క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడి డబ్బులు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకొని దుర్మరణం చెందిన సంఘటన మంగళవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మేడ్చల్ మండలం, గౌడవెల్లి గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లికి చెందిన రమణ, కనకమ్మ దంపతులు 25 సంవత్సరాల క్రితం మేడ్చల్ మండలం, గుండ్లపోచంపల్లి గ్రామానికి జీవనోపాధి నిమిత్తం వచ్చారు. వీరికి ఒక కుమారుడు సోమేశ్ కుమార్ (29)తో పాటు ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె వివాహం కాగా సోమేశ్ కుమార్ దేవరయాంజాల్‌లోని ఓ గోదాంలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం డ్యూటీకి వెళ్లిన సోమేశ్‌కుమార్ గోదాంకు సంబంధించిన డబ్బులు తన వద్ద లక్ష రూపాయలు ఉండటంతో ఆ డబ్బులను క్రికెట్ బెట్టింగ్‌లో పెట్టాడు.
అయితే బెట్టింగ్‌లో డబ్బులు పోవడంతో గోదాంకు సంబంధించిన డబ్బులను తిరిగి ఎలా చెల్లించాలనే ఆలోచనలో పడ్డాడు. కంపెనీకి వెళ్లాలి.. లంబ్ బాక్స్ కట్టమని తన తల్లికి చెప్పి బయటకు వెళ్లాడు. విధుల నుంచి మళ్లీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అన్నిచోట్లా వెతికారు. అయితే, గోదాంలో చెల్లించేందుకు తన వద్ద డబ్బులు లేకపోవడంతో మనస్తాపానికి గురైన సోమేశ్‌కుమార్ గౌడవెల్లి గ్రామ పరిధిలోని రైల్వేపట్టాలపై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన స్నేహితులకు లోకేషన్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాగా, సోమేశ్ కుమార్ గతంలో కూడా బెట్టింగ్‌లకు పాల్పడి మూడున్నర లక్షల వరకు డబ్బులను పోగొట్టినట్లు అతని తండ్రి రమణ తెలిపారు. సోమేశ్‌కుమార్‌కు సోమవారం గోదాం యాజమాన్యం రూ.10 వేల వేతనాన్ని కూడా పెంచినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.