సీరియల్ నటిని ప్రేమ, పెళ్లి పేరుతో వేధింపులకు గురిచేసిన యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఎపిలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ(29) యూసుఫ్‌గూడలో పిల్లలతో కలిసి ఉంటోంది. సీరియల్‌లో నటిస్తూ కుటుంబాని పోషించుకుంటోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్‌లో ఓ సీరియల్ చేస్తున్న సమయంలో బత్తుల ఫణితేజ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది.ఈ క్రమంలోనే నవంబరులో ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పాడు. దీంతో సదరు మహిళ తనకు వివాహం అయిందని ఇద్దరు పిల్లలు ఉన్నారని, భర్తతో విభేదాలు రావడంతో దూరంగా ఉంటున్నానని చెప్పింది. యువకుడిని వివాహం చేసుకునేందుకు నిరాకరించింది.
దీంతో మహిళపై కోపం పెంచుకున్న యువకుడు అప్పటి నుంచి వేధించడం ప్రారంభించాడు. మహిళ మొబైల్ ఫోన్‌కు అసభ్యకరమైన సందేశాలు, వీడియోలు పంపుతున్నాడు. ఆమె అత్త ఇంటి చిరునామా తెలుసుకొని అక్కడికి వెళ్లి ఆమె గురించి చెడుగా చెప్పాడు. యువకుడి వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది, దీంతో వెంటనే దిగి వచ్చిన నిందితుడు తన ప్రవర్తన కారణంగానే ఇదంతా జరిగిందని ఆమెకు సెల్ఫీ వీడియో పంపించాడు. ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.