సిటిబ్యూరోః బాలిక ఫొటోలు సేకరించి బ్లాక్‌మెయిల్ చేస్తున్న యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నగరానికి చెందిన బాలికకు ఇన్‌స్టాగ్రాంలో ఢిల్లీకి చెందిన యువకుడు పరిచయమయ్యాడు. కొద్ది రోజులు ఇద్దరు ఛాటింగ్ చేసుకున్న తర్వాత బాలిక నిందితుడికి మొబైల్ నంబర్ ఇచ్చింది. తర్వాత నిందితుడు బాలిక వద్ద నుంచి ఫొటోలు సేకరించాడు. అప్పటి నుంచి బ్లాక్‌మేయిల్ చేయడం ప్రారంభించాడు. తరచూ ఫోన్ చేసి మొబైల్ రీఛార్జ్ చేయాలని వేధిస్తున్నాడు.
దీంతో భయపడిన బాధితురాలు రెండు, మూడు సార్లు మొబైల్ రీఛార్జ్ చేసింది. అయినా కూడా నిందితుడు విడిచిపెట్టకుండా మూడు నెలల కోసారి మొబైల్ రీఛార్జ్ చేయాలని, లేకుండా మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ సైదులు, ఎస్సై ప్రసేన్‌రెడ్డి తదితరులు కేసు దర్యాప్తు చేశారు.