ఎల్లారెడ్డి: కుంటుబ కలహాలతో ఓ యువకుడు నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో పడి మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్ర కారం లింగంపేట్ మండలం శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన చాకలి సాయిబాబా (30) ఎల్లారెడ్డి మండలం జంగమాయిపల్లి గ్రామానికి ఇల్లరికం అల్లుడిగా 7 సంవత్సరాల క్రితం కళవ్వతో వివాహం జరిగింది. గత కొద్దికాలంగా కుటుంబ కలహాలతో విసిగివేసారి, బుధవారం ఇంట్లో గొడవపెట్టుకుని గ్రామ శివారులోని నిజాంసాగర్ బ్యాక్‌వాటర్‌లో పడి తనువు చాలించాడు.
గురువారం ఉదయం మృతదేహం నీటిపై తేలడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బ్యాక్‌వాటర్ వద్దకు చేరుకుని శవాన్ని బయటకుతీశారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బోజ్జ మహేష్ వివరించారు. మృతుడికి మూడు నెలల కూతురు ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు.