Sunday, December 22, 2024

ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి: మృతదేహంతో ఆందోళన

- Advertisement -
- Advertisement -

దమ్మపేట : ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. దమ్మపేట మండలం, మల్లారం గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గండుగులపల్లి గ్రామానికి చెందిన పూచి నాగరాజు (30) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంను అప్పారావుపేట వైపు నుండి వస్తున్న మట్టి ట్రాక్టర్ ఢీకొనటంతో నాగరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. అడ్డూ అదుపు లేకుండా ట్రాక్టర్లతో జరుగుతున్న మట్టి అక్రమ తోలకాలే కారణమని నాగరాజు బంధువులు దమ్మపేటలో మట్టి తోలకాలు నిర్వహిస్తున్న ఓ నాయకుని ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మట్టి మాఫియా ఆగడాల వలనే నిండు ప్రాణం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ మట్టి రవాణ యధేచ్చగా సాగుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించటం వల్లే మట్టి ట్రాక్టర్లు హద్దు మీరి అతి వేగంగా తిరుగుతున్నాయని ఆరోపించారు.

Also Read: బాసరలో ఇద్దరు కూతుళ్లతో తల్లి ఆత్మహత్యా యత్నం

అయితే ఆందోళన చేపడతున్న బాధితులకు కాంగ్రెస్ నాయకులు తాటి వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు యార్లగడ్డ భాస్కరరావు మద్ధతు తెలపటంతో వివాదం ముదిరిపోవడంతో వారిని ముందుగా దమ్మపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించి అక్కడ నుంచి అశ్వారావుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి మట్టి ట్రాక్టర్లు నడిపిస్తున్న నాయకుని ఇంటి ముందు వరకు మృతదేహాన్ని చేతులపై మోసుకొచ్చి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగేంత వరకూ మృతదేహాన్ని తీసే ప్రసక్తే లేదని బాధితులు భీష్మించుకుని కూర్చోవటంతో పోలీస్‌లు రంగ ప్రవేశం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు పోలీస్‌లు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ బాధితులు రాస్తారోకోను విరమించకపోవడంతో అశ్వారావుపేట సీఐ బాలకృష్ణ, పాల్వంచ సిఐ నాగరాజు అక్కడకు చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

అయినప్పటికీ తమకు న్యాయం జరిగేంత వరకూ ఆందోళన విరమించే ప్రసక్తే లేదని వారు తేల్చిచెప్పటంతో చివరికి రెండు వైపులా భారీగా ట్రాఫిక్ ఆగిపోయి తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న తరుణంలో గ్రామస్థులు జోక్యం చేసుకుని మట్టి తోలకాలు జరుపుతున్న వ్యక్తి నుండి రూ. 2 లక్షలు నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించడంతో ఆందోళనను విరమించారు. దీంతో మృతదేహాన్ని అక్కడ నుంచి పోస్టుమార్టం నిమిత్తం అశ్వారావుపేట మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News