Thursday, January 23, 2025

ప్రేమ వివాహానికి అడ్డు వస్తున్నాడని ప్రియురాలి తండ్రిపై కాల్పులు

- Advertisement -
- Advertisement -

నగరంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. తమ ప్రేమకు అడ్డు వస్తున్నాడని ప్రియురాలి తండ్రిపై ఓ యువకుడు ఎయిర్ గన్‌తో కాల్పులు జరిపిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ వేంకశ్వర కాలనీలో రోడ్డు నంబర్ 14లో మల్లికారాణి అపార్ట్‌మెంట్‌లో రేవంత్ ఆనంద్( 57) కుటుంబంతో పాటు ఉంటున్నాడు. రేవంత్‌కు ఇద్దరు కుమార్తెలు కాగా, చిన్న కుమార్తె ఉన్నతి గడ్డి అన్నారంలోని వికాస్‌భారతి స్కూల్‌లో చదివింది. ఈ సమయంలో అంబర్‌పేటకు చెందిన గొగికర్ బల్విర్ ఆమె క్లాస్‌మేట్ కావడంతో పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరు కలిసి దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఈ సమయంలో ఇద్దరు ప్రేమించుకున్నారు, వివాహం చేసుకోవాలని భావించారు. ఈ విషయం ఉన్నతి తండ్రి రేవంత్ ఆనంద్‌కు తెలియడంతో ఉన్నత చదువుల పేరుతో అమెరికాకు పంపించాడు.

యువతి అమెరికా వెళ్లే వరకు గోగికర్ బల్వీర్‌కు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ విషయం గోగికర్ బల్వీర్‌కు తర్వాత తెలియడంతో రేవంత్ ఆనంద్ తమ ప్రేమకు అడ్డు వస్తున్నాడని కోపం పెంచుకున్నాడు.బల్వీర్ ఆరు నెలల క్రితం తన స్నేహితుడు గోపికి ఫోన్ చేసి తమ ప్రేమకు రేవంత్ ఆనంద్ అడ్డు వస్తున్నాడని, కాల్చి చంపివేస్తానని చెప్పాడు. గోపి ఈ విషయం రేవంత్‌ఆనంద్‌కు ఫోన్ చేసి చెప్పాడు. కొద్దిరోజుల తర్వాత యువతి ఇంటికి వచ్చి బల్వీర్ తాను మీ కూతురిని ప్రేమిస్తున్నానని గొడవ చేశాడు, ఎన్ని రోజులు ఉన్నా నిన్ను చంపివేస్తానని రేవంత్‌కు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో రేవంత్ ఆనంద్, బల్వీర్ తల్లిదండ్రులను పిలిపించి విషయం చెప్పి పంపించాడు. ఈ విషయం మనసులో పెట్టుకున్న బల్వీర్ ఆదివారం మధ్యహ్నం సమయంలో సరూర్‌నగర్ వేంకశ్వర కాలనీలోని యువతికి ఇంటికి వచ్చి కారు పార్కింగ్ చేస్తున్న రేవంత్ ఆనంద్‌తో వాగ్వాదానికి దిగాడు. తర్వాత ఎయిర్ గన్‌తో రేవంత్‌పై ఒక రౌండ్ కాల్పులు జరిపాడు, దీంతో రేవంత్ కుడి కంటి పైభాగంలో గాయం అయింది.

వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పక్కన ఉన్న అపార్ట్‌మెంట్‌లోకి పారిపోయి దాచుకున్నాడు. ఆగ్రహంగా ఉన్న బల్వీర్ రేవంత్ కారును ధ్వంసం చేశాడు. బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న సరూర్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేశారు. కారును ధ్వంసం చేసిన తర్వాత నిందితుడు పారిపోగా ఇన్స్‌స్పెక్టర్ సైది రెడ్డి అదుపులోకి తీసుకుని గన్, ఎయిర్‌పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన ఆనంద్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై సెక్షన్ 109, 324(4) బిఎన్‌ఎస్, సెక్షన్ 25(1) (బి) (ఏ) ఆర్మ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News