బెంగళూరులో 29 ఏళ్ల యువతి మహలక్ష్మి హత్య కేసులో నిందితుడు ఒడిశాలో దాగున్నాడని సమాచారం అందడంతో అక్కడకు నాలుగు పోలీస్ బృందాలు బయలుదేరి వెళ్లాయని కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర బుధవారం వెల్లడించారు. విలేఖరులతో మాట్లాడుతూ నిందితుడు అరెస్టయితే ఈ కేసు వివరాలు అన్నీ బయటపడతాయని తెలిపారు. ఇప్పటివరకు పోలీస్‌లు ఇద్దరు ముగ్గురిని అదుపు లోకి తీసుకుని విచారణ ప్రారంభించారని చెప్పారు. వారు చెప్పిన ఆధారాల ప్రకారం నిందితుడు ఒడిశాలో దాగున్నాడని తెలిసిందన్నారు. మహలక్ష్మి నివాసం నుంచి రెండు రోజుల పాటు చెడువాసన వస్తుండడంతో ఇరుగుపొరుగు వారు పోలీస్‌లకు సమాచారం అందించారు.
దాంతో ఆమె నివాసం లోని ఫ్రిజ్ నుంచి మహలక్ష్మి మృతదేహం మొత్తం ఏబైకి పైగా ముక్కలుముక్కలుగా బయటపడింది. రిఫ్రెజిరేటర్ ఆన్‌లోనే ఉన్నప్పటికీ మహలక్ష్మిమృతదేహం పురుగులు పట్టి ఉంది. మహలక్ష్మి తల్లి, సోదరి తరువాత వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. త్రిపుర నుంచి బెంగళూరుకు వచ్చిన మహలక్ష్మి బెంగళూరు లోని ఓ మాల్‌లో పనిచేసేది. ఐదు నెలలుగా ఆమ ఒంటరిగానే ఉంటోందని , ఇరుగుపొరుగు వారితో కలిసిమెలసి ఉండేది కాదని అక్కడి వారు చెప్పారు. ఆమె సోదరుడు కొన్నాళ్లు ఆమెతో కలిసి ఉండేవాడని చెప్పారు. ఆమెకు పెళ్లయిందని, కుమారుడు కూడా ఉన్నాడని అయితే భర్తతో విడిపోయిందని పోలీస్‌లు చెప్పారు. నిందితుడు వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని, బెంగళూరులో కొన్నాళ్లు ఉండేవాడని పోలీస్‌లు తెలిపారు.