తన మాజీ ప్రియురాలు వేధిస్తుందంటూ భారత యువ క్రికెటర్ కెసి కరియప్ప బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన క్రికెట్ కెరీర్ నాశనం చేస్తానంటూ తన ఎక్స్ గర్ల్ఫ్రెండ్ దివ్య బెదిరిస్తుందని.. సూసైడ్ నోట్ లో తన పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేస్తుందని ఫిర్యాదు లేఖలో కరియప్ప పేర్కొన్నారు. దివ్య ప్రవర్తన నచ్చక ఆమెతో ఎప్పుడో బ్రేకప్ అయ్యానని.. అప్పటినుంచి తనను వేధిస్తుందని తెలిపాడు. ఆమెకు డ్రగ్స్, మందు వంటి చెడు అలవాట్లు ఉన్నాయని.. చాలా మందితోనూ లైంగిక సంబధాలు కూడా పెట్టుకుందని చెప్పాడు.
అయితే, ఏడాది క్రితమే.. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేేశాడని కరియప్పపై దివ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను గర్భవతిని చేసి, తర్వాత బలవంతంగా అబార్షన్ టాబ్లెట్స్ వేసుకునేలా చేశాడని.. ఆ తర్వాత తనను వదిలేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు అలా కొనసాగుతుండగా.. ఇప్పుడు కరియప్ప, తనను దివ్య బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుందని గత శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, 2015లో కెసి కరియప్ప.. ఐపిఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున బరిలోకి దిగిన కరియప్ప.. ఆ సీజన్ లో ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ప్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించాడు. 2019, 2020లో మళ్లీ కెకెఆర్ తరుపున ఆడిన కరియప్పను.. 2021లో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఐపిఎల్ లో రాణించిన కరియప్ప బెంగళూరు జట్టకు ఎంపికయ్యాడు.