మహబూబాబాద్ : ఓ వైపు భారీ వర్షాలు.. వాగులు వంకలు పొంగుతు గ్రామాలు, గిరిజన గూడాలు జలమయం అయ్యాయి. విద్యుత్తు స్థంబాలు, ట్రాన్స్‌ఫార్మర్లు కూడా నీటముగిగాయి. దరిమిలా విద్యుత్తు సరఫరా గ్రామాలకు నిలిచిపోయింది. చుట్టూ నీరు, చిమ్మని చీకట్లలో జనాలు బిక్కుబిక్కుమంటూ గడుపాల్సిన దయనీయ దుస్థితి మహబూబాబాద్ జిల్లా పరిధిలోని ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారంలోని గ్రామాల ఆదివాసి గిరిజనులు ఎదుర్కోన్నారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్తు శాఖాధికారులు విద్యుత్తు సరఫరా పునరుద్దరణకు మొక్కవోని దీక్షతో పనుతు చేపట్టారు. అతి భారీ వర్షాల నేపథ్యంలో మహబూబాబాద్ విద్యుత్ సర్కిల్ పరిధిలోని కొత్తగూడ, గంగారం మండలాలు దట్టమైన అడవుల్లో వాగులు, వంకల్లో విద్యుత్తు పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్లు కూడా నీట మునిగిన పరిస్థితి. ఈ పరిస్థితుల నేపథ్యంలో పెగడపల్లి సబ్ స్టేషన్‌లోని 11కేవీ పోగుళ్లపల్లి ఫీడర్ వర్షాల కారణంగా గురువారం బ్రేక్ డౌన్ అయ్యింది.
ఈ విషయం తెలుసుకున్న మహబూబాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ నరేష్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ విజయ్, ఏడీఈ కవిత పర్యవేక్షణలో కొత్తగూడ సెక్షన్ ఏఈ సురేష్‌ను విద్యుత్ పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏఈ సురేష్ తన సిబ్బందితో పాటు కార్యరంగంలోకి దిగారు. తన వద్ద ఆన్ మ్యానేడ్ కార్మికుడిగా పనిచేస్తున్న బానోత్ శ్రీకాంత్‌ను ఈ మేరకు శుక్రవారం పనిలోకి పురమాయించారు. ఏఈ డైరెక్షన్‌లో పోగుళ్లపల్లి గ్రామ సమీపంలోని పాకాల వాగులో శ్రీకాంత్ అత్యంత దైర్య సాహసంతో గుండె నిబ్బరాన్ని ప్రదర్శిస్తు ప్రాణాలకు తెగించి నీటిలో ఈత కొట్టుకుంటూ 11 కేవీ విద్యుత్తు స్తంభం వద్దకు చేరుకున్నారు. అత్యంత కష్టం మీద స్తంభం ఎక్కి దాని జంపర్లను తెరవడం ద్వారా నాలుగు మునిగి ఉన్న విద్యుత్త ట్రాన్స్‌ఫార్మర్లకు పవర్ సరఫరా కాకుండా చేయగలిగాడు. దీంతో పోగుళ్లపల్లి , గోవిందపూర్, బోరింగ్ తండా, మొండ్రాయిగూడెం, మోకాళ్లపల్లి, చక్రాల తండా గ్రామాలకు విద్యుత్తు పునరుద్దరణ చేయగలిగారు.
శ్రీకాంత్ చూపిన అత్యంత సాహసోపేత పనితీరు వల్ల ఇన్ని గ్రామాలకు విద్యుత్తు సరఫరాను పునరుద్దరణకు మార్గం సుగమమైందంటూ అంతా శ్రీకాంత్ సేవలను కొనియాడుతూ అభినందించారు. దాదాపు ఈ ఆరు గ్రామాల్లో సుమారు 954 మంది జనాలు నివసిస్తుంటారని అధికారులు పేర్కోంటున్నారు. ఈ మేరకు శ్రీకాంత్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అధికారుల సూచనలు పాటిస్తూ తన విధి నిర్వహణలో చిత్తశుద్దిని ప్రదర్శించగా చీకట్లో మగ్గుతున్న వారికి వెలుగులు పంచిన అయన్ను ఉన్నతాధికారులతో పాటు ఆయా గ్రామ ప్రజలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.