ఖమ్మం/కరకగూడెం: పది రోజుల్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవాల్సిన యువతి కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల పరిధిలోని రేగుళ్ళ గ్రామంలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని తుమ్మలగూడెం పంచాయితీ, రేగుళ్ళ గ్రామానికి చెందిన జనగం మానస (20)కు అదే గ్రామానికి చెందిన చప్పిడి ప్రశాంత్ అనే యువకుడితో వివాహం జరిపించేందుకు పెద్దలు నిర్ణయించారు. ఈ నెల 22న ముహూర్తం ఖరారు చేశారు. సోమవారం మృతురాలి తండ్రి పుల్లయ్య, అన్న చందు మధ్య చిన్న గొడవ జరిగి, ఈ విషయంపై బుధవారం తండ్రి పుల్లయ్య కరకగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
మంగళవారం రాత్రి అన్న పెళ్ళి పత్రికలను కాలపెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మనస్థాపానికి గురైన మానస పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు మణుగూరు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మానస తుది శ్వాస విడిచింది. విషయం తెలుసుకున్న కరకగూడెం పోలీస్‌లు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మణుగూరు వైద్యశాలకు తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీస్‌లు తెలిపారు.