Monday, December 23, 2024

మైలార్‌దేవ్‌పల్లిలో జంట హత్యలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరో:  కుటుంబ తగాదాల నేపథ్యంలో తండ్రి, మామను ఓ యువకుడు హత్య చేసిన సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…పిఎస్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్‌కు చెందిన లక్ష్మినారాయణ(55) మద్యానికి బానిసగా మారాడు. తరచూ మద్యం తాగి వచ్చి భార్యాపిల్లలను వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలోనే సొంత ఇంటిని అమ్మాకానికి పెట్టారు. దీంతో ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బుల్లో తనకు రూ.20లక్షలు తనకు ఇవ్వాలని లక్ష్మినారాయణ భార్యతో శనివారం సాయంత్రం గొడవకు దిగాడు. డబ్బులు ఇచ్చేందుకు భార్య అంగీకరించకపోవడంతో ఆమెపై లక్ష్మినారాయణ దాడి చేశాడు. తండ్రి దాడి నుంచి తల్లిని కాపాడుకునేందుకు కుమారుడు రాకేష్ ప్రయత్నం చేశాడు. దీంతో రాకేష్‌పైన లక్ష్మినారాయణ దాడికి దిగాడు. దీంతో ఆవేశం పడిన రాకేష్ రాడును ఇంట్లో నుంచి తీసుకుని వచ్చి తండ్రిపై దానితో దాడి చేస్తూ బయటికి తీసుకుని వచ్చాడు.

బయటికి వచ్చాక కూడా రాడ్‌తో కొడుతుండగా వారి బంధువు శ్రీనివాస్(60)కు లక్ష్మినారాయణను కాపాడేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో రాకేష్ శ్రీనివాస్‌పై కూడా రాడ్‌తో దాడి చేశాడు. లక్ష్మినారాయణ అక్కడికక్కడే మృతిచెందగా, శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా తమ తండ్రి రోజు మద్యం తాగి వచ్చి తమను వేధించేవాడని కూతురు ఆమని తెలిపింది. స్థానికులు అడ్డుకోవడానికి యత్నించినా కూడా నిందితుడు వారిని వెంటపడి రాడ్‌తో కొట్టి చంపాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News