న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున సంస్థాగతంగా మార్పులు చేర్పులు చేసిన కొన్ని రోజుల తరువాత పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం పార్టీ అగ్రశ్రేణి కార్యనిర్వాహకవర్గ సభ్యులతో కరాఖండీగా మాట్లాడారు. తమ ఆధ్వర్యంలోని రాష్ట్రాల్లో భవిష్యత్తులో జరిగే ఎన్నికలలో వచ్చే ఫలితాలకు వారిని జవాబుదారీ చేయనున్నట్లు ఖర్గే స్పష్టం చేశారు. సైద్ధాంతికంగా బలహీనులైన ఫిరాయింపుదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారిని ఖర్గే కోరారు. క్రితం వారం నియుక్తులైన వారితో సహా పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌లను ఉద్దేశించి ఢిల్లీ ఇందిరా భవన్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఖర్గే ప్రసంగిస్తూ, కాంగ్రెస్ సిద్ధాంతానికి నిబద్ధులైనవారిని, ప్రతికూల పరిస్థితుల్లోనూ తమకు దన్నుగా నిలబడేవారిని ప్రోత్సహించడం ప్రధానమని ఉద్ఘాటించారు.
సంస్థాగతంగా మరి కొన్ని మార్పులు జరగవచ్చునని కూడా ఖర్గే సూచించారు. ఇప్పటికే కొన్ని మార్పులు జరిగాయని, మరి కొన్ని జరగబోతున్నాయని ఆయన చెప్పారు. పునర్వవస్థీకృత సంస్థలో కొత్త ఆఫీస్‌బేరర్లను పార్టీ ఇటీవల తీసుకువచ్చింది. సమావేశానికి హాజరైన వారిలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. సీనియర్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, కెసి వేణుగోపాల్, జైరామ్ రమేష్, అందరు ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లు కూడా ఉన్నారు. ‘వోటర్ల జాబితా తప్పులతడకల’ గురించి కూడా ఖర్గే సమావేశంలో ప్రస్తావించారు.
అది ఎన్నికల్లో పెద్ద ఎత్తున సంభవిస్తున్నదని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో దీని గురించి ఒక ప్రశ్న కూడా లేవనెత్తారని ఆయన గుర్తు చేశారు.‘ఇటీవలి రోజుల్లో మన మద్దతుదారుల పేర్లను వోటర్ల జాబితాలో నుంచి తొలగించిన విషయం మీరంతా గ్రహించాలి. లేదా పేరు తొలగించి, పొరుగు బూత్ జాబితాలో చేరుస్తున్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు కొత్త పేర్లను బిజెపి చేరుస్తోంది. ఈ రిగ్గింగ్‌ను ఎటువంటి పరిస్థితుల్లోను ఆపాలి’ అని ఖర్గే స్పష్టం చేశారు.సుప్రీం కోర్టు ఉత్తర్వు మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) ఎంపిక కమిటీలో ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) పేరును ఇంతకుముందు చేర్చారని, కానీ మోడీ ప్రభుత్వం కమిటీలో నుంచి సిజెఐని తొలగించిందని ఖర్గే ఆరోపించారు.
ప్రభుత్వం తుదకు దేశ ప్రధాన న్యాయమూర్తి నిష్పాక్షికతను కూడా విశ్వసించడం లేదు. ఈ వ్యవహారం సుప్రీం కోర్టులో విచారణ జరగవలసి ఉన్నది కానీ ప్రభుత్వం దానికి ముందే కొత్త సిఇసి పేరును ప్రకటించింది. ప్రతిపక్ష నాయకుని కేవలం నిర్ధారణ కోసం ఉపయోగించుకుంటున్నప్పుడు అటువంటి ఎంపిక కమిటీ వల్ల ఏమి ప్రయోజనం అని రాహుల్‌జీ కూడా అన్నారు’ అని ఖర్గే తెలిపారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత సమస్యలను కూడా ఖర్గే ప్రస్తావించారు.వాటి పరిష్కారంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. సంస్థను బలోపేతం చేయవలసిందిగా ఆఫీస్‌బేరర్లకు ఖర్గే విజ్ఙప్తి చేశారు.
‘రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి బూత్ స్థాయి వరకు సాధ్యమైనం త్వరగా సంస్థను బలేపేతంచేయవలసిన బాధ్యత మీది. ఈ పని కోసం మీరు స్వయంగా బూత్‌కు వెళ్లి, కష్టించి పని చేసి, కార్యకర్తలతో మాట్లాడవలసి ఉంటుంది. మన సంస్థాగత విభాగాలకు కూడా ప్రమేయం కల్పించవలసి ఉంటుంది. మనలో ఒక ముఖ్య భాగమైన భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్‌టియుసి) గురించి మాట్లాడాలని అనుకుంటున్నా. సంస్థాగత నిర్మాణంలో వారిని కూడా భాగస్వాములను చేయాలి’ అని ఖర్గే చెప్పారు. ఖర్గే సమావేశంలో తన తొలి పలుకుల్లో ఢిల్లీ మార్పు కోసం వోటు వేసిందని పేర్కొన్నారు.
వనరుల కొరత ఉన్నప్పటికీ గట్టి పోటీ ఇచ్చినందుకు రాష్ట్ర నాయకత్వాన్ని ఆయన కొనియాడారు. బిజెపి 26 ఏళ్లకు పైగా తరువాత ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన విషయం విదితమే. బిజెపి అసెంబ్లీలోని 70 సీట్లలోకి 48 సీట్లను గెలుచుకున్నది. ఆప్ 22 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్‌కు ఒక్కటీ దక్కలేదు. ఖర్గే ప్రభుత్వంపై విరుచుకుపడుతూ, యుఎస్‌ఎ నుంచి తిప్పిపంపుతున్న భారతీయులకు అవమానాన్ని అడ్డుకోవడంలో ప్రధాని విఫలమైనట్లు విమర్శించారు. ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ కార్యక్రమం వచ్చే సంవత్సరం కూడా కొనసాగుతుందని ఖర్గే ప్రకటిస్తూ, పాదయాత్ర, చర్చలు కూడలి సమావేశాలు వంటివి నిర్వహించవచ్చునని సూచించారు.