ఎపిలో కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఫిజికల్ ఈవెంట్స్‌లో భాగంగా నిర్వహించిన పరుగు పందెంలో ఓ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కానిస్టేబుల్ దేహ ధారుడ్య పరీక్షల్లో భాగంగా కృష్ణా జిల్లాలో గురువారం జరిగిన 1600 మీటర్ల పరుగు పందెంలో ఏ.కొండూరు గ్రామానికి చెందిన ధరావత్ చంద్రశేఖర్ (25) అనే అభ్యర్థి పాల్గొన్నాడు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు లోనై కిందపడిపోయాడు. దీంతో పోలీస్ సిబ్బంది వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
దీంతో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకూ పోలీస్ కానిస్టేబుల్ అభర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతి రోజూ ఆయా కేంద్రాల్లో 600 మంది చొప్పున అభ్యర్థులకు ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్స్ పోస్టుల భర్తీకి 2022, నవంబర్ 28న నోటిఫికేషన్ విడుదలైంది. గతేడాది జనవరి 22న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించి ఫిబ్రవరి 5వ తేదీన ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 95,209 మంది అభ్యర్థులు ఫిజికల్ టెస్టులకు ఎంపికయ్యారు. వీరికి ప్రస్తుతం ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు.