అదే పేరుతో పోలీసు స్కూళ్లు,
స్పోర్ట్ స్కిల్ యూనివర్శిటీ
హోంగార్డు నుంచి డిజిపి స్థాయి
ఆఫీసర్ల పిల్లలకు పోలీసు
స్కూల్‌లో అడ్మిషన్లు దేశ
భవిష్యత్ తరగతి గదుల్లోనే
అందుకే ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్
అనేది నా బ్రాండ్ ఆర్మీ స్కూళ్లతో
మనం పోటీ పడలేమా? స్కిల్
వర్శిటీలో చదివిన వారికి 100%
జాబ్స్ ప్రతి సెగ్మెంట్‌లో యంగ్
ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్
వీటి కోసం రూ.11వేల కోట్లు ఖర్చు
చేస్తాం యంగ్ ఇండియా పోలీసు
స్కూల్ ప్రారంభోత్సవంలో సిఎం
మన తెలంగాణ/హైదరాబాద్:‘యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్’ అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమాన్ని కొందరు తమ బ్రాండ్ గా గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 16 నెలలైనా బ్రాండ్ ఎందుకు సృష్టించుకోలేదని కొం దరు నన్ను అడిగారని యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ అని రేవంత్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మం చిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలో నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సిఎంకు ఒక బ్రాండ్ ఉందన్నారు. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్‌ఆర్ అని, రూ.2కిలో బియ్యం అంటే ఎన్టీఆర్ అని, ఐటీ అంటే చంద్రబాబు గుర్తొస్తారని ఆయన పేర్కొన్నారు.
కొద్దిమంది తీసుకున్న నిర్ణయాలు చరిత్రను మలుపు తిప్పాయని, ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే ఈరోజు తాను క్రియేట్ చేసిన ‘యంగ్ ఇండియా’ బ్రాండ్‌ను మహాత్ముడి స్ఫూర్తితో తెలంగాణలో క్రియేట్ చేసుకున్నామన్నారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని, అందుకే ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అనేది తమ బ్రాండ్ అని, నిరుద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నామని ఆయన తెలిపారు. దేశంలోనే ది బెస్ట్ యూనివర్సిటీగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీర్చిదిద్దుతున్నామని ఆయన తెలిపారు. ఆనంద్ మహేంద్రను యూనివర్సిటీకి చైర్ పర్సన్‌గా నియమించుకున్నామని, యూనివర్సిటీలో చేరిన ప్రతి విద్యార్థికి ఉద్యోగ భద్రత ఉందని, దేశంలోనే ది బెస్ట్ యూనివర్సిటీగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
వచ్చే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీ, అకాడమీని ఏర్పాటు చేసుకోబోతున్నామని సిఎం చెప్పారు. ప్రాథమిక స్థాయిలోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకోకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్నారు. సౌత్ కొరియాకు ఒలింపిక్స్‌లో 32 గోల్ మెడల్స్ వచ్చాయని,140 కోట్ల మంది జనాభా ఉన్న భారత్‌కు ఒక్క గోల్డ్ మెడల్ రాలేదని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. చిన్న స్పోర్ట్ వర్శిటీ సౌత్ కొరియా ఖ్యాతిని పెంచిందన్నారు. తెలంగాణ ప్రతి ఏడాది లక్షా10 వేల ఇంజనీర్లను తయారు చేస్తోందన్నారు. కొందరు ఇంజనీర్లు దరఖాస్తులు కూడా నింపలేకపోతున్నా రన్నారు. త్వరలోయంగ్ ఇండియా స్పోర్ట్ వర్శిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్ అకాడమీ ఏర్పాటు చేస్తామన్నారు. యంగ్ ఇండియా వర్శిటీలో నాలుగేళ్లు చదివితే డిగ్రీ సర్టిఫికెట్ వస్తుందని, స్కిల్ వర్శిటీలో చదివిన వారికే 100 శాతం ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రతి సెగ్మెంట్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. వీటి కోసం రూ.11.500 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ప్రభుత్వ విద్యారంగంలోనే చిన్న అస్పష్టత ఉందని, రాష్ట్రంలో 29,500 ప్రభుత్వ స్కూళ్లు ఉన్నాయని, అందులో 18 లక్షల 50 వేల విద్యార్థులు ఉన్నారని ఆయన తెలిపారు.
ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచాం
యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ప్రతి పోలీస్ సిబ్బందికి అత్యంత ముఖ్యమయ్యిందని, ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సైనిక్ స్కూళ్లకు ధీటుగా పోలీస్ స్కూల్‌ను తీర్చిదిద్దాలని ఇందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని సిఎం స్పష్టం చేశారు. పోలీస్ స్కూళ్లను ఆదర్శంగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యతని సామాజిక బాధ్యతగా ప్రైవేటు కంపెనీలు పోలీసు స్కూళ్ల ఆర్ధిక సాయం అందించాలని ఆయన కోరారు. పోలీసు స్కూళ్ల కోసం రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్ క్రియేట్ చేసుకోవాలని అందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పోలీస్ శాఖతో తనకు అత్యంత అనుబంధం ఉందని ఆయన తెలిపారు. పోలీసుల పిల్లలకు మెరుగైన విద్య అందిస్తామని, హోంగార్డ్డు నుంచి డిజిపి వరకు పోలీస్ పిల్లలను యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో జాయిన్ చేయాలని ఆయన సూచించారు. ఆర్మీ స్కూళ్లతో మనం పోటీ పడాలని సిఎం రేవంత్ అన్నారు.
కొందరు మాత్రమే చరిత్రలో గుర్తిండిపోతారు
ఆనాడు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ సారథ్యంలో దేశంలో యూనివర్సిటీల పునాదులు పడ్డాయని, నెహ్రూ దార్శనికతతోనే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరిందన్నారు. దేశ చరిత్రలో ఎంతో మంది ప్రధానులు, ముఖ్యమంత్రులు అయ్యారని, కానీ, అందులో కొద్ది మంది మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయారని ఆయన అన్నారు. భవిష్యత్ తరాలకు ఏమీ అవసరమో ఆ ప్రణాళికలు సిద్ధం చేయడమే తమ ప్రాధాన్యతగా ఆయన పేర్కొన్నారు. కొందరు తీసుకునే నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయని ఆయన తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో
ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో కనీస వసతులు లేవన్నారు. ప్రతి నియోజక వర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని 25 ఎకరాల్లో స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రతి స్కూల్‌కు రూ. 200 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులు ఎక్కువని, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యావంతులు ఎక్కువగా ఉన్నారన్నారు.
పిల్లలతో పుట్‌బాల్ ఆడిన సిఎం రేవంత్‌రెడ్డి
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించిన అనంతరం క్లాస్ రూంలను ముఖ్యమంత్రి పరిశీలించారు. కాసేపు గ్రౌండ్‌లో పిల్లలతో కలిసి సిఎం రేవంత్‌రెడ్డి ఫుట్ బాల్ ఆడారు. 2024 అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం యంగ్ ఇండియా పోలీస్ స్కూళ్లకు ప్రభుత్వం శంకుస్థాపన చేయగా గురువారం దానిని సిఎం ప్రారంభించారు. ప్రభుత్వం 50 ఎకరాల్లో ఈ స్కూల్‌ను నిర్మించింది. తెలంగాణలోని పోలీసు, అగ్నిమాపక, ఎక్సైజ్, ఎస్పీఎఫ్, అమరవీరులు ఇతర యూనిఫాం సర్వీస్ విభాగాల పిల్లలకు ఈ స్కూల్ లో విద్య అందించనుంది. అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో ఈ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. మొదటివిడతలో 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఈ స్కూల్‌ను ప్రారంభించగా స్థానికులకు 15 శాతం అడ్మిషన్లు కల్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు.