఇలాంటి విషయాలకు సంబంధించిన వాళ్ళు పాల్గొనే ఒక కూడలిగా ఉంటుంది ఇది. అరబిక్ భాష మాట్లాడే ఆ ప్రాంత ప్రచురణ కర్తలకు, అలాగే ఉత్తర ఆఫ్రికా ప్రచురణ కర్తలకు ఇది ఒక అతి పెద్ద ఈవెంట్. దాంతో పాటు పుస్తకాలు చూసేందుకు కొనేందుకు కూడా ఎంతో మంది జనం వస్తారు.

బుక్ ఎక్స్ పో అమెరికా (బిఇఎ)

ఇది మరో కొత్త తరహా పుస్తక ప్రదర్శన. 1947 నుంచి సాగుతూ ఉన్న ఈ ప్రదర్శన ఏడాది పొడుగునా వివిధ ప్రాంతాలలో మొబైల్ ప్రదర్శనలా తరలి వెడుతుంది. ఒకచోట స్థిరంగా వుంటూ ఏడాదికి ఒకసారి జరిగే పుస్తక ప్రదర్శనలా కాకుండా, బిఇఎ అమెరికా అంతటా పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ తిరుగుతుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పుస్తకాల వాణిజ్యంతో పాటు, ప్రదర్శన చూడటానికి వచ్చే పుస్తకప్రియులు, రిటైల్ కొనుగోలుదారులు, లైబ్రరీలు ఇంకా రచయితలు పాల్గొంటూ ఉంటారు.

బ్యూనస్ ఎయిర్స్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన

లాటిన్ అమెరికాలోని అతిపెద్ద పుస్తక ప్రదర్శన. 1975లో అర్జెంటీనా రచయితల సంఘం, అర్జెంటీనా ప్రచురణ సంస్థలు కలిసి ఈ పుస్తక ప్రదర్శన నిర్వహించడం మొదలుపెట్టారు 1975లో ‘బ్యూనస్ ఎయిర్స్’ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన మొదటిసారిగా జరిగింది. ఆనాడు 50 మంది రచయితలు, ఏడు దేశాల వాళ్లు దీనిలో పాల్గొన్నారు. మొదటిసారి 1.5 మిలియన్ల మంది ఈ పుస్తక ప్రదర్శనను ఎంతో ఆసక్తిగా సందర్శించారు. ప్రస్తుతం కనీసం 50 దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. సందర్శకుల సంఖ్య 12 లక్షలకు చేరుకుంది నేడు.
అలాగే మెక్సికన్ నగరంలో జరిగే ‘గ్వాడల జారా’ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన కూడా తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది.

హాంగ్ కాంగ్ పుస్తక ప్రదర్శన

ఆసియా దేశాల్లో జరిగే అతి పెద్ద బుక్ ఫెయిర్ హాంగ్ కాంగ్ పుస్తక ప్రదర్శన. సాహిత్యాన్ని, సంస్కృతిని ప్రోత్సహించటం ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశం. అనేక సాహితీ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. ప్రపంచ ప్రసిద్ధి పొందిన అత్యుత్తమ క్లాసిక్స్‌తో పాటు, సమకాలీన సాహిత్యాన్ని కూడా వీటిలో ప్రదర్శనకు పెడతారు.
భారత దేశం మన దేశంలో జరిగే పుస్తక ప్రదర్శనలో కొన్ని ప్రముఖమైన ఉన్నాయి.

చెన్నై బుక్ ఫెయిర్

జనవరి మొదటి వారంలో దక్షిణాది ప్రాంతాల్లో జరిగే అతిపెద్ద పుస్తక ప్రదర్శన. 1985 నుంచి పాట్నాలో పాట్నా బుక్ ఫైయిర్ జరుగుతూ ఉంది. విజయవాడ, హైదరాబాద్, బెంగుళూరు, కొచ్చి, తిరువనంతపురం, గోవా ఇలా దేశంలోని అనేక ప్రాంతాలలో ప్రతి ఏటా పుస్తక ప్రదర్శనలు జరుగుతూనే వుంటాయి.

కలకత్తా బుక్ ఫెయిర్

ఎంతో కాలంగా జరుగుతున్న చెప్పుకోదగ్గ పుస్తక ప్రదర్శన. దేశవిదేశాల సాహిత్యం అక్కడ అమ్మకం కోసం ప్రదర్శనకు పెడతారు. దేశంలో శీతాకాలంలో జరిగే కలకత్తా బుక్ ఫైర్ పుస్తకాల పబ్లిషర్స్, వ్యాపారుల కోసం సాధారణ ప్రజల కోసం జరుగుతుంది. ఆసియాలోనే అతి పెద్దదైన ఈ పుస్తక ప్రదర్శనకి అనేక ప్రాంతాల నుంచి ప్రజలు చూసేందుకు, కొనుగోళ్ల కోసం వస్తారు.
రకరకాల సాహితీ చర్చలు, కార్యక్రమాలు, సంస్కృతి, కళల ప్రదర్శనలు జరిగే ఈ కలకత్తా పుస్తక ప్రదర్శనను దాదాపు రెండు మిలియన్ల ప్రజలు చూస్తారని ఒక అంచనా.
సాహిత్యం, కళలు మానవుల జీవన ప్రయాణంలో వెలిగే దారి దీపాలే కాదు, కొత్త దారులకు దారి చూపే వేగుచుక్కలు కూడా.
హైరాబాద్ నగరంలో డిసెంబర్ 19 నుండి 29 వరకు జరగనున్న హైదరాబాద్ బుక్ ఫైర్‌కు మెహఫిల్ స్వాగతం పలుకుతూ వుంది.
హైదరాబాద్ నగరానికి పునాది వేసిన కులీకుతుబ్ షా ఈ నగరం నీటిలోని చేపలవలె మనుషులతో నిండి కళకళ లాడాలని కల కన్నాడు. ఎక్కడెక్కడి నుండో వచ్చి, ఈ నగరాన్ని తమదిగా చేసుక్కున్న, తరాలుగా ఇక్కడి వాళ్ళే అయిన మానవులతో నిండిన ఈ నగరం పుస్తకాలతో, జ్ఞానంతో నిండాలని, శాంతి, సుహృద్భావాలతో, సుభిక్షంగా వుండాలని కోరుకుందాం.అప్నా షహర్ హైదరాబాద్ మే ఏ మేహిఫిల్ జారీ రహేగా..
ఆదాబ్. షుక్రియా.

