టెహ్రాన్ : ఇరాన్ లోని సౌత్ సెంట్రల్ ప్రావిన్స్ కెర్మాన్‌లో 30 ఏళ్ల యువకుడు వేటకు ఉపయోగించే కలష్నికోవ్ రైఫిల్‌తో తన తండ్రి, సోదరుడితో సహా మొత్తం 12 మంది దగ్గరి బంధువులను కాల్చి చంపిన సంఘటన జరిగింది. ఈ సమాచారాన్ని అధికారిక మీడియా శనివారం వెల్లడించింది. కెర్మాన్ ప్రావిన్స్ జస్టిస్ విభాగం అధిపతి ఇబ్రహీం హమీదీ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. నిందితుడిని ఇంకా గుర్తించలేదని చెప్పారు.
ఇరాన్‌లో సామూహిక హత్యలు జరగడం చాలా అరుదు. మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరగడానికి కుటుంబ వివాదాలే కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వేటాడడానికి మాత్రమే రైఫిల్స్‌ను అనుమతిస్తారు. రెండేళ్ల క్రితం డిస్మిస్ అయిన ఓ ప్రభుత్వ ఉద్యోగి పశ్చిమ ఇరాన్‌లో ముగ్గురిని కాల్చిచంపాడు. ఐదుగురిని గాయపరిచాడు. ఆ తరువాత తనకు తాను కాల్చుకుని మృతి చెందాడు.