Saturday, December 21, 2024

తొలి ఎన్నికలోనే సత్తా చూపిన యువ నేతలు

- Advertisement -
- Advertisement -

మంత్రినే ఓడించిన మామిడాల యశస్విని రెడ్డి
భారాస అభ్యర్థి పద్మాదేవేందర్‌ రెడ్డిపై రోహిత్‌ రావు గెలుపు
నారాయణపేటలో కాంగ్రెస్ యువనేత చిట్టెం పర్ణికారెడ్డి జయకేతనం

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు చేరువైంది. . ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పలువురు యువ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. ఇది వరకు రాజకీయాలతో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేకపోయినా తొలి ఎన్నికల్లోనే సత్తాచాటి విజయదుందుభి మోగించారు. వీరిలో మెదక్‌లో మైనంపల్లి రోహిత్‌రావు, పాలకుర్తిలో మామిడాల యశస్వినిరెడ్డి, నారాయణపేటలో చిట్టెం పర్ణికారెడ్డి జయకేతనం ఎగురవేశారు.
అనూహ్యంగా వచ్చి..మంత్రినే ఓడించి :
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 26 ఏళ్ల మామిడాల యశస్వినిరెడ్డి అనూహ్యంగా బరిలో నిలిచి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, భారాస అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఆమె ఓడించారు. 2018లో బీటెక్ పూర్తి చేసిన ఆమె వివాహం అనంతరం అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడ కొంతకాలం స్థిరాస్తి వ్యాపార సంస్థలో పనిచేశారు. వాస్తవానికి పాలకుర్తి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తొలుత వేరే అభ్యర్థిని ప్రకటించింది. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు విదేశాల నుంచి వచ్చిన హనుమాండ్ల ఝాన్సీరెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్టానం ఎంపిక చేసింది. అయితే భారత పౌరసత్వం కోసం ఆమె చేసుకున్న దరఖాస్తు ముందుకు కదలకపోవడంతో ఆమె పోటీ నుంచి తప్పుకొన్నారు. దీంతో ఆమె తన స్థానంలో కోడలు యశస్వినికి అవకాశమివ్వాలని కోరడంతో కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించి టికెట్ ఇచ్చింది.
డాక్టర్.. ఎమ్మెల్యేగా :
మెదక్ స్థానం నుంచి 26 ఏళ్ల మైనంపల్లి రోహిత్ విజయం సాధించారు. భారాస అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డిపై గెలిచారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు కుమారుడైన రోహిత్‌రావు మేడ్చల్‌లోని మెడిసిటీ వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్ పూర్తిచేశారు. రెండు గోల్ మెడల్స్ సైతం సాధించారు. హైదరాబాద్‌లో వైద్యుడిగా ఉంటూనే మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. మెదక్ నుంచి రోహిత్‌కు భారాస టికెట్ ఇవ్వాలని మైనంపల్లి హన్మంత్‌రావు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అయితే భారాస అందుకు నిరాకరించింది. దీంతో తండ్రీ కుమారులిద్దరూ కాంగ్రెస్‌లో చేరారు. కోరుకున్నవిధంగా హన్మంత్‌రావు మల్కాజిగిరి నుంచి రోహిత్ మెదక్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. పద్మాదేవేందర్‌రెడ్డిపై రోహిత్ 9వేలకుపైన మెజారిటీతో విజయం సాధించారు.

నారాయణపేట నుంచి చిట్టెం పర్ణికారెడ్డి : మరోవైపు నారాయణపేట నియోజకవర్గం నుంచి 30 ఏళ్ల చిట్టెం పర్ణికారెడ్డి గెలుపొందారు. భారాస అభ్యర్థి రాజేందర్‌రెడ్డిపై 7,950 ఓట్ల ఆధిక్యతో ఆమె విజయం సాధించారు. చిట్టెం పర్ణిక రెడ్డి ప్రస్తుతం భాస్కర వైద్య కళాశాలలో పీజీ (రేడియాలజిస్ట్) చేస్తున్నారు. ఈమె తాత చిట్టెం నర్సిరెడ్డి మక్తల్ ఎమ్మెల్యేగా, అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్‌గాను, తన తండ్రి చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి పీసీసీ సభ్యుడిగా పనిచేశారు. 2005 ఆగస్టులో మావోయిస్టుల కాల్పుల్లో చిట్టెం నర్సిరెడ్డితో పాటు వెంకటేశ్వర్‌రెడ్డి మరణించారు. ఆ తర్వాత 2009లో కొత్తగా ఏర్పాటైన నారాయణపేట నియోజకవర్గ రాజకీయాల్లో ఆమె మేనమామ కుంభం శివకుమార్‌ రెడ్డి క్రియాశీలకంగా ఉన్నారు. గత రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి స్వల్ప తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఈ ఎన్నికల్లో మహిళా కోటాలో
చిట్టెం పర్ణికా రెడ్డికి అవకాశమిచ్చింది. పర్ణిక తల్లి లక్ష్మి (ఐఏఎస్) పౌరసరఫరాల శాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్నారు. బీజేపీ జాతీయ నేత , మాజీ మంత్రి డీకే అరుణ పర్ణికకు మేనత్త కావడం విశేషం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News