లండన్ బుక్ ఫెయిర్

యూరప్ లో ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫెయిర్ తరువాత జరిగే అతిపెద్ద రెండవ పుస్తక ప్రదర్శన ఇది. పుస్తక ప్రచురణ కర్తలు, విక్రయితలు ఏజెంట్లు, రచయితల యాత్రాస్థలి ఇది. మెదటి సారి 1971లో పుస్తక ప్రచురణ కర్తలు, లైబ్రేరియన్లు మాట్లాడుకోవడం కోసం చిన్నగా, కొద్మొది మందితో మొదలైనటువంటి ఈ ప్రదర్శన, ప్రతి ఏడాది పెరుగుతూ పోయింది. ప్రస్తుతం కనీసం 100 దేశాల నుంచి ప్రతినిధులు ఈ ప్రదర్శనలో పాల్గొంటారు.టెలివిజన్, సినిమా రికార్డ్ కంపెనీలు, పుస్తకాల పై హక్కులు ఇలా పుస్తకాలు, సృజన రంగానికి సంబంధించిన అన్ని విషయాల వ్యాపారంతోపాటు సాహిత్యం, కళలు చర్చించబడుతూ ఉంటాయి. ఎంతో ఆసక్తికరంగా సదస్సులు, సెమినార్లు నిర్వహిస్తారు. ప్రముఖ రచయితలు, కవులు, సృజనాత్మక రంగంలోని మేధావులు, పెద్ద సంఖ్యలో హాజరయ్యే మంచి పుస్తక ప్రదర్శన ఇది. లండన్ బుక్ ఫైయిర్ లో ఉత్తమ సాహిత్యానికి అవార్డులు కూడా ఇస్తారు.

ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫెయిర్

ప్రపంచంలో జరిగే అతి పెద్ద వాణిజ్య ప్రదర్శన ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫెయిర్. ప్రతి సంవత్సరం అక్టోబర్ లో జర్మనీ దేశంలోని ఫ్రాంక్ ఫర్డ్ లో 5 రోజులపాటు జరిగే ఈ పుస్తక ప్రదర్శనలో దాదాపు 100 దేశాల నుండి 7వేల మంది పుస్తక ప్రచురణ కర్తలు పాల్గొంటారు. మరో మూడు లక్షల మంది సందర్శకులు ఈ ప్రదర్శనను చూసేందుకు వస్తారు. దాదాపు 15వ శతాబ్దంలో ప్రింటింగ్ టెక్నాలజీ ప్రారంభమైన నాటి నుండీ, ఈ ప్రదర్శన జరుగుతూ వస్తున్నది. ప్రపంచంలోనే అతి పురాతనమైన ప్రదర్శనగా, దీర్ఘకాలం పాటు కొనసాగిన ప్రదర్శనగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. మొదటి మూడు రోజులు కేవలం పుస్తక వ్యాపారం చేసే పబ్లిషర్లు,విక్రయదారులకు మాత్రమే ప్రదర్శనలో పాల్గొనేందుకు అనుమతి వుండగా, మిగిలిన రెండు రోజులు సాధారణ ప్రజలు కూడా ఆ ప్రదర్శనను చూసేందుకు అవకాశం ఉంటుంది.

పుస్తక రంగంతో సంబంధం ఉండే ప్రచురణకర్తలు, పుస్తకాల ఏజెంట్లు, విక్రేతలు, పరిశోధకులు, కళాకారులు, సినిమా నిర్మాతలు, అనువాదకులు, పబ్లిషింగ్ హౌసెస్ బిజినెస్ చేసే వాళ్ళు, రచయితలు. జర్నలిస్టులు, మీడియా రంగానికి సంబంధించిన వాళ్ళు, పంపిణీ దారులు ఇలారకరకాల రంగాలకు చెందిన వ్యక్తుల, సంస్థల అతిపెద్ద కూడలి ఫ్రాంక్ ఫర్డ్ బుక్ ఫెయిర్. 500 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉన్న ఈ పుస్తక ప్రదర్శనకువెళ్లడం,అక్కడఆ చివరి రోజులలో జరిగే సాహిత్య సమావేశాల్లో భాగం కావడం చాలా గర్వకారణంగా భావిస్తారు అందరూ. 1950 నుంచి ‘పీస్ ప్రైజ్ ఆఫ్ ది జర్మన్ బుక్ ట్రేడ్‘ప్రతి సంవత్సరము అక్కడ ప్రదానం చేస్తునారు.

విమల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News