వరుడు ఒక్కడే.. వధువులిద్దరు!
నేడు వివాహం, పెళ్లి ఆహ్వాన పత్రిక వైరల్
ఖమ్మం: మనం సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లతో ప్రేమించబడిన కథలను ఎన్నో చూసి ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో దర్శకుడు ఏమీ చెప్పలేక వారిద్దరు చెరో వైపు లాగుతున్నట్లు చూపిస్తూ శుభం కార్డు వేస్తారు. మరో అడుగు ముందుకెళ్తే ఇద్దరు హీరోయిన్లను వివాహం చేసుకున్న హీరో విషయంలో ఆయనకు ఇద్దరు అంటూ ఇరువురు భామల మధ్య నలిగిన హీరో కథను హాస్యోక్తంగానో, లేక పోతే సెంటిమెంట్ జోడించి చిత్రీకరిస్తారు. వీటికి భిన్నంగా ఎటువంటి పొరపాటు లేకుండా ఒకే ముహూర్తానికి… ఒకే కుటుంబానికి చెందని ఓ ఇద్దరు యువతులు ఒకే వ్యక్తిని వివాహం చేసుకుంటున్నట్లు తెలుపుతున్న ఓ ఆహ్వాన పత్రిక భద్రాచలం డివిజన్ లో సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. భద్రాచలం డివిజన్లోని చర్ల మండలానికి చెందిన సత్తిబాబు, స్వప్నకుమారి, సునీత అనేవారు చదువుకునే రోజుల నుంచి స్నేహితులు. సత్తిబాబు చర్ల మండలంలోని ఎర్రబోరు గ్రామానికి చెందినవాడు కాగా, స్వప్న దోసిళ్ళపల్లి గ్రామస్తురాలు. మరోవైపు సునీత అదే మండలానికి చెందిన కుర్లపల్లి గ్రామస్తురాలు. ఏం జరిగిందో తెలియదు కానీ, సత్తిబాబు ఇద్దరితో ప్రేమలో పడ్డాడు. అనంతరం ఈ విషయం తెలుసుకున్న స్వప్న, సునీతలు సత్తిబాబుతో కూర్చుని మాట్లాడి ఓ అంగీకారానికి వచ్చి గత కొన్ని సంవత్సరాలుగా సహజీవనం సాగిస్తున్నారు. గిరిజన కుటుంబానికి చెందిన వీరు మెల్లగా వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పడంతో వారు కూడా అంగీకారం తెలిపి ఈ నెల 8న ఉదయం గం.7.00లకు సత్తిబాబుకు, స్వప్న కుమారి, సునీతలతో వివాహం జరిపించేందుకు ఒక వరుడు, ఇద్దరు వధువుల తల్లిదండ్రులు.
అంగీకారాలతో వివాహం చేయడానికి నిశ్చయించారు. ఇదిలా ఉండగా ఈ వార్త సోషల్ మీడియా వేదికగా సంచలనంగా మారింది. ముహూర్తం సమయంలో వరుడు ముందు ఎవరికి తాళి కడతారనేదానిపై చర్చ కొనసాగింది. ఈ వివాహం చూసేందుకు ఆహ్వానం లేనప్పటికీ వెళ్ళేందుకు అనేక మంది సిద్ధమవుతున్నారు. సత్తిబాబు, స్వప్నకుమారి, సునీతలు ముగ్గురూ ఇంటర్ ఆపై చదువులు చదివి. ఉండటం గమనార్హం. ఏది ఏమైనప్పటికీ సత్తిబాబు ఒక కొత్త ట్రెండు తెరలేపారనడంలో ఎటువంటి సందేహం లేదు.