ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 దాకా ఏడు విడతల్లో జరగనున్న పోలింగ్‌లో పాల్గొనే ‘తొలిసారి ఓటు వేసే ఓటర్లు’ కీలకం కానున్నారు. ఓటు వేయనున్న మొత్తం ఓటర్ల సంఖ్య 97.8 కోట్లు. కాగా అందులో కొత్త ఓటర్లే 1.90 కోట్లు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. దీనిని బట్టి చూస్తే తొలిసారి ఓటు వేసే యువ భారతం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనున్నారా అనిపిస్తుంది. తొలిసారి ఓటు హక్కు పొందిన యువత తమ ఓట్లను సద్వినియోగం చేసుకొని, ఉత్తమ నాయకులను పార్లమెంటుకు ఎన్నుకొని 18వ లోక్‌సభకు పంపించడం ద్వారా తమ కోరికలు, ఆశయాలు నెరవేర్చే నాయకులను ఎన్నుకొగలిగితే ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశంగా నిలువవచ్చు. 25 ఏండ్ల లోపు వయస్సు కలిగిన జనాభా 60% ఉన్న మన దేశంలో యువ ప్రభంజనం కొనసాగవచ్చు. దేశ యువత ప్రజాస్వామ్య పరిరక్షకులుగా, దేశోద్ధారకులుగా నిలబడగలిగితే దేశంలోని ప్రధాన సమస్యలన్నింటికీ సమాధానాలు దొరుకుతాయని నమ్మవచ్చు.
దేశంలో ఉన్న 97.8 కోట్ల ఓటర్లలో 49.72 కోట్ల మంది ఓటర్లు పురుషులు, 47.1 కోట్లు మంది మహిళలు నమోదు అయ్యారు. 1.89 కోట్ల మంది తొలిసారి ఓటర్లుగా 18- 19 ఏళ్ల వయసు గల ఓటర్లు 85 లక్షలుగా మిగిలిన వారు ఇతర వయసు గల వారు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో 91.2 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 61.5 కోట్ల మంది అంటే 67.4% ఓటు హక్కు వినియోగించు కున్నారు. ఈసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి శాతం పెంచడానికి ఇసి ఎన్నో రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వయో వృద్ధులు, వికలాంగులు ఓటు వేయడానికి పడుతున్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల కమిషన్ వారి ఓటు వినియోగం కోసం తమ ఉద్యోగులను ఇంటి వద్దకే పంపించే చర్యల వల్ల పోలింగ్ శాతం పెరగవచ్చు. సాధారణంగా యువతలో తమ భవిష్యత్తు అవసరాల పట్ల స్పష్టత, ఆలోచించి ఓట్లు వేయడం, ఇతర ఓటర్లను అధికంగా ప్రభావితం చేయడం,
గళమెత్తి నినదించడం, ప్రచారంలో దూసుకుపోవడం లాంటి వాటి వల్ల తొలిసారి ఓటు వేయనున్న యువతను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థు లు ప్రత్యేక ప్రణాళికలు, తమ మేనిఫెస్టోలో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల విశ్లేషణ ప్రకారం ఓటు హక్కు వినియోగించుకోవడంలో పురుషుల కన్నా మహిళలు, గిరిజనులు, వికలాంగులు, వృద్ధులు ముందంజలో ఉండడం గమనించిన నాయకులు ఇలాంటి ఓటర్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. పట్టణ ఓటర్ల కంటే గ్రామీణ భారతంలో ఉన్న ఓటర్లు అధిక శాతం ఓటు హక్కును వినియోగించుకొన్నారని గణాంకాలు తెలియచేస్తున్నాయి. 1989లో జరిగిన 61వ రాజ్యాంగ చట్ట సవరణ ఆధారంగా ఓటు హక్కు వయస్సు 21 నుంచి 18 ఏండ్లకు తగ్గించడం వల్ల యువతకు పరిపక్వ ఆలోచనలు, స్వతంత్రంగా సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానం వస్తుందని నమ్మకంతో తగ్గించినట్లు భావించవచ్చు. కాబట్టి వారిని పోలింగ్ బూత్‌కు రప్పించడానికి,
మంచి నాయకుడిని ఎన్నుకొనేలా ప్రోత్సహించడానికి భారత ఎన్నికల కమిషన్ వినూత్న అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ఓటు ప్రాధాన్యతను వివరించడం, ప్రతి ఒక్కరూ వేటు వేసేలా ప్రోత్సహించేలా వివిధ కార్యక్రమాలు చేపట్టింది. కళాశాల యువతకు అవగాహన కల్పించడం, ఓటర్లుగా నమోదు చేయించడం, సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించడం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓటర్ల నమోదును ఉద్యమంగా చేపట్టి అర్హులైన యువతకు ఓటు హక్కు కల్పించే ప్రయత్నాలు చేశారు. ఇంతటి ప్రాధాన్యత పొందిన యువత నూరు శాతం ఓటు హక్కును వినియోగించుకొని భావిభారత నిర్మాణానికి సహకరిస్తారని ఆశిద్దాం.