Thursday, January 23, 2025

కాలంతో నడిచిన కథలు

- Advertisement -
- Advertisement -

యువ కథారచయిత ’మేఘనాథ్ రెడ్డి’ చిత్తూరు జిల్లా వారు. రాయలసీమ ప్రజాజీవనాన్ని తనదైన శైలిలో పలికిస్తున్న కథకుడు. తన ప్రాంతాన్ని, అక్కడ నివసిస్తున్న ప్రజల భౌతిక అవసరాలను, మానసిక సంఘర్షణలను ప్రస్ఫుటింపజేస్తూ కథాగమనాన్ని నెరపగలరు. అందుకే రచయిత ”మావూరెంతిష్టమో, మావూరిని ఆనుకోనుండే అడివంటే గూడా అంతే ఇష్టం. యీ బుక్కులో ఉండేటి కతలు శ్యానామొటుకు నా పుట్నూరినింకా, మా అడివినింకా పుట్టిండేవే” అంటారు. తన కథలలోని వస్తువులు తేలికైనవి, కానీ శిల్పశైలీ నిర్మాణాలు బలంగా ఉంటాయి. ఒక సాధారణ విషయాన్ని అసాధారణ అంశంగా మలుస్తూ పాఠకులను రంజింప చేయడం మేఘనాథ్ రెడ్డికి తెలుసు. తన మొదటి కథలసంపుటి ’కలుంకూరిగుట్ట’ నేడు పందెంకోడై నిలిచింది.

అనేక పోటీల్లో గెలుపు గుర్రమై పురస్కారాలను అందుకుంటున్నది. సీమ మాండలికంలో రాయబడిన మరో కథలసంపుటిగా కలుంకూరిగుట్ట ప్రఖ్యాతినొందింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా జనజీవన మాధుర్యాల్ని, ఈతిబాధల్ని మెరుసువాడ మాండలిక శోభలో ముంచే కథా సంవిధానం పఠితుల మనసుల్ని మెలిపెడతోంది. సీమ యాస, పదబంధాలు ఆ ప్రాంత ప్రజల అరమరికలు లేని జీవనశైలిని చూపుతాయి. ఆ ప్రాంత ముందు తరం కథకులు సీమ సామాజిక నేపథ్యాలను తమ యాసలో అద్భుతంగా రాసారు. కానీ ఈ కథకుడు వర్ణనా శైలి వారి కంటే భిన్నంగా ఉంటుంది.‘పనిమంతుడు’ కథలో రంగి-రంగడు చంటిపిల్లాడిని, సరంజామాను మోసుకొని పొలాల్లో ఎలుకలను వేటాడుతుంటారు. అప్పుడు వారి మధ్య సంభాషణ ఆసక్తికరంగా సాగుతుంది. ‘మడిపైరులో ఎలకల్ని పట్టుకుంటే పంటని ఆరోకోరో కాపాడినోళ్లము అయితాము.

సేద్యగాడి నోటికి అంత బువ్వ దక్కతాది గదే‘ పక్కోడికి సాయం చేసే గుణమనేది పల్లెవాసుల సొంతం కదా! చంటోడికి జ్వరమొస్తే తల్లిదండ్రులు ఎలా తల్లడిల్లిపోతారో! రచయిత చూపిస్తాడు. రంగడికి చిన్నతనంలో జ్వరం వస్తే ’తన కన్నవారు ఎలా స్పందించారో! తన కొడుకు జ్వరంతో విలవిలలాడినపుడు భార్య, తానూ అలాంటి మానసిక సంఘర్షణకే గురయ్యారు. ‘మ్మెయ్… బిడ్డ కన్నానా మన ప్యానాలు చెప్పు, బతికేదే మన బిడ్డ కోసరం… బిడ్డలేని మన ప్యానాలు ఉంటేనేమి పోతినేమి‘ అనే తల్లిదండ్రులు ఆనాడు ఉంటే, తాము మాత్రం ‘చావైనా బతుకైనా నీతోనే…బతికితే ముగ్గురు బతకదాం. చచ్చిపోతే ముగ్గురు చచ్చిపోదాం’ ఇలా తరం తరంకీ మధ్య భావోద్వేగాలలో భేదాలను గమనించొచ్చు.

