కానిస్టేబుల్ కొట్టాడని మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం రాంపూర్ గ్రామానికి చెందిన తలారి కిషన్ (36)అనే యువకుడు తన సెల్‌ఫోన్ పోయిందని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి బుధవారం రాత్రి వెళ్లినట్లు వారి బంధువులు తెలిపారు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ సాయిలు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించడమే కాక కొట్టాడని మనస్తాపంతో తన గ్రామానికి వెళ్లిన కిషన్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ సమీపంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
దీంతో హుటాహుటిన కిషన్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కాగా తన చావుకు కానిస్టేబుల్ కారణమని సూసైడ్ నోట్ రాసినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. యువకుడి మృతికి కారణమైన కానిస్టేబుల్ సాయిలు వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఎస్సై ప్రవీణ్‌రెడ్డి వారిని శాంతింపజేసి మెదక్ డిఎస్పీతో మాట్లాడించారు. న్యాయం చేస్తామని డిఎస్పీ హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.