బూర్గంపాడుః పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండల పరిధిలోని మోతే పట్టీనగర్‌లో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎస్సై రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని సారపాక గ్రామానికి చెందిన గజ్జల ప్రవీణ్ కుమార్ అలియాస్ గజ (23)కు అదే గ్రామానికి చెందిన గుమ్మడి సతీష్, అఖిల్, జేమ్స్, మౌలు లక్కీలకు గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఎలాగైనే ప్రవీణ్ కుమార్‌ను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశ్యంతో శుక్రవారం ఉదయం పథకం ప్రకారం
ఆ నలుగురు వ్యక్తులు కలిసి మోతే పట్టీనగర్ గ్రామంలో కాపు కాసి ప్రధాన సెంటర్లో కర్రలతో తలపై విచక్షణారహితంగా దాడిచేయగా ప్రవీణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన సమాచారం అందుకున్న ఎస్‌ఐ రాజ్‌కుమార్‌తో పాటు భద్రాచలం సిఐ నాగరాజురెడ్డి అక్కడకు చేరుకుని ఈ హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సంఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడు ప్రవీణ్ కుమార్ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో దొంగతనం, కొట్లాట కేసుల్లో నిందితునిగా ఉన్నాడు. మృతుని తల్లి గజ్జల అలివేలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.