‘వాన మబ్బులు’ కథలో వాన కురిస్తే రైతులు ఎలా హర్షిస్తారో! చూపుతాడు. భూమిలేని నిరుపేదలు పట్నాలకు వలసలు పోవడం సహజం. ఎంతోకొంత భూమివున్న మధ్యతరగతి వారు వలసలు పోవడానికి ససేమిరా! అంటారు. సాగునీరు లేక, పంటలు పండక వారు అనేక ఇడుములు పడుతూనే ఆశాజనకంగా జీవిస్తారు. దీన్ని వారి వ్యవసాయక కౌటుంబిక సంస్కారమనవచ్చు. ఇది ఒకప్పటి మాట. కానీ నేడు మధ్యతరగతి వారు కూడా తద్భిన్నంగా పట్నాలకు వలసపోవడం చూస్తున్నాం. ఈ కథలో పిల్లలకి సరైన పోషక ఆహారాన్ని పెట్టలేని కుటుంబముంటుంది. కోడికూర తిని రెండేళ్లైన వారిని చూస్తాం. తండ్రి కోడికూర తీసుకురాగానే సభ్యులంతా ఆవురావురమంటూ పొయ్యిచుట్టూ చేరి, ఎప్పుడు కూర ఉడుకుతుందా! తిందామా! అనే స్థితిలో ఉంటారు. ఆ రోజుల్లో రైతులు కోళ్లు పెంచుకునేవారు.

కోడిగుడ్లను, మాంసాన్ని తాము తినేందుకు గాక, తమ అవసరాల పైకం కోసం అమ్ముకునేవారు. ఎప్పుడో ఒకప్పుడు గుడ్డు కూర వండితే, కుటుంబమంతా అరముక్కలుగా గుడ్డును పంచుకొని తినేవారు. ఇది నేడు వర్తించేది కాదు. ఆహార విప్లవంలో భాగంగా బ్రాయిలర్ కోడి పుట్టినాక ప్రజలందరూ కోడికూర సమృద్ధిగా తింటున్నారు. నేడు పాఠశాలల్లో ప్రభుత్వం రోజు తప్పించి ఇస్తున్న గుడ్లను పిల్లలు పారేయడం గమనిస్తున్నాం. ఈ కథ ముగింపులో ‘నా బిడ్డకి అట్లాంటి పరిస్థితి వస్తే కసుపుకోసే కొడవలితో మా ఇంటాయన గొంతు కోసేసి నేనూ సచ్చిపోతాను‘ అని ఒక స్త్రీ నోట తిరుగుబాటును లేవదీస్తాడు.
‘ఒలికిలి’ కథ రిజర్వాయర్ నిర్మాణ ముంపు గ్రామ పరిస్థితిని, అక్కడ ప్రజల దీనావస్థను వివరించేది. అనాదిగ సకల వనరులకు నిలయమైన గ్రామం, ఇతరులకు సకల వనరులను సమకూర్చే కల్పవల్లిగా మారే వైనాన్ని కథకుడు చూపిస్తాడు.

ఊరు మారే ప్రజలు రాబోవు రోజుల్లో పడే కష్టాలు, కడగండ్లు కానవస్తాయి. పిచ్చివాని రూపంలో యదార్ధాన్ని చెప్పేవాణ్ణి చూస్తాం. ‘పిచ్చోడు అయినా ఊరి బాగు కోరుతుండాడు కానీ ఏం చేద్దాం? మన చేతుల్లో ఏముండాది? ముందోచ్చే ఉపద్రవాన్ని ఆపటానికి ఎవరివళ్ళనా అయితాది‘ అంటూ పిచ్చివాని మాటలలో వాస్తవాన్ని ప్రజలు గ్రహిస్తారు. ఏడేడు పద్నాలుగేళ్ల కరువులో ‘బీదా, బిక్కి రెక్కలు తెగిన గువ్వపిల్లల్లా రాలిపోయిన కష్టకాలంలోనే మన్నుతినో, మాకుతినో బతికి బట్ట కట్టినామే‘ అనే జనం ఊరితో తమకు గల ప్రేమపాశాలను నెమరేస్తారు. జగన్నాథ్ పిచ్చోడు. అతని తల్లిదండ్రులు ఊరికి పెద్ద మనుషులు. ఊరి బాగు కోసం పోరాడినవారు. కానీ ఒక రాత్రి వేళ రక్తపు మడుగులో శవాలుగా కనిపిస్తారు. మరి వారిని ఎవరు చంపారు? అన్నది మిస్టరీగా చూపుతాడు రచయిత. ఎదిరించే వారిని ఆధిపత్యపుశక్తులు తుదముట్టించడం షరామామూలే కదా!
‘కలుంకూరి గుట్ట’ అనే కథలో గుట్ట గూర్చి చేసే వర్ణన అద్భుతంగా ఉంటుంది. ఒక కుంటలో నీరుని రచయిత వర్ణిస్తాడిలా. ’ఆనీళ్లు అరగదీసిన గంధం మాదిరి. అన్నంలో వంచిన గెంజి మాదిరి బలే చిక్కగా ఉంటాయి. ఆనీళ్లు నోట్లో పోసుకుంటే అముర్తం తాగినంత తీయ్యంగా ఉంటాయి‘ ఎవరైనా ఒక ప్రదేశాన్ని ఒకసారి చూసి వర్ణించడం చాలా కష్టం. ఆ ప్రదేశంతో విడదీయరాని బంధముంటే గాని అద్భుతమైన వర్ణన సాధ్యం కాదు. అక్కడ గడిపిన క్షణాలు ఆపాతమధురాలుగా మాటిమాటికి తలపుకు వచ్చినప్పుడే అరమరికలు లేని సాహితీ సృజనౌతుంది.

