తంగళ్లపల్లి: మండల కేంద్రంలో గంజాయి మత్తులో యువకులు చిత్తయిపోతున్నారు. ధూమపాన వ్యసనానికి అలవాటు పడిన వీరు కొత్త కిక్కు కోసం వెర్రెక్కిపోతున్నారు. ఇలాంటి వ్యసనాలను ఆసరాగా చేసుకున్న గ్రామంలోని కొంత మంది వ్యక్తులు గుట్టుగా గంజాయివిక్రయాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో రోజురోజుకూ గంజాయి తాగే యువకుల సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా చిన్న వయసులోనే వాహనాలు వేగంగా నడుపుతూ ప్రమాదాల బారిన పడుతూ, ప్రేమ పేరుతో బలవన్మరణాలు చేసుకుంటూ జీవితాలను మద్యలోనే చిదిమేసుకుంటున్నారు. గ్రామంలోని ఇందిరానగర్, పద్మనగర్ పరిసర ప్రాంతాల్లో యువకులు ధూమపానం చేస్తూ కనిపిస్తుంటారు. నిర్మానుష్య ప్రాంతాలను అడ్డగా చేసుకుని ఈ మత్తుకు అలవాటు పడుతున్నారు. గంజాయి సేవించడం వలన వీరి మనస్తత్వంలో తేడా వచ్చి ఏంచేస్తున్నారో తెలియకుండా పోతోంది.
అర్ధరాత్రి వేళల్లో నైతే మరీ ఘోరంగా రోడ్డుపై వాహనాలను వేగంగా నడుపుతూ విచ్చల విడిగా విహారం చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఒక్కొసారి వాహనం అదుపు తప్పి తీవ్ర గాయాలతో పాటు ప్రాణాలు తీసుకున్న సంఘటనలు కూడా కోకొల్లలు. గతంలో గ్రామంలో కొంత మంది గంజాయి విక్రేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐనా కూడా గంజాయి విక్రయాలను కట్టడి చేయలేకపోతున్నారు. మత్తుకు అలవాటు పడిన యువకులు గంజాయిని తాగడం మానలేకపోతున్నారు. ఐతే వీరికి గంజాయి ఎక్కడి నుండి దొరుకుతుందో ఎవరూ సరఫరా చేస్తున్నారో మాత్రం తెలియకుండా పోతోంది. పోలీసులు గంజాయి సరఫరా చేస్తున్న స్థావరాలపై దృష్టి సారిస్తే గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం బహిర్గతమవుతుంది. తద్వారా ఎంతో మంది యువకుల జీవితాలు నాశనం కాకుండా కాపాడినవారవుతారని చెడు అలవాట్లకు బానిసైన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Young people are addicted to marijuana