ట్రాఫిక్ పోలీసులను తప్పించుకునే క్రమంలో ఆర్‌టిసి బస్సు కింద యువకుడు పడి మృతిచెందిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐడిపిఎల్ వద్ద చోటుచేసుకుంది. యువకుడు మృతిచెందడంతో అతడి బంధువులు, వాహనదారులు ఆందోళన చేయడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో బాలానగర్ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం, గేదలంక గ్రామానికి చెందిన జోష్‌బాబు (35) భార్య ఇద్దరు పిల్లలతో కలిసి కుత్బుల్లాపూర్, షాపూర్, రొడామోస్ట్రీ నగర్‌లో ఉంటూ కార్పెంటర్ పనిచేస్తున్నాడు. తన సోదరుడు ఫణికుమార్ పంజాగుట్టకు రమ్మని చెప్పడంతో బైక్‌పై ఇంటి నుంచి సోదరుడి వద్దకు బయలు దేరాడు. బాధితుడు బైక్ వస్తుండగా ఐడిపిఎల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ఛాలాన్లు తనిఖీ చేస్తున్నారు.
జోష్‌బాబు వారి వద్దకు రాగానే ట్రాఫిక్ కానిస్టేబుల్ గోపాల్ షర్ట్ కాలర్ పట్టుకుని గుంజడంతో ఒక్కసారిగా అదుపు తప్పి కిందపడిపోయాడు. అదే సమయంతో ఆర్‌టిసి బస్సు జోష్ బాబు తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న జోష్ బాబు బంధువులు, వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మృతిచెందాడని ఆందోళనకు దిగారు. దీంతో ప్రమాదానికి కారణమైన ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడి నుంచి పరారయ్యాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యంతోనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ వాహనదారులు, బాధిత కుటుంబసభ్యులు రహదారిపైనే ఆందోళనకు దిగారు. దీంతో నర్సాపూర్ వెళ్లే రహదారిలో జీడిమెట్ల నుంచి బాలానగర్ వరకు వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసు ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించగా వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో బాలానగర్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది, పోలీసు బలగాలను అక్కడ భారీగా మోహరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ప్రశ్నిస్తే…లాఠీఛార్జ్ చేశారు..
పోలీసుల నిర్లక్షం వల్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడని ప్రశ్నిస్తే తమపై లాఠీఛార్జ్ చేశారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ వాహనాలను ఆపి తనిఖీ చేయాలని, కాలర్ పట్టడం ఏంటని ప్రశ్నించారు. వాహనం ఆపకుండా వెళ్తే చలానా విధించి ఇంటికి పంపించాలని తెలిపారు. పోలీసులు నిర్లక్షం వల్ల ఓ నిండు ప్రాణం పోయిందని, అతడి కుటుంబ సభ్యులు రోడ్డు మీదకు వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
కానిస్టేబుల్‌కు బ్రీత్ టెస్ట్….
తనిఖీలు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎ.గోపాల్ మద్యం మత్తులో ఉన్నాడని వాహనదారులు ఆరోపించడంతో పరీక్షల కోసం ఆస్పత్రికి పంపించారు. బ్లడ్ టెస్ట్ చేసి రిపోర్టు సబ్‌మిట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఇన్‌స్పెక్టర్ గోపాల్‌ను పరీక్షల కోసం ఆస్పత్రికి పంపించారు. రిపోర్టు వచ్చిన తర్వాత కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.