రచయితకు బాల్యం నుంచే ఆ ప్రాంతంతో అనుబంధం ఉంది. అది ఈ కథలో స్పష్టమౌతున్నది. ’చిన్నమ్మి-ఆనందు’ ల ప్రణయకళాపాలకు కలుంకూరిగుట్ట ఎలా సాక్ష్యమయ్యిందో చెబుతాడు. స్వచ్ఛమైన ప్రేమను పలికించిన ఈ కథలో చిన్నమ్మి ప్రేమభగ్నమై తనకు తాను ప్రాణత్యాగం చేసుకోవడం బాధిస్తుంది. ఊహించని ముగింపు పాఠకుల్ని కన్నీటి పర్యంతం చేస్తుంది. దీన్ని పుత్తడిబొమ్మ పూర్ణమ్మ కథ ముగింపుతో పోల్చవచ్చు.‘యర్రావుదూడ’ పశువులకు-రైతులకు మధ్యగల బంధాలను హృద్యంగా స్పృశిస్తాడు. ఇంట్లో కుటుంబ సభ్యులు లాగే ఆవులకు పేర్లు పెట్టుకోవడం గ్రామాల్లో చూస్తాం. యర్రక్క, తెల్లోడు, బొల్లిగాడు ఇలా మురిపెంగా పిలుస్తారు. పశువు-రైతుకు మధ్య గల సంబంధాలు ఉత్తరాంధ్రలో బాగా కనిపిస్తాయి. ఈ కథలో అడివి-గుట్ట వర్ణన సహజాతి సహజంగా ఉంది. పఠితులను రంజింపజేస్తుంది.

పల్లెవాసులు సంతోషమొచ్చినా, దుఃఖమొచ్చినా పాట ఎత్తుకుంటారు. ఆ పాటలోనే తమ కష్ట నష్టాలను మరచిపోతారు. ఈ కథలో కేశవుడిలా. ఈనిన యర్రావు వెంట కేశవుడు దూడను వెతుక్కుంటూ అడవికి పోతాడు. చివరకు దూడ మరియు తప్పిపోయిన ఆవులు కనబడతాయి. తెల్లావు కొమ్ముల్లో రక్తం మరకలు కనిపిస్తాయి. దూడను తినడానికి వచ్చిన క్రూర జంతువులను ఎదిరించే ఆనవాళ్ళది. తన గొడ్లును చూసి ఎంతో గర్వపడతాడు. పశువుల్లా మనుషులు కూడా ఐక్యతతో తమ మనుగడను కాపాడు కోవాలని రచయిత అభిలషిస్తాడు.దాదాపుగా కథలన్నీ పాజిటివ్ దృక్పథాన్ని నేర్పుతూ ఆసక్తిదాయకంగా సాగుతాయి. పాత్రౌచిత్యం బాగుంది. నరాలను పిండేసే సంభాషణలు అదనం. తన పరిసరాలను, అనుభవాలను వినియోగించుకునే విధానం భళేగా ఉంది. అంతేకాదు మహిళల సున్నితమైన ధిక్కారముంది.

ఆ తిరుగుబాటులో బలమైన వ్యక్తీకరణ ఉంది. కాకపోతే నిర్దిష్టమైన సిద్ధాంతం కొరవడింది. ప్రతీ కథలోనూ దేవుడి మీద భారం మోపారు. క్షేత్రస్థాయిలో అలాంటి మనుషులు ఉన్నాగానీ, ఇది సామాజిక సాహిత్యానికి మంచిది కాదు. ముండమోసిన పదం పలు కథల్లో పునరావృతం కాకుండా ఉండాల్సింది. పలు కథల్లో వచ్చిన పాటలు పాఠకులను ఉల్లాసపరుస్తాయి. ఈ రచయితలో నూతన పంథాలో కథలను నిర్మించే నైపుణ్యం ఉంది. మంచి భవిష్యత్తు ఉన్న కథకుడిగా మేఘనాథ్ రెడ్డి రూపుదిద్దు కుంటున్నందున వారికి అభినందనలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News